టీడీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి, ఎన్టీఆర్ హయాం నుంచి రాజకీయ చక్రం తిప్పుతున్న గోరంట్ల బుచ్చయ్య చౌదరి విషయం.. టీడీపీలో ఎప్పుడూ హాట్ టాపిక్‌గానే నడుస్తోంది. గతంలో అన్నగారి హయాంలో ఆయన చెంతన చేరిన బుచ్చయ్య.. అన్నగారి టీంగా గుర్తింపు పొందారు. పార్టీలో తలెత్తిన సంక్షోభ సమయంలో మెజారిటీ నాయకులు.. చంద్రబాబుకు జైకొట్టారు. అయితే. ఆసమయంలో లక్ష్మీపార్వతి వర్గంగా ఉన్న బుచ్చయ్య.. అనంతర పరిణామాలతో తిరిగి బాబు గూటికి చేరారు. వరుసగా ఎమ్మెల్యే కూడా అయ్యారు. 2014, 2019లోనూ ఆయన గెలుపు గుర్రం ఎక్కారు. అయితే.. బుచ్చయ్యకు ఆశించిన మేరకు న్యాయం జరగడం లేదని.. ఆయనతోపాటు.. ఆయన వర్గం కూడా తరచుగా ఆరోపిస్తూనే ఉంది.
మరీ ముఖ్యంగా.. చంద్రబాబుకు, బుచ్చయ్యకు, లోకేష్‌కు అస్సలు పడడం లేదనే వార్తలు కూడా గత ఐదేళ్ల కాలంలో హల్ చల్ చేశాయి. తనకు మంత్రి పదవి ఇవ్వకుండా.. అప్పుడే పార్టీలోకి వచ్చిన.. అనేక మందికి ఇచ్చారంటూ.. 2017లో(బాబు పాలనలో మధ్యలో మంత్రి వర్గాన్ని విస్తరించినప్పుడు.. కేఎస్ జవహర్‌కు మంత్రి పదవి ఇచ్చారు) ఒకింత యుద్ధమే చేశారు. ఆ తర్వాత కొన్నాళ్లపాటు.. ఆయన పార్టీకి దూరంగా ఉన్నారు. అయినప్పటికీ.. చంద్రబాబు బుచ్చయ్యకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వలేదు. ఇక, లోకేష్‌ను బుచ్చయ్య ఖాతరు చేయడం లేదనే విమర్శలు వచ్చాయి. దీనిని బుచ్చయ్య కూడా పట్టించుకోలేదు. ఈ పరిణామాల క్రమంలోనే ఇటీవల బుచ్చయ్య చౌదరి.. తాను రాజీనామా చేస్తున్నానంటూ.. సంచలన ప్రకటన చేశారు.
ఈ పరిణామం.. టీడీపీని ఉలిక్కి పడేలా చేసింది. అయితే.. చంద్రబాబు జోక్యంతో కొంత సర్దుమణిగినా.. బుచ్చయ్యలో అసంతృప్తి.. పార్టీపై ఉన్న నిబద్ధత.. ఎక్కడా తొణికి పోలేదని తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి స్పష్టమైంది. పార్టీపై బుచ్చయ్యకు ఉన్న అభిమానం.. అదేసమయంలో పార్టీలో తనకు లభించని గౌరవం.. అసంతృప్తి.. లోటు పాట్లు.. ఇలా అనేక విషయాలను ఆయన ఏకరువు పెట్టారు. ప్రతి విషయాన్నీ నిశితంగా వెల్లడించారు. ఎక్కడా తొణకలేదు.. మనసులో దాచుకోలేదు కూడా!! దీంతో బుచ్చయ్య వ్యాఖ్యలు మరోసారి టీడీపీలో చర్చకు దారితీశాయి.
వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మళ్లీ అధికారంలోకి వస్తుందని… చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రిగా చూస్తామని పార్టీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలో ఉన్నప్పుడు రాజకీయంగా వేసిన తప్పటడుగులు… ఇప్పుడు చోటు చేసుకుంటున్న లోటుపాట్ల గురించి నిర్మొహమాటంగా చెప్పారు. ” అవకాశవాద రాజకీయాలు వస్తున్నాయి. నమ్మదగ్గ మనుషులు లేకుండా పోతున్నారు. ఇది మంచిది కాదని చెప్పాను. పార్టీని నెమ్మదిగా పెంచాలని కూడా చెప్పాను. లేఖ కూడా రాశాను. దాంతో పార్టీలో నన్ను బ్లాక్ లిస్టులో పెట్టారు” అంటూ.. పార్టీలో తన స్థానం ఏంటో చెప్పకనే చెప్పారు.
40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో చంద్రబాబుకు తాను అనేక సూచనలు చేశానని బుచ్చయ్య వివరించారు. ప్రత్యేక హోదా విషయంలో పార్టీ అధినేత చంద్రబాబు ద్వంద్వ ప్రమాణాలు పాటించడం ద్వారా.. పార్టీ క్రెడిబులిటీ దెబ్బతిందని నిర్మొహమాటంగా వెల్లడించారు. అలాగే, అమరావతి, పట్టిసీమ తదితర విషయాల్లో అన్ని పార్టీలను పిలిచి మాట్లాడి ఉంటే వేరేగా ఉండేదన్నారు. అయితే.. తాను ఏం చెప్పినా.. పక్కన పెట్టిన విషయాన్ని బుచ్చయ్య ఇప్పటికీ మరిచిపోకపోవడం గమనార్హం. అంతేకాదు.. లోకేష్ విషయంలోనూ.. తాను తొందర పడొద్దని హెచ్చరికలు చేసినట్టు వివరించారు. 2024 ఎన్నికల్లో లోకేష్ కాకుండా.. చంద్రబాబు ఫొటోతోనే ప్రజల్లోకి వెళ్లాలనేది బుచ్చయ్య ఆలోచనగా ఉంది.
నిజానికి ఇప్పుడు ఎక్కువ మంది లోకేష్‌కు జై కొడుతున్నారని.. కానీ, ఇది ప్రజల్లోకి వెళ్లడం లేదని బుచ్చయ్య వెల్లడించారు. అమరావతి రాజధాని ఆలోచన నుంచి.. పోలవరం ముంపు మండలాల విలీనం వరకు కూడా తన పాత్రను ఆయన వివరించారు. “అమరావతి రాజధాని విషయంలో ముందుగా స్పందించింది నేనే. ఈ ప్రాంతంపై ఒక నోట్ తయారు చేసి ఇచ్చాను. ఆ ప్రాంతం అంతా తిరిగి ఉన్నంతలో ఇదే రాజధానిగా మంచిదని భావించి కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడే ఆయన పీఎస్ అజేయ కల్లం రెడ్డికి అందించాను. టీడీపీ గెలిచిన తర్వాత… రాజధాని నిర్ణయం జరగక ముందే చంద్రబాబుకు కూడా అదే నోట్ ఇచ్చాను. రాబోయే రోజుల్లో అమరావతి ప్రాంతం రాజధాని అవ్వొచ్చని అప్పుడే చెప్పాను” అని బుచ్చయ్య వివరించారు.
అదేసమయంలో పోలవరం విషయంపై కూడా నిర్మొహమాటంగా తన అభిప్రాయం వెల్లడించారు. “పోలవరం ప్రాజెక్టు ముంపు మండలాలు ఏపీలో విలీనం చేయకుంటే చాలా నష్టం జరుగుతుందని మాజీ ఈఎన్సీ సీతాపతిరావు ఇచ్చిన నోట్ తీసుకెళ్లి చంద్రబాబుకు ఇచ్చాను. దీంతో వెంటనే చంద్రబాబు, వెంకయ్య నాయుడు కలిసి మోదీ తొలి కేబినెట్లో ఆ ముంపు మండలాలు విలీనం ఆర్డినెన్స్‌కు ఆమోదం తెచ్చారు. కానీ నేనెప్పుడూ క్రెడిట్ కోసం చెప్పుకోలేదు” అని బుచ్చయ్య చౌదరి చెప్పారు. ఇలా.. పార్టీలోని లోటు పాట్లే కాదు.. చంద్రబాబు, లోకేష్ సహా అనేక మంది వ్యవహారాలపై ఆయన స్పందించారు. ప్రతి విషయాన్నీ.. పూస గుచ్చినట్టు వివరించారు. మొత్తానికి బుచ్చయ్య మనసులో మాట.. కొంత సూటిగా ఉన్నా.. ఇప్పుడైనా.. ఆయన మాటలు వినేవారు ఉన్నారా? అనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.