టీడీపీ అధినేత చంద్రబాబు.. జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టారు. పార్టీ కార్యాలయంపై జరిగిన దాడిని .. ఆయన జాతీయ స్థాయికి తీసుకువెళ్లడంలో సక్సెస్ అయ్యారు. తాజాగా చంద్రబాబుకు మద్దతుగా ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వ పాలక పార్టీ ఆమ్ ఆద్మీ స్పందించింది. వైసీపీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం మీద.. వైసీపీ జరిపిన దాడులపై ఆమ్ ఆద్మీ పార్టీ రియాక్ట్ అవుతూ.. ఈ ఘటనలను ఖండిస్తున్నట్టు ప్రకటించింది. ప్రజాస్వామ్యంలో విమర్శలు సహజమని.. దానికి దాడులు, ప్రతిదాడుల వరకు విషయాలు వెళ్లడం సరికాదని.. పార్టీ అధికార ప్రతినిధి ట్వీట్ చేశారు.
ప్రతిపక్షంపై ఇటువంటి దాడులు చేయడం సమర్థనీయం కాదని ఆమ్ ఆద్మీ పార్టీ ఖండించింది. ఇది ప్రజా స్వామ్యానికి ఏమాత్రం మంచిది కాదని ట్విట్టర్ వేదికగా స్పష్టం చేసింది. నిజానికి పార్టీ రాష్ట్ర కార్యాలయంపై జరిగిన దాడిని సీరియస్‌గా తీసుకున్న చంద్రబాబు దీనిపై తాడో పేడో తేల్చుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే రాష్ట్ర బంద్‌కు పిలుపునిచ్చారు. అంతేకాదు.. కేంద్రం దృష్టికి కూడీ ఈ విషయాన్ని తీసుకువెళ్లా లని నిర్ణయించారు. ఇక, దీనిపై జాతీయ మీడియా కూడా అధికార పార్టీనే దుయ్యబట్టింది. రాజకీయంగా చూడాల్సిన విషయాలను వివాదాస్పదం చేసుకోవడంపై జాతీయ మీడియా నిప్పులు చెరిగింది.
ఈ క్రమంలో మంగళగిరి టీడీపీ ఆఫీస్‌పై జరిగిన దాడి.. జాతీయ స్థాయిలో చర్చకు వచ్చింది. ఈ క్రమంలో నే ఆప్ పార్టీ.. టీడీపీకి దన్నుగా నిలిచింది. ప్రజాస్వామ్యంలో రాజకీయంగా చేసే విమర్శలను రాజకీయం గానే ఎదుర్కొనాలని.. ఇలా హింసలకు దిగడం సరికాదనే అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇక, ఇదే విషయాన్ని జాతీయ స్థాయిలో మరింతగా గళం వినిపించేందుకు చంద్రబాబు రెడీ అవుతున్నారు. శనివారం ఆయన.. ఢిల్లీ వెళ్లి.. కేంద్ర హోం మంత్రిని కలిసి ఇక్కడ జరిగింది వివరించనున్నారు. అదేసమయంలో పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, ఢిల్లీ ముఖ్యమంత్రిని కూడా కలసి.. ఏపీ పరిణామాలను ఏకరువు పెట్టే అవకాశం కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. జాతీయస్థాయిలో ఈ వివాదాన్ని చంద్రబాబు వినిపించనున్నట్టు స్పష్టమైంది.