కొద్ది రోజులుగా ఏపీ రాజకీయాలు అధికార, ప్రతిపక్ష నేతల మధ్య విమర్శలు, ప్రతి విమర్శలతో హీటెక్కుతున్నాయి. ఈ క్రమంలోనే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్‌ను టార్గెట్ చేస్తూ విమర్శలు చేయడం ఆ వెంటనే వైసీపీకి చెందిన మంత్రులు, నేతలతో పాటు సినీ ఇండస్ట్రీకి చెందిన పోసాని కృష్ణ మురళీ లాంటి వాళ్లు పవన్‌పై తీవ్ర విమర్శలు చేయడం జరిగింది. ఇక ఈ వివాదంలో వైసీపీ వాళ్లు పవన్‌కు – చంద్రబాబుకు లింకు పెట్టి కూడా విమర్శలు చేస్తున్నారు. దీంతో టీడీపీ నేతలు కూడా వైసీపీపై విమర్శలు చేస్తున్నారు.
ఈ తాజా వివాదంపై ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు సైతం స్పందించారు. సీఎం జగన్, ప్రశాంత్ కిషోర్ వికృత క్రీడకు పెయిడ్ అర్టిస్ట్ పోసాని అని ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. పోసాని బూతులు వింటుంటే సభ్య సమాజం తలదించుకునేలా ఉన్నాయని మండిపడ్డారు. అత్యంత జుగుస్సాకరమైన భాషను వాడుతూ పోసాని తెలుగుజాతి సంస్కృతినే మంటగలుపుతున్నారని విమర్శించారు. పీకే ఆడే వికృత ఆటలో పోసాని పావుగా మారి పవన్ కళ్యాణ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులపై నీచమైన భాష వాడుతూ విమర్శలు చేస్తున్నారని… పీకే టీం ఆడిస్తోన్న ఈ వికృత ఆట చూస్తోన్న జగన్ పోసానిని ఎందుకు ? నిలువరించలేకపోయారని అచ్చెన్న ప్రశ్నించారు.
తాగుబోతులు కూడా ఇలా మాట్లాడరని అచ్చెన్న ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఏపీలో వైసీపీ ప్రభుత్వ పాలనలో రాష్ట్రం డ్రగ్స్ మాఫియాకు కేరాఫ్ అడ్రస్‌గా మారిందన్నారు. ధరలు పెంచడం, దోపిడీలకు పాల్పడడం లాంటి చర్యలతో ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్రంగా ఉన్న వ్యతిరేకతను పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని అచ్చెన్న మండిపడ్డారు. పీకే డైరెక్షన్‌లోనే వైసీపీ నేతలు ఏపీలో కుల, మత ప్రాంతీయ తత్వాలను రెచ్చగొట్టి ప్రజాస్వామ్య స్ఫూర్తిని మంటగలుపుతున్నారని.. వీరికి ఖచ్చితంగా ఏపీ ప్రజలు త్వరలోనే గుణపాఠం చెపుతున్నారని అచ్చెన్న జోస్యం చెప్పారు.
ఏదేమైనా అచ్చెన్న ఘాటైన వ్యాఖ్యలు చూస్తే జనసేనకు, పవన్ ఫ్యాన్స్‌కు కాస్త బూస్టప్ ఇచ్చేలా ఉన్నాయి. ఇవి ఈ రెండు పార్టీల మధ్య ఓ సహృధ్భావ వాతావరణానికి బీజం పడేలా చేశాయన్న టాక్ వస్తోంది.