ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎంతగా భయపడుతున్నారో జనాలందరికీ తెలిసొచ్చింది. ఉత్తరప్రదేశ్ లోని లఖింపూర్ ఖేరి లో రైతులపైకి వాహనాలు నడిపటంలో నలుగురు రైతులు మరణించిన విషయం దేశంలో ఎంతగా సంచలనం రేకెత్తించిందో అందరికీ తెలిసిందే. ర్యాలీ తీస్తున్న రైతులపైకి వెనక నుండి జీపు నడిపింది కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి అజయ్ మిశ్రా కొడుకు ఆశిష్ మిశ్రాయే. సుప్రీంకోర్టు జోక్యంతో ఆశిష్ పై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. తన కొడుక్కు సంబంధమే లేదని కేంద్రమంత్రి బుకాయించినా తర్వాత అంగీకరించక తప్పలేదు.
సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే కేంద్రమంత్రిని వెంటనే మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని రైతు సంఘాలు, ప్రతిపక్షాలు ఒక్కటై మోడిని డిమాండ్ చేస్తున్నాయి. నిజానికి ఘటనకు మూల కారణమైన కేంద్రమంత్రిని తొలగించటం మోడీకి పెద్ద కష్టమేమీకాదు. పైగా మంత్రివర్గం నుంచి తొలగిస్తేనే బీజేపీకి మంచిది. ఎందుకంటే మరో ఐదు నెలల్లో యూపీ అసెంబ్లీకి జనరల్ ఎలక్షన్స్ జరగబోతున్నాయి. ఇలాంటి సమయంలో ఏ చిన్న ఘటన జరిగినా పార్టీ గెలుపుపై అది పెద్ద ప్రభావం చూపుతుంది.
ఈ విషయం మోడీకి తెలిసినా మరి కేంద్రమంత్రిని ఎందుకని తొలగించటంలేదు ? ఎందుకంటే మిశ్రాను టచ్ చేయాలంటేనే మోడి భయపడుతున్నారట. ఎందుకంటే మిశ్రా బ్రాహ్మణ సామాజికవర్గానికి చెందిన నేత కావటమే ప్రధాన కారణం. బ్రాహ్మణ సామాజికవర్గాన్ని బీజేపీ దూరంగా పెట్టిందనే ఆరోపణలు బాగా ఎక్కువైపోయాయి. యూపీలోని పవర్ ఫుల్ సామాజికవర్గాల్లో బ్రాహ్మణులు కూడా ఒకళ్ళు. ఏ రాజకీయ పార్టీ కూడా బ్రాహ్మణులతో వైరం తెచ్చుకోదు.
వచ్చే ఎన్నికల్లో మళ్ళీ అధికారంలోకి రావాలని కోరుకుంటున్న బీజేపీ కూడా బ్రాహ్మణులను మచ్చిక చేసుకోవాలని అనుకున్నది. అందుకనే అర్జంటుగా రాష్ట్రంలో, కేంద్రంలో బ్రాహ్మణులకు మంత్రి పదవులు కట్టబెట్టింది. మంత్రి పదవులు ఇవ్వటం ద్వారా వారిని బుజ్జగించవచ్చని అనుకుంటే హఠాత్తుగా రైతుల మరణాలు ఘటన తలకు చుట్టుకున్నది. ఆరోపణలు ఎదుర్కొంటున్న అజయ్ మిశ్రా కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన నేతే కావడం గమనార్హం. కాబట్టి మిశ్రాను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఎదురయ్యే సమస్యేమిటో మోడీకి బాగా అర్థమైనట్టుంది.
ఇపుడు సమస్యేమిటంటే సామాజికవర్గాన్ని ప్రసన్నం చేసుకోవటానికి మిశ్రాను కంటిన్యు చేయటమా ? లేకపోతే తప్పుచేశారన్న కారణంతో మిశ్రాను మంత్రివర్గం నుంచి తప్పించటమా ? ఈ రెండింటి మధ్య ఏమి చేయాలో తేల్చుకోలేక మోడి ఇపుడు నానా అవస్తలు పడుతున్నారు. బ్రాహ్మణులను అందలం ఎక్కిస్తే వచ్చే ఎన్నికల్లో లబ్దిపొందవచ్చని మోడి అనుకుంటే చివరకు అది ఇంకేదో యాంగిల్లోకి వెళ్ళిపోతోంది. దీంతో జరిగిన డ్యామేజీని ఎలా కంట్రోల్ చేయాలో మోడికి అర్ధం కావటంలేదు.