ఏపీలో రోడ్ల దారుణస్థితి నిరసిస్తూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఈ రోజు రెండు జిల్లాల్లో రోడ్లపై శ్రమదానం చేసేందుకు రెడీ అయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఆయన ఈ రోజు ఉదయం రాజమండ్రి సమీపంలోని మధురపూడి విమానాశ్రయం చేరుకున్నారు. ఎన్ని అడ్డంకులు వస్తున్నా కూడా పవన్ మాత్రం పట్టు విడవకుండా రాజమండ్రిలో ఎంట్రీ ఇచ్చారు. పవన్‌కు అభిమానులు, జనసేన సైనికులు ఘనస్వాగతం పలికారు. విమానాశ్రయం నుంచి పవన్ సభ నిర్వహించే బాలాజీపేట వరకు దారి పొడవునా పవన్ అభిమానులు భారులు తీరి మరి ఆయనకు అభివాదం చేశారు. ముందుగా ధవళేశ్వరం బ్యారేజ్‌పై శ్రమదానం చేయాలని అనుకున్నా జలవనరుల శాఖ నుంచి అక్కడ శ్రమదానం చేసేందుకు అనుమతులు రాకపోవడంతో చివరకు నగరంలోని హుకుంపేట రోడ్డుకు ప్రోగ్రామ్‌ను మార్చరు.
నగరంలోని బాలాజీపేటలో పవన్ బహిరంగ సభ ఏర్పాటు చేయడంతో ఆ ప్రాంతానికి భారీ ఎత్తున పవన్ అభిమానులు చేరుకుంటున్నారు. భారీగా ట్రాఫిక్ స్తంభించడంతో పోలీసులు రంగంలోకి దిగి ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి మరీ పవన్ అభిమానులను అదుపులోకి తీసుకుంటున్నారు. పవన్ సభకు ఉభయ గోదావరి జిల్లాల నుంచే కాకుండా.. అటు వైజాగ్ నుంచి భారీ స్థాయిలో కార్యకర్తలు, నాయకులు తరలి వస్తున్నారు. జనసేనాని ఎంట్రీతో గోదావరి తీరం జనంతో పోటెత్తింది. అయితే వీరిని ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకుంటున్నారు. పోలీసుల తీరుపై జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.
బాలాజీపేటకు ఇరువైపులా 5 కిలోమీటర్ల మేర విపరీతమైన ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. పవన్ రిపబ్లిక్ సినిమా ప్రి రిలీజ్ ఫంక్షన్లో ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి జగన్‌ను టార్గెట్ చేసుకుని విమర్శలు చేశాక.. బయటకు వస్తోన్న ప్రోగ్రామ్ కావడంతో ఇప్పుడు ఇక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. రాజమండ్రి నగరంలోనే కాకుండా… జిల్లా అంతటా తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ముఖ్యంగా జనసేన కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడంతో వారిలో మరింత ఆగ్రహాన్ని తెప్పిస్తోంది. మరో వైపు జిల్లా ఏఎస్సీ లలిత కుమారి మాత్రం తాము ఎలాంటి ఆంక్షలు పెట్టడం లేదని… పవన్‌కు సభకు వచ్చిన ఇబ్బందేమి లేదని చెప్పడం కొసమెరుపు.
Gulte Telugu Telugu Political and Movie News Updates