తన సొంత జిల్లా కడపతో పాటు.. తన మీద అపరిమిత అభిమానం చూపిస్తున్న చిత్తూరు జిల్లాలు వరదలతో అల్లాడిపోతుంటే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అటు వైపు కన్నెత్తి చూడటం లేదంటూ ఆయనపై తీవ్ర స్థాయిలో విమర్శలు వస్తున్నాయి. ఒక రోజు నామమాత్రంగా ఏరియల్ వ్యూకు పరిమితమైన సీఎం.. క్షేత్ర స్థాయిలో పర్యటించకపోవడాన్ని అందరూ తప్పుబడుతున్నారు.
71 ఏళ్ల వయసులో చంద్రబాబు ఎంతో కష్టపడి వరద ప్రాంతాల్లో పర్యటిస్తుండటాన్ని.. అలాగే తమిళనాడులో అక్కడి ముఖ్యమంత్రి స్టాలిన్ భారీ వర్షంలో రెయిన్ కోట్లు వేసుకుని జనాలను పరామర్శిస్తుండటం, సహాయ చర్యలను పర్యవేక్షిస్తుండటాన్ని ప్రస్తావిస్తూ జగన్ మీద నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. సోషల్ మీడియాలో దీనిపై విపరీతంగా ట్రోలింగ్ జరుగుతుండటం సీఎం దృష్టికి వచ్చినట్లుంది.
ఈ నేపథ్యంలోనే జగన్ అసెంబ్లీలో ఈ విషయమై మాట్లాడారు. తాను వరద ప్రాంతాల్లో పర్యటించకపోవడానికి కారణాలున్నాయని ఆయన వివరణ ఇచ్చారు. తాను వరద ప్రాంతాల్లో పర్యటించడం ముఖ్యమా, లేక సహాయ చర్యలు కొనసాగడం ముఖ్యమా అని ప్రశ్నించారు జగన్.
ముఖ్యమంత్రిగా తాను వరద ప్రాంతాల్లోకి వెళ్తే సహాయ చర్యలకు ఆటంకం కలుగుతుందని అధికారులు చెప్పారని.. వాళ్లు అనుభవపూర్వకంగా చెప్పిన మాట వాస్తవం అనిపించి తాను పర్యటనకు వెళ్లలేదని సీఎం అన్నారు.
మంత్రులు, ఎమ్మల్యేలు, అధికారులు ఆయా ప్రాంతాల్లో సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారని.. వరద ఉద్ధృతి తగ్గాక తాను జనాల్లోకి వెళ్లి వాళ్లకు అందాల్సిన సాయం అందిందా లేదా అని కనుక్కుంటానని జగన్ చెప్పారు. ఒరిస్సాలో ప్రతి సంవత్సరం వరదలు వస్తుంటాయని.. మరి వరద ప్రాంతాల్లో ఆ రాష్ట్రం సీఎం నవీన్ పట్నాయక్ ఎప్పుడైనా కనిపించాడా అని జగన్ ప్రశ్నించడం గమనార్హం.