మ‌మ‌త వ్యూహం.. బీజేపీకే లాభ‌మా?

కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ అంటే క‌స్సున లేచే తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి ప‌శ్చిమ బెంగాల్ ముఖ్య‌మంత్రి మ‌మ‌తా బెన‌ర్జీ వ్యూహం కాషాయ పార్టీకి మేలు చేయ‌నుందా? ఇత‌ర రాష్ట్రాల‌పై దీదీ దృష్టి సారించ‌డం.. బీజేపీకే క‌లిసి రానుందా? ఆమె కార‌ణంగా కాంగ్రెస్‌కు దెబ్బ ప‌డ‌నుందా? అంటే రాజ‌కీయ వ‌ర్గాల నుంచి అవున‌నే స‌మాధానాలు వినిపిస్తున్నాయి.

ఆకాశాన్నంటుతున్న ఇంధ‌న ధ‌ర‌లు.. పెరుగుతున్న ద్ర‌వ్యోల్బ‌ణం, నిరుద్యోగం, వ్య‌వ‌సాయ చ‌ట్టాల‌పై మొండి వైఖ‌రి ఇలా దేశంలో బీజేపీ స‌ర్కారుపై వ్య‌తిరేక‌త పెరుగుతోంది. కానీ ఆ ప్ర‌జాగ్ర‌హాన్ని కాంగ్రెస్ త‌మ ఎన్నిక‌ల అస్త్రంగా మ‌లుచుకోలేక‌పోతుంది. నాయ‌క‌త్వ లోపం, రాష్ట్రల్లో కుమ్ములాటలు ఆ పార్టీని బ‌ల‌హీన‌ప‌రుస్తున్నాయి. మ‌రో వైపు వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు మిగిలి ఉన్న కొద్దోగొప్పో ఓటు బ్యాంకునూ ప్రాంతీయ పార్టీలు చేజిక్కించుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నాయి. వీటిలో ముఖ్యంగా టీఎంసీ ఎక్కువ ప్ర‌యోజ‌నం పొందే స్థానంలో ఉంది.

ఈ ఏడాది రాష్ట్ర అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ బెంగాల్‌లో కాంగ్రెస్ ఓటు బ్యాంకును సొంతం చేసుకోగ‌లిగిన టీఎంసీ.. గోవా, త్రిపుర తో పాటు ఈశాన్య రాష్ట్రాల్లోనూ ఆ పార్టీ ఓట్ల‌ను త‌మ వైపుగా తిప్పుకునే అవ‌కాశం ఉంది. కాంగ్రెస్ పార్టీలోని కీల‌క నేత‌లు టీఎంసీలోకి చేరుతున్నారు. గోవా ఎన్నిక‌ల ప్ర‌చారంలో స్వ‌యంగా మ‌మ‌తా బెన‌ర్జీ పాల్గొన‌నున్నారు. యూపీలోనూ ఆమె ప‌ర్య‌టించ‌నున్నారు. దీంతో దేశంలో బీజేపీకి అస‌లైన పోటీదారుగా ప్ర‌త్యామ్నాయంగా ఎద‌గాల‌ని దీదీ భావిస్తున్న‌ట్లు స్ప‌ష్ట‌మ‌వుతోంది. ఆ దిశ‌గానే ఆమె అడుగులు ప‌డుతున్నాయి. వ‌చ్చే లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో బీజేపీ పై పోరాటానికి ప్ర‌తిప‌క్ష పార్టీలు ఏకం కావాల‌ని రాహుల్ గాంధీ చొర‌వ‌తో జ‌రిగిన ప్ర‌తిప‌క్ష పార్టీల స‌మావేశానికి టీఎంసీ దూరంగా ఉంది. ప్ర‌తిప‌క్ష పార్టీల‌కు నాయ‌క‌త్వం వ‌హించే సత్తా రాహుల్‌కు లేద‌ని మ‌మ‌తా వ్యాఖ్యానించారు. ఆ అర్హ‌త త‌న‌కే ఉంద‌ని ఆమె అనుకుంటున్న‌ట్లు తెలుస్తోంది.

ప‌శ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో బీజేపీ ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా అధికారం ద‌క్కించుకోగ‌లిగిన మ‌మ‌తా.. మోఢీ- షా ద్వ‌యాన్ని స‌మ‌ర్థంగా ఎదుర్కోగ‌ల‌న‌ని చాటి చెప్పారు. దీంతో మ‌రింత ఉత్సాహంతో ఆమె బీజేపీ పై పోరాటానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నారు. కానీ ఈ క్ర‌మంలో కాంగ్రెస్ ఓట్ల‌కు ఆమె గండి కొట్ట‌డం ద్వారా అది బీజేపీకి లాభించే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని రాజ‌కీయ నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఎందుకంటే జాతీయ స్థాయిలో కాంగ్రెస్‌కు బ‌దులుగా బీజేపీకి ప్ర‌త్యామ్నాయంగా ఎదిగే స‌త్తా టీఎంసీకి ఉందా అన్న‌దీ అనుమాన‌మే.

వ‌చ్చే లోక‌స‌భ ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ్ బెంగాల్‌, త్రిపుర‌లో సీట్ల‌న్నీ టీఎంసీ గెలుచుకున్నా బ‌య‌ట రాష్ట్రాల్లో మ‌రో 25 స్థానాలు నెగ్గినా దాని బ‌లం త‌క్కువ‌గానే ఉంటుంది. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ నుంచి ఆ సీట్లు మళ్లుతాయి కాబట్టి ఆ పార్టీకి న‌ష్టం క‌లిగే ఆస్కార‌ముంది. కాంగ్రెస్ బ‌ల‌హీన‌ప‌డితే అది బీజేపీకే మేలు చేస్తోంది. అందుకే మ‌మ‌త మిత్రురాలు రూపంలో ఉన్న శ‌త్రువు అని ప్ర‌తిప‌క్ష శిబిరాన్ని బ‌ల‌హీన‌ప‌ర్చి బీజేపీకి మేలు చేసే ప్ర‌త్య‌ర్థి అని కాంగ్రెస్ నాయ‌కుడు అధీర్ రంజ‌న్ చౌద‌రి వ్యాఖ్యానించారు. ఈ నేప‌థ్యంలో దీదీ ఎలాంటి అడుగులు వేస్తుందో చూడాలి మ‌రి.