మోడీ నుంచి ఏపీకి ఘాటు లేఖ.. ఏం జ‌రిగింది?

ఏపీ ప్ర‌భుత్వంపై కేంద్రంలోని న‌రేంద్ర మోడీ ప్ర‌భుత్వం తొలిసారి చాలా తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్ర‌భుత్వ వ‌ర్గాల క‌థ‌నం మేర‌కు.. ప్ర‌ధాని తొలిసారి ఇంత ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన‌ట్టు తెలిసింది. ముఖ్యంగా సీఎం జ‌గ‌న్ చేస్తున్న ప‌నులపై ప్ర‌ధాని సీరియ‌స్‌గా ఉన్నార‌ని వారు అంటున్నారు. ఈ క్ర‌మంలోనే తాజాగా కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ.. జ‌గ‌న్ ప్ర‌భుత్వానికి లేఖ సంధించారు. ప్ర‌స్తుతానికి ఈ లేఖ గోప్యంగా ఉంచిన‌ప్ప‌టికీ… ఢిల్లీ వ‌ర్గాలు మాత్రం బ‌య‌ట పెట్టాయి. విష‌యం ఏంటంటే.. ఏపీలో జ‌గ‌న‌న్న గోరుముద్ద‌, జ‌గ‌న‌న్న స్వ‌చ్ఛ సంక‌ల్పం, జ‌గ‌న‌న్న ఆస‌రా వంటి కార్య‌క్ర‌మాలు అమ‌లు చేస్తున్నారు.

అయితే.. ఆయా ప‌థ‌కాలు అన్నీ కూడా.. కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా అమ‌లు చేస్తున్న‌వే. అంతేకాదు.. గోరుముద్ద ప‌థ‌కం.. పాఠ‌శాల‌ల చిన్నారుల‌కు మ‌ధ్యాహ్నం అందించే భోజ‌న ప‌థ‌కం. అయితే.. ఇది పూర్తిగా కేంద్ర ప్ర‌భుత్వ ప‌థ‌కం దీనికి 75 శాతం నిధులు కేంద్రం నుంచే వ‌స్తున్నాయి. దీనినే మిగిలిన రాష్ట్రాలు.. మ‌ధ్యాహ్న భోజ‌న ప‌థ‌కంగా అమ‌లు చేస్తున్నాయి. గ‌తంలో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం కూడా దీనికి పేరు మార్చాల‌ని ప్ర‌య‌త్నించిన‌ప్ప‌టికీ.. 75 శాతం కేంద్ర‌ నిధులు ఉన్న ఏ ప‌థ‌కానికీ ఇలా పేరు మార్చుకునే అవ‌కాశం లేనందున వెన‌క్కి త‌గ్గి గౌర‌వం కాపాడుకున్నారు. అదేవిధంగా.. స్వ‌చ్ఛ సంక‌ల్పం .. అనేది మోడీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కం.

2014లో ప్ర‌ధానిగా మోడీ ప్ర‌మాణం స్వీకారం చేసిన కొత్త‌లోనే ఈ ప‌థ‌కాన్ని తీసుకువ‌చ్చారు. స్వ‌చ్ఛ భార‌త్ పేరుతో కేంద్రం ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తోంది. అయితే.. దీనికి కూడా జ‌గ‌న్ త‌న పేరును పెట్టుకున్నారు. ఇక‌, ఆస‌రా. ఇది కూడా కేంద్ర నిధుల‌తో న‌డుస్తున్న ప‌థ‌క‌మే., అయిన‌ప్ప‌టికీ.. జ‌గ‌న్ త‌న‌పేరు పెట్టుకున్నారు. ఆయా అంశాల‌పై వైసీపీ ఎంపీ.. ర‌ఘురామ రాజు ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోడీకి లేఖ రాశారు. దీనిని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకున్న కేంద్రం.. అసలు ఏం చేస్తున్నారో.. చూడాలంటూ.. కేంద్ర మ‌హిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీని ఆదేశించింది.

ఈ నేప‌థ్యంలో ఆమె రాష్ట్ర ప్ర‌భుత్వ వ‌ర్గాల నుంచి స‌మాచారం తెఎప్పించుకుని.. ఆయా ప‌థ‌కాల వివ‌రాలు.. ఖర్చుల‌ను ఇటీవ‌ల లెక్క చూశారు. ఈ క్ర‌మంలో కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కాల‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం పేరు పెట్ట‌డాన్ని సీరియ‌స్‌గా భావిస్తూ.. తాజాగా ఆమె ఏపీ సీఎంకు లేఖ సంధించారు. ఎందుకు ప‌థ‌కాల పేర్లు మార్చాల్సి వ‌చ్చింది? కేంద్ర ప్ర‌భుత్వం క‌న్నా ఎక్కువ వాటా ఉందా? మీ ఉద్దేశంలో .. ఆ ప‌థ‌కాల‌ను ఎవరు తీసుకువ‌చ్చార‌ని భావిస్తున్నారు? వంటి కీల‌క ప్ర‌శ్న‌ల‌ను సంధించారు. దీనికి 15 రోజుల్లోగా స‌మాధానం చెప్పాల‌ని ఆమె ఏపీ ప్ర‌భుత్వాన్ని ఆదేశించ‌డం గ‌మ‌నార్హం.