ఇపుడిదే అంశంపై జనసేన+బీజేపీలో చర్చ మొదలైంది. ఎందుకంటే ఈనెల 31వ తేదీన జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖపట్నంకు వెళుతున్నారు. విశాఖపట్నం స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉక్కు పరిరక్షణ సమితి నాయుకులు ఫ్యాక్టరీ దగ్గరే సభ ఏర్పాటు చేశారు. ఉక్కు పరిరక్షణ సమితి నేతల రిక్వెస్టు మీద పవన్ సభలో పాల్గొనేందుకు విశాఖ వెళుతున్నారు. సభలో పాల్గొంటున్నారంటేనే ప్రభుత్వాలపై విరుచుకుపడాలి.
ఇక్కడ ప్రభుత్వాలంటే కేంద్రంలోని నరేంద్ర మోడీ లేదా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే. వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించాలనేది పూర్తిగా మోడి సర్కార్ నిర్ణయమే అని అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఉక్కు ఫ్యాక్టరీ నూరుశాతం కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి పూర్తి అధికారాలు కేంద్రానివే. ఫ్యాక్టరీ ప్రైవేటీకరణపై పవన్ ఆరోపణలు, విమర్శలు చేయాలంటే మోడీ సర్కార్ పైనే చేయాలి. కానీ బీజేపీయేమో పవన్ కు మిత్రపక్షమైపోయింది. గడచిన ఆరు మాసాలుగా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీ దగ్గర కార్మికులు, ఉద్యోగులు, ప్రజా సంఘాలు, ప్రజలు చేస్తున్న ఆందోళన గురించి పవన్ కు పూర్తిగా తెలుసు. అయినా కేంద్రానికి వ్యతిరేకంగా పవన్ పెద్దగా స్పందించడం లేదు.
మరి రేపటి సభలో పాల్గొనే పవన్ ఎవరిని టార్గెట్ చేసుకుంటారు అన్నది ఇపుడు సస్పెన్స్ గా మారింది. జనసేనాని అలవాటు ప్రకారమైతే జగన్నే టార్గెట్ చేసుకోవాలి. ఎందుకంటే బీజేపీ మిత్రపక్షం కాబట్టి వేరే అవకాశం లేదు. వైజాగ్ స్టీల్స్ ప్రైవేటీకరణలో రాష్ట్ర ప్రభుత్వం పాత్ర చాలా నామమాత్రమనే చెపాలి. అందుకనే జగన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ ప్రైవేటీకరణను మానుకోవాలని కేంద్రానికి లేఖ రాశారు.
ఒకవేళ ప్రైవేటీకరణ చేయక తప్పదంటే ఫ్యాక్టరీని రాష్ట్రానికి అప్పగించాలని కోరారు. జగన్ లేఖకు కేంద్రం నుంచి ఎలాంటి సానుకూల స్పందన కనబడలేదు. ఇదే సమయంలో ప్రైవేటీకరణ ప్రక్రియను కేంద్రం చాపకింద నీరులా చేసుకుని పోతున్నాయి. అందుకనే కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా సీబీఐ మాజీ అధికారి లక్ష్మీనారాయణ కోర్టులో కేసు కూడా వేశారు. ఈ కేసు విచారణ దశలో ఉన్నా చివరకు ఏమవుతుందో తెలీదు.
ఇక ప్రస్తుతానికి వస్తే 31వ తేదీ సభలో పవన్ ఎవరిని టార్గెట్ చేస్తారనేది ఆసక్తిగా మారింది. ఒకవేళ మోడినే గనుక టార్గెట్ చేస్తే మిత్రపక్షం బీజేపీతో పొత్తు తెగతెంపులు చేసుకోవటానికి పవన్ సిద్ధమైపోయినట్లు అర్ధం చేసుకోవాలి. కేంద్రంపై ఆరోపణలు, విమర్శలు చేస్తూ రాష్ట్రంలో బీజేపీతో పొత్తు సాధ్యం కాదు. దీంతో పవన్ తదుపరి స్టెప్ ఏమిటనేది ఆసక్తిగా మారుతుంది. ప్రచారంలో ఉన్నట్లు తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటారా ? లేకపోతే ఒంటరి ప్రయాణమే చేస్తారా ? అనేది 31 సభతో తేలిపోయే అవకాశాలున్నాయి. చూద్దాం ఆ రోజు ఏమి జరుగుతుందో.