వాళ్లను ఈడ్చుకొస్తాం – మోడీ

‘భారత్ విడిచి పెట్టి పారిపోయిన ఆర్ధిక నేరగాళ్ళను తిరిగి దేశానికి రప్పిస్తున్నాం’ ఇది తాజాగా నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలు. దేశానికి తిరిగి రావడం తప్ప ఆర్ధిక నేరగాళ్లకు వేరే మార్గాలు లేకుండా చేస్తున్నట్లు చెప్పారు. మొదటి నుంచి మోడీ చెప్పే మాటలకు జరుగుతున్న వ్యవహారాలకు సంబంధం లేకుండా ఉండటం అందరు చూస్తున్నదే. వేల కోట్ల రూపాయలు బ్యాంకులకు ఎగవేస్తున్న ఆర్ధిక నేరగాళ్ళు చాలా హ్యాపీగా విదేశాలకు చెక్కేస్తున్నారు. భారత్ లో ఉన్నపుడే విదేశాలకు ఆస్తులను, సంపదను తరలించేస్తున్నారు. ఈ విషయాలన్నీ తెలిసి కూడా మోడి సర్కార్ చోద్యం చూస్తున్నది.

విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, మెహుల్ చోక్సీ లాంటి అనేకమంది పదుల సంఖ్యలో వేల కోట్లను బ్యాంకులకు ఎగ్గొట్టేశారు. వీళ్ళంతా విదేశాలకు వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ ఏదో రూపంలో వ్యాపారాలు మొదలుపెట్టారు. సంవత్సరాల తరబడి వీళ్ళను మనదేశానికి రప్పించాలని ఎంత ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు. ఏదో సాంకేతిక కారణాలతో వాళ్ళంతా విదేశాల్లోనే తలదాచుకుంటున్నారు. విదేశీ కోర్టుల్లో కేసులు వేసి వాదించటం తప్ప మన ప్రభుత్వం చేయగలుగుతున్నదేమీ లేదు.

వీళ్లందరినీ మనదేశానికి ఎప్పుడు తిరిగి రప్పిస్తారో కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పలేకపోతోంది. నిజం ఇలాగుంటే ఆర్ధిక నేరగాళ్ళందరు తిరిగి భారత్ కు రావటం తప్ప వేరే ప్రత్యామ్నాయం లేకుండా చేస్తున్నట్లు మోడీ చెప్పటమే ఆశ్చర్యంగా ఉంది. అసలు వీళ్ళంతా దేశం విడిచి ఎలా వెళ్ళ గలిగారన్నదే అసలైన ప్రశ్న. కేంద్రంలోని ముఖ్యలు సాయం చేయనిదే బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టిన వారు విదేశాలకు ఎలా వెళ్ళగలరు ?

ఈ విషయానికి సమాధానం చెప్పని మోడీ యూపీఏ హయాంలో ఎగ్గొట్టిన లక్షల కోట్ల రూపాయలను రికవరీ చేస్తున్నట్లు చెప్పటం మరింత విచిత్రంగా ఉంది. లక్షల కోట్లు ఎగ్గొట్టడమే కాదు గడచిన ఏడేళ్ళల్లో సుమారు రు. 10 లక్షల కోట్ల బకాయిలను కూడా మోదీ సర్కార్ రద్దు చేసింది. పెద్ద పెద్ద సంస్ధలు తీసుకున్న వేల కోట్ల రూపాయలను చాలా తేలిగ్గా మోడీ సర్కార్ రాని బాకీల కింద రద్దు చేసేస్తోంది. దీనికి సమాధానం చెప్పమంటే మాత్రం మోడీ ప్రభుత్వం ఏమీ మాట్లాడటంలేదు.

విదేశాలకు చెక్కేసిన ఆర్ధిక నేరగాళ్ళు సంగతిని పక్కన పెట్టేస్తే మరి దేశంలోనే ఉన్న వారి సంగతి ఏమిటి ? వీళ్ళపైనే ఎలాంటి చర్యలు తీసుకోలేని మోడి ప్రభుత్వం విదేశాల్లో ఉన్న ఆర్ధిక నేరగాళ్ళు గురించి మాట్లాడటమే పెద్ద జోక్. టీడీపీ నుంచి బీజేపీలోకి ఫిరాయించిన రాజ్యసభ ఎంపీల్లో కూడా వేలాది కోట్లను ఎగ్గొట్టిన వారున్నారు. వీళ్ళపై సీబీఐ విచారణ పూర్తి చేసి నేరాలను నిర్ధారించింది కూడా. అయినా వాళ్ళపై ఇప్పటివరకు ఎలాంటి చర్యలు లేవు. కాబట్టి విదేశాలకు పారిపోయిన వాళ్ళగురించి కాదు ముందు దేశంలోనే బీజేపీలోనే ఉన్న ఆర్ధిక నేరగాళ్ళు పనిపడితే జనాలకు నమ్మకం కలుగుతుంది.