ఆంధ్రప్రదేశ్‌లో వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి వరుసగా రెండో సారి అధికారం దక్కించుకోవాలనే పట్టుదలతో ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఆ దిశగా ఇప్పటి నుంచే వ్యూహాలు సిద్ధం చేస్తున్నారా? అందులో భాగంగానే తనకు తలనొప్పిగా మారిన బీజేపీతో పూర్తి దూరమవాలని నిర్ణయించుకున్నారా? ఇక కమలానికి ఫ్యాన్ గాలి తగలదా? అనే ప్రశ్నలకు రాజకీయ వర్గాల నుంచి అవుననే సమాధానమే వినిపిస్తోంది.
రాజకీయాల్లో రాటు దేలిన జగన్ వచ్చే ఎన్నికల కోసం అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకుంటున్నారనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అందులో భాగంగానే బీజేపీని దూరం పెట్టాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంలోని బీజేపీకి సహకరిస్తూ సాగుతున్న జగన్ ఇప్పుడు తన పంథా మార్చుకున్నారు.
గత రెండున్నరేళ్లుగా కేంద్రంలోని మోడీ సర్కారుకు జగన్ ప్రభుత్వం అన్ని రకాలుగా సహకరిస్తూ వచ్చింది. పార్లమెంటు ఉభయసభల్లో ఏ బిల్లు పెట్టినా సమర్థిస్తూ వస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ మద్దతునిచ్చింది. కానీ ఇప్పుడు జగన్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా ఆయన కేంద్రంతో దూరంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.
కరోనా కట్టడిలో వైఫల్యం, ఇంధన ధరలను కట్టడి చేయలేకపోవడం, రైతు చట్టాలపై మొండి వైఖరి, ప్రభుత్వ సంస్థలను అమ్మేస్తుండడం ఇలా వివిధ కారణాలతో దేశవ్యాప్తంగా మోడీపై వ్యతిరేకత పెరుగుతోంది. మరోవైపు ఏపీలోని విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరణ చేసే దిశగా కేంద్రం కదులుతోంది. దీంతో బీజేపీతో సన్నిహితంగా ఉంటే.. ఆ ప్రైవేటీకరణను అడ్డుకోవడం లేదనే ముద్ర జగన్‌పై పడుతుంది.
ఇక రాష్ట్రంలోని బీజేపీ నేతలు కూడా జగన్‌కు తలనొప్పిగా తయారయ్యారు. వినాయక చవితి ఉత్సవాలు టిప్పు సుల్తాన్ విగ్రహం టీటీడీ బోర్డు నియామకం ఇలా మత విషయాల్లో తన ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని బీజేపీ ప్రయత్నిస్తుండడం జగన్‌కు ఇబ్బందిగా మారింది. తాము బీజేపీకి మద్దతు ఇవ్వడాన్ని తన బలహీనతగా ఆ పార్టీ భావిస్తుందని జగన్ అనుకుంటున్నట్లు తెలిసింది.
అందుకే ఇక పూర్తిస్థాయిలో బీజేపీని దూరం పెట్టాలని ఆయన ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అందుకే ఇటీవల హోం మంత్రిత్వ శాఖ సమావేశానికి కూడా జగన్ వెళ్లకపోవడానికి అదే కారణమని విశ్లేషకులు చెబుతున్నారు. ఇక తాజాగా రైతు చట్టాలకు వ్యతిరేకంగా పిలుపిచ్చిన భారత్ బంద్‌కు జగన్ ప్రభుత్వం మద్దతు ఇవ్వడం కూడా అందులో భాగమేననే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
Gulte Telugu Telugu Political and Movie News Updates