ప్రజలకు అభివృద్ధి ఫలాలు అందాలన్నా.. సంక్షేమ పథకాలు చేరువ కావాలన్నా.. ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కలిసి పని చేయాల్సి ఉంటుంది. ఈ రెండు వ్యవస్థలు సక్రమంగా తమ బాధ్యతలు నిర్వర్తిస్తేనే ఏ కార్యక్రమమైన విజయవంతం అవుతుంది. కానీ ఓ కార్యక్రమానికి కలెక్టర్ ఆలస్యంగా వచ్చారని చెప్పి ఎమ్మెల్యే అలిగి వెళ్లిపోవడం.. ఎమ్మెల్యే వెళ్లిపోయిందని కలెక్టర్ కూడా ఆ కార్యక్రమాన్ని ఆరంభించకుండనే వెనుదిరిగితే ఎలా ఉంటుంది? ఇదిగో ఇలా ఉంటుంది. ఈ తాజా సంఘటన చింతూరులో జరిగింది.
రంపచోడవరం ఎమ్మెల్యే ధనలక్ష్మీ అధికారులపై అలిగారు. చింతూరులోని ఆదిమ గురుకుల కళాశాల ప్రాంగణంలో నిర్మించిన గ్రంథాలయ భవన ప్రారంభోత్సవంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ఆమె వచ్చారు. కానీ కలెక్టర్ ఆలస్యం చేయడంతో మనస్థాపానికి గురయ్యారు. మరోవైపు కలెక్టర్ హరికిరణ్ కూడా చింతూరు వచ్చారు. కానీ ఆయన చింతూరు నుంచి నేరుగా భద్రాచలం వెళ్లి సీతారాములను దర్శన చేసుకున్నారు. అక్కడి నుంచి తిరిగి చింతూరు మండలం చేరుకున్న కలెక్టర్ ఏడుగురాళ్లపల్లిలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంతో చింతూరులో గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవానికి ఆయన రావడం ఆలస్యమైంది.
ఎమ్మెల్యే ధనలక్ష్మీ కలెక్టర్ కోసం కొద్ది గంటల పాటు వేచి చూశారు. కానీ ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం కలెక్టర్ సమయానికి రాలేదంటూ గంటల తరబడి వేచి చూసిన ఆమె అలిగారు. దీంతో గ్రంథాలయ భవనం ఆరంభించకుండానే తిరిగి రంపచోడవరం వెళ్లిపోయారు.
ఎమ్మెల్యే వెళ్లిన తర్వాత గ్రంథాలయ భవన ప్రారంభోత్సవ కార్యక్రమం దగ్గరకు కలెక్టర్ వచ్చారు. కానీ ఎమ్మెల్యే అలిగి వెళ్లిపోయిన విషయాన్ని తెలుసుకున్న ఆయన కూడా గ్రంథాలయ భవనాన్ని ప్రారంభించకుండానే తిరిగి కాకినాడ వెళ్లారు. దీంతో అనుకున్న ప్రకారం గ్రంథాలయ భవనం ప్రారంభోత్సవం జరగలేదు. అయితే ఎమ్మెల్యే గంటల తరబడి ఎదురు చూసినప్పటికీ కలెక్టర్ రాకపోవడాన్ని నిరసిస్తూ వైసీపీ నాయకులు అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ ధర్నాకు దిగారు. చివరకు ఐటీడీఏ పీవో వెంటక రమణ వాళ్లకు నచ్చజెప్పడంతో ధర్నా విరమించారు. ఎమ్మెల్యేతో పాటు కలెక్టర్ కూడా గ్రంథాలయ ప్రారంభోత్సవానికి సకాలంలో వచ్చి ఉంటే ఇదంత జరిగేదే కాదని అక్కడి జనాలు అనుకుంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates