ఈ ఎంపీలకు అంత సీనుందా ?

పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో ఏపీ ప్రయోజనాల కోసం డిమాండ్ చేయాలని అధికార, టీడీపీ ఎంపీలకు పార్టీల అధినేతలు దిశానిర్దేశం చేశారు. రెండు పార్టీల ఎంపీలకు జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు నాయుడు ఒకేలాంటి ఆదేశాలివ్వటం కాస్త విచిత్రంగానే ఉంది.  సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్న ప్రత్యేక హోదా, ప్రత్యేక రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి రివైజ్డు అంచనాల ప్రకారం నిధులు లాంటి అంశాలు చాలా కీలకమైనవి.

పార్లమెంటు సమావేశాలు ఎప్పుడు జరిగినా రెండు పార్టీల ఎంపీలకు అధినేతలు ఇచ్చే ఆదేశాల్లో అయితే ఎలాంటి మార్పుండదు. అయితే మరి వీళ్ళ డిమాండ్లకు నరేంద్ర మోడీ సానుకూలంగా స్పందిస్తున్నారా ? అంటే లేదనే సమాధానం చెప్పుకోవాలి. పార్టీల అధినేతలు ఆదేశాలివ్వటం, ఎంపీలు పార్లమెంటులో డిమాండ్లు వినిపించటం అంతా కేవలం డ్రామాలుగానే మిగిలిపోతున్నాయి. సమిష్టిగా రెండు పార్టీల నేతలు పెండింగ్ డిమాండ్లను వినిపించిన సందర్భాలు ఎప్పుడూ లేవనే చెప్పాలి.

పార్లమెంటులో టీడీపీ ఎంపీలు మాట్లాడితే జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయటం, రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టడానికి ప్రయత్నించటంతోనే సరిపోతోంది. ఇదే సమయంలో టీడీపీ ఎంపీల ఆరోపణలకు ధీటుగా చంద్రబాబు నాయుడు హయాంలో జరిగిన తప్పులను వైసీపీ ఎంపీలు పార్లమెంటు వేదికగా వినిపిస్తున్నారు. అంటే వైసీపీపై టీడీపీ ఎంపీలు, టీడీపీపై వైసీపీ ఎంపీలు ఆరోపణలు, ప్రత్యారోపణలు చేసుకోవటంతోనే పుణ్య కాలం గడిచిపోతోంది.

ఏపీ ప్రయోజనాల కోసం సమిష్టిగా కృషి చేయాల్సిన రెండు పార్టీల ఎంపీలు ఒకళ్ళపై మరొకళ్ళు ఆరోపణలు, ప్రత్యారోపణలతో పార్లమెంటులో కూడా విరుచుకుపడుతుంటే ఇక కేంద్రం ఎంపీలను ఎందుకు పట్టించుకుంటుంది ? పైగా మోడి ప్రభుత్వానికి అసలు ఏపీ ఎంపీల మద్దతు అవసరమే లేదు. ఇలాంటి సమయంలో కేంద్రంపై ఒత్తిడి తేవాలంటే రెండు పార్టీల ఎంపీలు ఏకతాటిపై నడవాల్సుంది. కానీ ఆ పని జరిగేది కాదని తెలియటంతో కేంద్రం ఏపీని ఏ మాత్రం పట్టించుకోవటం లేదు.

ఇదే సమయంలో ఇటు చంద్రబాబుకు అటు జగన్ కు కూడా కేంద్రంతో సఖ్యతగా ఉండాల్సిన అవసరం ఉంది. రెండుపార్టీల మధ్య పరిస్ధితి ఉప్పు-నిప్పని అందరికీ తెలిసిందే. పైగా వివిధ కారణాలతో చంద్రబాబు, జగన్ ఇద్దరు కేంద్రం ముందు మోకరిల్లాల్సిన అవసరం. దీనికి అలుసుగా తీసుకున్న మోడి ఇద్దరినీ అవసరానికి తగ్గట్లు ఆడుకుంటున్నారు. ఈ పరిస్ధితుల్లో కేంద్రాన్ని నిలదీసేంత సీన్ అసలు ఈ ఎంపీలకు ఉందా అనేదే అసలైన డౌట్. కాకపోతే జనాల కోసం ఈ డ్రామాలు తప్పవు.