భారీ వర్షం కురిసింది. వరద పోటు తలెత్తింది. ఇప్పటివరకు వరద పోటు బారిన పడిన జిల్లాలుగా వినని కడప.. చిత్తూరు.. అనంతపురం.. నెల్లూరు జిల్లాలు ఈసారి అందుకు భిన్నమైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. అన్నింటికి మించి కడప జిల్లాలో చోటు చేసుకున్న పరిణామాలు.. వరద పోటు కారణంగా గ్రామాలకు గ్రామాలు వరదల్లో చిక్కుకుపోవటం.. పెద్ద ఎత్తున బాధితులు గల్లంతు కావటం లాంటివి తెలిసిందే. ఇంతకూ ఇదంతా ఎందుకు జరిగింది? అన్నది ప్రశ్న. దీనికి ప్రధాన మీడియా సంస్థలు మొదలు సోషల్ మీడియాలోనూ ఎలాంటి వ్యాఖ్యలు.. వాదనలు.. విశ్లేషణలు కనిపించలేదు. ఆశ్చర్యకరంగా ఈ అంశాల్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆయన టీం వారు అధ్యయనం చేశారు.
కడప జిల్లాలో అంత వరదకు కారణం ఏమిటన్న విషయాల్ని తమకున్న నెట్ వర్కుతో చెక్ చేశారు. ఈ సందర్భంగా తమకు అందిన సమాచారాన్ని బయటకు వెల్లడించారు. షాకింగ్ గా మారిన ఈ అంశాలు మీడియాలో పెద్దగా రాలేదు. పిడుగు ఎక్కడ పడుతుందో.. అది పడటానికి కొన్ని గంటల ముందే గుర్తించే టెక్నాలజీ ఉన్నప్పుడు.. వరదల్ని ముందుగా పసిగట్టకపోవటం ఏమిటి? భారీ వర్షం గంటల కొద్దీ కురిసిన తర్వాత.. వాన నీరు వరదగా మారి.. ఎక్కడెక్కడకు ప్రయాణిస్తుంది.. అంతిమంగా ఎక్కడకు చేరుతుందన్న లెక్క ఒకటి ఉంటుంది. అలాంటప్పుడు కడప జిల్లాలో కురిసిన భారీ వర్షం.. వరదగా మారటం సరే.. గ్రామాల్ని ఎందుకు ముంచెత్తింది? అన్న ప్రశ్నకు జనసేన చేస్తున్న వాదన వింటే షాక్ తినాల్సిందే. ఈ సందర్భంగా వారు సంధించిన కొన్ని ప్రశ్నల్ని విన్నప్పుడు.. నిజమే కదా? అన్న విషయంతో పాటు.. ఏపీ సర్కారు వైఫల్యం కళ్లకు కట్టినట్లుగా కనిపించక మానదు.
ఇంతకీ జనసేన ఏం చెప్పిందన్నది వారి మాటల్లోనే చూస్తే..
- కడప, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జిల్లాల్లో కురిసిన భారీ వర్షాలు, ముంచెత్తిన వరదల కారణంగా ప్రజల జీవనం పూర్తిగా చిన్నాభిన్నమైంది.. ప్రకృతి ప్రకోపించడం వల్ల ఈ విద్వంసం జరిగిందని అందరూ అనుకుంటున్నారు. కానీ ఇది అవాస్తవం. ఇందులో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే.
- వివాహాలు, విందులకు హాజరయ్యేందుకు సీఎం జగన్ కు తీరిక ఉంటుంది గానీ, తుపాను బాధితులను ఆదుకోవడంలో… వారిని పరామర్శించడంలో తీరిక లేదా? పక్క రాష్ట్రాల్లో జరిగే వివాహాలకు వెళ్లి ఆశీర్వదించే తీరిక చేసుకొంటున్న సీఎం.. ఆయన సొంత జిల్లాలో బాధితులను పరామర్శించేందుకు ఎందుకు వెళ్ళడం లేదు?
- చిన్నపాటి పిడుగు పడినా నలభై నిమిషాల ముందుగానే తెలుస్తుంది. అలాంటిది ఇంతటి భారీ తుపాను వస్తుందంటే కనీసం నాలుగైదు రోజుల ముందుగానే టెక్నాలజీ సహాయంతో తెలుసుకోవచ్చు. ప్రకృతి విపత్తుల నివారణ శాఖ ఇందుకోసమే ప్రత్యేకంగా పని చేస్తుంది. అయినప్పటికి జగన్ ప్రభుత్వం దీన్ని తెలుసుకోవడంలో అలసత్వం ప్రదర్శించింది.
- దీనిని ముందస్తుగా గుర్తించి, ప్రభుత్వం కనీసం కంట్రోల్ రూంను ఎందుకు ఏర్పాటు చేయలేదు ? పునరావాస కేంద్రాలు నిర్వహణ కూడా సక్రమంగా లేదు. జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసి వారితో ఎందుకు సమీక్షా సమావేశాలు నిర్వహించలేదు? ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమే.
- కడప జిల్లాలో ఇంత పెద్ద ఎత్తున తుపానులు రావడానికి కారణం ఇసుక మాఫియానే. ఇసుక అక్రమ రవాణా కారణంగా ఈ ప్రాంతాలన్నీ నీట మునిగాయి. స్థానికంగా ఉన్న పింఛా ఆనకట్ట చాలా బలహీనంగా ఉందని నివర్ తుఫాన్ సమయంలోనే ప్రభుత్వ అధికారులను స్థానికులు, జనసేన నాయకులు హెచ్చరించారు. పూర్తి స్థాయిలో నీటి నిల్వలు పెరిగితే ప్రమాదకరమని సూచించారు.
- అయినప్పటికి నీటిపారుదల శాఖా మంత్రి అనిల్ కుమార్ దీని పట్ల శ్రధ్ద చూపలేదు. నీటి నిల్వలు అధికమైతే ఎందుకు వెంటనే దిగువకు విడుదల చేయలేదు? కారణం చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఆ ప్రాజెక్టు దిగువన ఇసుక నిల్వలు ఉన్నాయి. వాటిని రక్షించుకునేందుకు ప్రజల ప్రాణాలను పణంగా పెట్టారు.
- పింఛా దిగువున ఉన్న అన్నమయ్య డ్యామ్ దగ్గర వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు క్రమపద్దతిలో విడిచిపెట్టకుండా ఇసుక మాఫియా కోసమే మొత్తం నీటిని నిలబెట్టారు. ఫలితంగానే మట్టి కట్ట కొట్టుకుపోయి ఊళ్లను ముంచేసింది. ఇది పూర్తిగా ప్రభుత్వ వైపల్యమే. అధికార పార్టీ నేతల ఇసుక అక్రమ డంపులను తరలించుకోవడానికి, ఇసుకు రవాణాకు దారులు సుగమం చేసేందుకు డ్యాం గేట్లను ఎత్తలేదు. ఈ మాఫియా ఎవరి చేతుల్లో ఉందో సీఎం జగన్ సమాధానం చెప్పాలి.
- ప్రభుత్వం కనుక ముందుగా అప్రమత్తమయి ఉంటే పరిణామాలు ఇంత తీవ్రంగా ఉండేవి కావు. వేలాది గ్రామాలు ముంపుకు గురై ఉండేవి కాదు. ప్రతీ యాభైమందికి ఒక వార్డు వాలంటీరు వ్యవస్థను ఏర్పాటు చేసినట్టు ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటుంది. మరి ఆ వార్డు వాలంటీర్లు సహాయ పునరావాస కార్యక్రమాల్లో ఎందుకు పాలుపంచుకోలేదు?
- వైసీపీ ప్రభుత్వంలో విపత్తుల నివారణ శాఖ అనేది ఉందా.. లేదా ? ఉంటే ఆ శాఖ మంత్రి ఎవరు? అన్ని శాఖలను సజ్జల రామకృష్ణారెడ్డి పర్యవేక్షిస్తున్నారా? దీన్ని కూడా ఆయనే చూసుకుంటారని వదిలేశారా? ఎందుకని ఆ శాఖ నిర్వీర్యమైంది?
- నాలుగు జిల్లాలకు చెందిన ప్రజలు తీవ్ర అవస్థల పాలవుతుంటే.. సజ్జల రామకృష్ణారెడ్డి నాలుగు రోజులుగా మీడియా ముందుకు ఎందుకు రావడం లేదు? అధికారులు తమ విధులను నిర్వహించడంలో అలసత్వం చూపుతుంటే మీరు ఎందుకు సమీక్ష సమావేశం నిర్వహించలేకపోయారు?
- కడప జిల్లా నుండి ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రితోపాటు ప్రభుత్వ చీఫ్ విప్, విప్ లు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. పదికి పదిమంది ఎంఎల్ఏలు ఉన్నారు. ఇంతమంది ఉన్నప్పటికి కడప జిల్లాలోని రైల్వే కోడూరు, రాజంపేటలో సహాయ పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయడంలో అందరూ ఘోరంగా విఫలమయ్యారు.
- ప్రజలు అన్నం కావాలని అడగడం లేదు. మృత కళేబారాలను తొలగించండి… పేరుకుపోయిన చెత్త చెదారాన్ని తొలగించండి అని కోరుకుంటున్నారు. అధికారులు చోద్యం చూస్తున్నారు. ఈ పని తమ శాఖ పరిధిలోనిది కాదని చేతులు దులుపుకుంటున్నారు.
- బాధిత ప్రజలు ఉన్న దగ్గర హెలికాప్టర్ల ద్వారా ప్రభుత్వం గుడ్ డే బిస్కట్ ప్యాకెట్లను జారవిడిచింది. ప్రభుత్వ హెలికాప్టర్ ద్వారా మంచినీళ్లో, బోజన ప్యాకెట్లో వస్తాయని భావించిన ప్రజలు తీవ్ర నిరాశకు లోనయ్యారు. గుడ్ డే బిస్కట్ ప్యాకెట్లను చూసి హతాశులయ్యారు. ఇంతకంటే దారుణం ఏదైనా ఉంటుందా?
- ఇప్పటివరకు తిరుపతిలో ఇలాంటి దారుణ పరిస్థితులు ఏనాడు ఏర్పడలేదు. నాలుగు రోజుల పాటు ప్రజలు బయటకు రాలేని పరిస్థితి నెలకొంది. దుకాణాలు తెరుచుకోలేదు. ఇతర ప్రాంతాలతో సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. రోడ్లు, బ్రిడ్జీలు కొట్టుకుపోయాయి. ప్రజలకు గతంలో ఏనాడు లేని విధంగా తిరుపతిలో వరదలు వచ్చాయి. అందుకు ప్రధాన కారణం తిరుపతిలోని చెరువులను వైసీపీ నాయకులు కబ్జా చేయడమే.