ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే శాసనసభ ఎన్నికలపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటి నుంచే దృష్టి సారించారు. ఆ దిశగా పార్టీ బలోపేతంపై దృష్టి సారించిన ఆయన.. మరోవైపు వివిధ కార్యక్రమాలతో ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇటీవల రిపబ్లిక్ ప్రి రిలీజ్ వేడుకులో ఏపీ సీఎం జగన్‌పై అధికార ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసిన పవన్.. శ్రమదానం కార్యక్రమంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపారు. ఇటీవల ఏపీలో పరిషత్ ఎన్నికల్లో జనసేనకు ఆశాజనక ఫలితాలు రావడంతో కొత్త ఉత్సాహంలో ఉన్న పవన్ దూకుడు కొనసాగించేందుకు సిద్ధమయ్యారు. ముందుగా ఆయన పార్టీ బలోపేతం దిశగా సాగుతున్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
ఇటీవల రాజమండ్రి సభలో పవన్ చేసిన ప్రసంగం ఓ రకంగా సంచలనంగా మారింది. తన రాజకీయ ప్రణాళికల గురించి చెప్పకనే చెప్పిన ఆయన.. కొంతమంది ముఖ్య నేతలను పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. ఇలా ఇతర పార్టీల నుంచి జనసేనలోకి చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న నాయకుల్లో ఇద్దరు మాజీ మంత్రులు ఓ మాజీ ఎమ్మెల్యే ఉన్నట్లు సమాచారం. వీళ్లలో ఒకరు ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్నారని తెలుస్తోంది. ఆయన టీడీపీ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు అనే ప్రచారం సాగుతోంది. మెగా కుటుంబంతో మంచి సంబంధాలున్న గంటను గతంలో పవన్ వ్యతిరేకించారు. కానీ ఇప్పుడు పార్టీలో చేర్చుకునేందుకు ఓకే చెప్పారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఉన్న గంటా రాకతో ఉత్తరాంధ్రలో జనసేన బలోపేతమవుతుందని పవన్ అనుకుంటున్నట్లు తెలిసింది. అంతే కాకుండా ఆర్థికంగానూ అండ దొరికినట్లు అవుతుంది. కొంతకాలంగా రాజకీయ భవిష్యత్ గురించి తీవ్రంగా ఆలోచిస్తున్న గంటా.. ఇప్పుడు జోరు మీదున్న జనసేన పార్టీలో చేరేందుకు ప్రయత్నిస్తున్నారని టాక్. మరోవైపు జనసేన బలోపేతం కోసం ఇతర పార్టీల్లోని అగ్ర నాయకులతో కూడా పవన్ ఇటీవల చర్చలు జరుపుతున్నారనే కామెంట్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. అందులో కొంతమంది అధికార వైసీపీ నాయకులు గతంలో కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించిన నేతలున్నట్లు తెలుస్తోంది. అలాగే గతంలో చిరంజీవి ప్రజారాజ్యం పార్టీకి అండగా నిలబడ్డ నాయకులతోనూ పవన్ మంతనాలు సాగిస్తున్నట్లు సమాచారం.
బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు పైనా పవన్ దృష్టి పెట్టారనే వార్తలు వస్తున్నాయి. ఆయనతో పవన్ త్వరలోనే చర్చించే అవకాశాలున్నాయని అంటున్నారు. విష్ణుకుమార్ తనతో పాటు మరికొంత మంది కీలక నాయకులను బీజేపీ నుంచి తీసుకు వచ్చే వీలుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే కృష్ణా జిల్లాకు చెందిన కామినేని శ్రీనివాసును కూడా పార్టీలోకి తీసుకునే వీలుంది. ఆయనకు పవన్ పార్టీలో ముఖ్య బాధ్యతలు అప్పజెప్పే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ నాయకులను పార్టీలోకి చేర్చుకోవాలనే ప్రయత్నాలు చేస్తున్న పవన్ కమ్మ సామాజిక వర్గానికి దగ్గరవాలనే వ్యూహం పన్నారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates