వచ్చే ఎన్నికల్లో కుప్పంలో చంద్రబాబునాయుడును ఎలాగైనా ఓడించాలని జగన్మోహన్ రెడ్డి టార్గెట్ గా పెట్టుకున్నారు. ఇందులో భాగంగానే పెద్ద వ్యూహమే పన్నుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అదేమంటే మూడు సామాజిక వర్గాల సహకారంతోనే చంద్రబాబును ఓడించేందుకు జగన్ ప్లాన్ రెడీ చేస్తున్నారట. ఈ ప్లాన్ ఇచ్చింది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డే అని అందుకనే ప్లాన్ ను అమల్లోకి తెచ్చే బాధ్యతను కూడా జగన్ మంత్రి మీదే పెట్టినట్లు సమాచారం.
ఇంతకీ జగన్ అసలు ప్లాన్ ఏమిటంటే కుప్పం నియోజకవర్గంలో బీసీ సామాజికవర్గం ఓట్లే ఎక్కువ. ఈ సామాజికవర్గంతో పాటు రెడ్లు, బ్రాహ్మణులను ఏకం చేస్తే చంద్రబాబును ఓడించడం తేలిగ్గా జరుగుతుందని అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగానే పై మూడు సామాజికవర్గాలకు పదవుల్లో ప్రాధన్యత ఇస్తున్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన భరత్ కు ఎంఎల్సీ ఇవ్వటం ఇందులో భాగమే. 2019 ఎన్నికల్లో చంద్రబాబుకు గట్టిపోటీ ఇచ్చిన చంద్రమౌళి కొడుకే భరత్. ఇక కుప్పం మున్సిపల్ ఛైర్మన్ గా డాక్టర్ దర్భా సుదీర్ బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన సీనియర్ నేత. డాక్టర్ గా కుప్పంలో మంచి పేరుంది. ఇక రెడ్డి సామాజిక వర్గం నుండి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు భాస్కర్ రెడ్డి కొడుకు సుధీర్ రెడ్డిని తెరపైకి తెస్తున్నారు.
ప్రస్తుతం మంత్రి తరపున సుధీర్ రెడ్డి ఇటు పుంగనూరు అటు కుప్పంలో ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. తొందరలోనే కుప్పంకు పూర్తి ఇన్చార్జి బాధ్యతలు అప్పగించబోతున్నారట. అంటే కుప్పంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలే కాకుండా జరగబోయేవి కూడా సుధీర్ రెడ్డి+భరత్+సుధీర్ ఆధ్వర్యంలోనే జరగబోతున్నాయి. జగన్ వ్యూహం ప్రకారం బీసీ+రెడ్డి+బ్రాహ్మణ సామాజికవర్గాలను ఏకతాటిపైకి తీసుకొస్తే చంద్రబాబును ఓడించటం చాలా తేలిక. ఎస్సీ, మైనారిటీ, ఎస్టీలు ఎలాగూ వైసీపీకే మద్దతుగా నిలుస్తున్నారు.
కాబట్టి కుప్పంలో వచ్చే ఎన్నికల్లో వైసీపీ జెండా ఎగరాలంటే సామాజికవర్గాల సమతూకం సరిగ్గా జరగాలనేది జగన్ ప్లాన్. దీని ప్రకారమే అంతా పక్కాగా అమలు చేస్తున్నారు. ఇదే ప్లాన్ మొన్నటి స్ధానికసంస్ధల ఎన్నికల్లో బాగా వర్కవుటైంది. కాబట్టి దీన్ని ఇలాగే కంటిన్యు చేస్తే చంద్రబాబును ఓడించటం పెద్ద కష్టం కాదని జగన్, పెద్దిరెడ్డి అనుకుంటున్నారు. చివరకు ఏమవుతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates