పరిటాల సునీతకు వల్లభనేని వంశీ కౌంటర్

వ‌ల్ల‌భ‌నేని వంశీ.. కృష్ణాజిల్లా గ‌న్న‌వ‌రం శాస‌న స‌భ్యుడు. గ‌త ఎన్నిక‌ల్లోనే కాదు.. అంత‌కుముందు కూడా.. ఆయ‌న టీడీపీ నాయ‌కుడిగానే ఇక్క‌డ నుంచి గెలుస్తున్నారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఆయ‌న వైసీపీకి అనుకూలంగా మారిపోయారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న అప్ప‌ట్లో చంద్ర‌బాబుపైనా.. పార్టీ యువ నాయ‌కుడు.. నారా లోకేష్‌పైనా.. విరుచుకుప‌డ్డారు. అయితే.. అప్ప‌ట్లోనే ఆయ‌న‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. వంశీ గతం మరిచి మాట్లాడున్నారని నియోజకవర్గంలోనే చర్చ జరిగింది. అయితే.. రాజ‌కీయాల్లో ఇప్పుడు ఎవ‌రు చిన్న ఎవ‌రు పెద్ద అనే తేడా లేకుండా పోయిన నేప‌థ్యంలో ఎవ‌రిని ఎవ‌రూ కంట్రోల్ చేసే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు.

తాజాగా చంద్రబాబు దీక్ష స్థలిలో పరిటాల సునీత మాట్లాడుతూ కొడాలి నాని, వల్లభనేని వంశీ పేర్లు ప్రస్తావించి వారు చేసిన విమర్శలపై బాధతో కూడిన ఆగ్రహం వ్యక్తంచేశారు. ప‌రిటాల సునీత‌.. మాదీ సీమ ర‌క్త‌మే.. అంటూ.. ప్ర‌సంగించారు. ఈ క్ర‌మంలో కృష్ణా జిల్లాకు చెందిన ఇద్ద‌రు నాయ‌కులు.. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వంశీల‌ను ఉద్దేశించి.. కీల‌క వ్యాఖ్య లు చేశారు. వీరికి చంద్ర‌బాబు అవ‌కాశం ఇస్తేనే ఎమ్మెల్యేలు అయ్యార‌ని.. ఇప్పుడు చంద్ర‌బాబును విమ‌ర్శించేంత‌టి వారా? అంటూ.. సునీత నిప్పులు చెరిగారు. చంద్ర‌బాబు ఒక్క గంట క‌ళ్లూముసుకుంటే.. తాము ప్ర‌తాపం చూపిస్తామ‌ని.. త‌మ‌లోనూ సీమ‌ర‌క్త‌మే ప్ర‌వ‌హిస్తోంద‌ని అన్నారు.

అయితే.. చంద్రబాబు దీక్షలో పరిటాల సునీత చేసిన వ్యాఖ్యలపై స్పందించారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. తాను రాజీనామా చేయడానికి సిద్ధమని ప్రకటించారు. ఈ సందర్భంగా వంశీ మాట్లాడుతూ.. ‘‘పరిటాల సునీతను నేను వదినగానే చూస్తాను. ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం. వచ్చే ఎన్నిక వరకు ఎందుకు.. ఇప్పుడే రాజీనామా చేస్తా. తల్లికి, గర్భస్థ శిశువుకు కూడా తగాదా పెట్టగలిగే వ్యక్తి చంద్రబాబు’’ అని వంశీ మండిపడ్డారు. అంతేకాదు.. రెండున్న‌రేళ్ల వ‌రకు ఆగ‌డం ఎందుకు.. త‌క్ష‌ణ‌మే ఎన్నిక‌ల‌కు తాను సిద్ధ‌మ‌ని.. త‌న నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసేందుకు త‌ప్పు నాయుడు, ప‌ప్పునాయుడు లు రెడీయేనా? అంటూ.. స‌వాల్ రువ్వారు.

ఈ క్ర‌మంలోనే టీడీపీ అధినేత చంద్ర‌బాబుపై విమర్శ‌లు గుప్పించారు. చంద్ర‌బాబు వృద్ధుడు అయిపోయారని.. అందుకే త‌న కుమారుడిని ఇప్ప‌టికిప్పుడు ముఖ్య‌మంత్రిని చేయాల‌ని చూస్తున్నార‌ని.. వంశీ విమ‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా త‌న వ్య‌క్తిగ‌త లెట‌ర్ హెడ్ పై సంత‌కం చేసిన ఆయ‌న దానిని మీడియాకు అందించారు. దీనిని ప‌రిటాల సునీత‌కు కానీ.. టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు కానీ పంపాల‌న్నారు. దీనిపై త‌న రాజీనామా విష‌యాన్ని రాసుకోవ‌చ్చ‌ని తెలిపారు. ఈ క్ర‌మంలో లెట‌ర్ హెడ్‌పై సంత‌కం చేసిన వంశీ.. తాను రాజీనామాకు రెడీఅయ్యాయ‌ని.. ఇక్క‌డ నుంచి లోకేష్ పోటీ చేయాల‌ని అన్నారు. మొత్తానికి వంశీ వ‌ర్సెస్ సునీత రాజ‌కీయాలు.. వేడెక్కాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.