జనసేనాని పవన్ కళ్యాణ్ తీరు కొన్నిసార్లు ఆ పార్టీ కార్యకర్తలకు, ఆయన అభిమానులకే అంతుబట్టని విధంగా ఉంటుంది. జనాల మూడ్ ఏంటో అర్థం చేసుకోకుండా ఆయన వివిధ అంశాలపై స్పందించే తీరు ఆశ్చర్యపరుస్తుంటుంది. తాజాగా ప్రధాని నరేంద్ర మోడీ పుట్టిన రోజును పురస్కరించుకుని శుక్రవారం ఆయన వేసిన ‘భజన’ ట్వీట్లు జనసేన వాళ్లకే రుచించలేదు. చాలామంది ట్విట్టర్లో తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
మోడీని పవన్ పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటే అందులో తప్పేమీ లేదు. అవతలున్నది బద్ధ శత్రువైనా సరే.. పుట్టిన రోజు లాంటి సందర్భాలు వచ్చినపుడు శుభాకాంక్షలు చెప్పడం సంప్రదాయం. ఇక భాజపాతో జనసేనకు దోస్తీ ఉంది కాబట్టి పవన్ విషెస్ చెప్పడాన్ని తప్పుగా చూడ్డానికి వీల్లేదు. కానీ ఆయన ప్రదర్శించిన అత్యుత్సాహమే చర్చనీయాంశమైంది. ఏకంగా ఏడు ట్వీట్లు వేసి.. మోడీ ప్రాపకం కోసం పాకులాడుతున్నట్లుగా కనిపించడమే చాలామందికి రుచించలేదు.
దీని వల్ల పవన్ ఏం సాధించాడన్నదే అర్థం కాని విషయం. ఈ ట్వీట్ల ద్వారా మోడీ దృష్టిలో ఏమైనా పడ్డాడా.. కనీసం ఆయన్నుంచి వ్యక్తిగత రిప్లై అందుకున్నాడా అంటే అదీ లేదు. పోనీ మోడీకి, బీజేపీకి ఇలాంటి ట్వీట్లు మేలు చేస్తాయా అంటే అదీ కాదు. అసలు భాజపా వాళ్లు ఒత్తిడి తెచ్చి పవన్‌తో ఇలా ట్వీట్లు వేయించినట్లు కూడా కనిపించలేదు. జనసేనానే అభిమానం ఆపుకోలేక వ్యక్తిగతంగా ఈ ట్వీట్లు వేసినట్లు కనిపిస్తోంది. ఐతే ఇక్కడ అన్నిటికంటే కీలకమైన విషయం.. జనసేన అభిమానులకు ఆందోళన కలిగిస్తున్న విషయం ఏంటంటే.. పవన్‌కు జనాల మూడ్ ఎలా ఉందో అర్థం కావట్లేదని.
మోడీ మీద దేశవ్యాప్తంగా ఇప్పుడున్నంత వ్యతిరేకత ఆయన రాజకీయ జీవితంలో ఎన్నడూ లేదు. కరోనా టైంలో జనాలు అల్లాడిపోతుంటే కేంద్ర ప్రభుత్వం స్పందించిన తీరు.. అసలే కష్టాల్లో ఉన్న జనాలు అసాధారణంగా పెరిగిపోతున్న ధరల ధాటికి కుదేలవుతుంటే పట్టించుకోని వైనం మోడీ మీద తీవ్ర వ్యతిరేకతను పెంచింది. తెలుగు రాష్ట్రాల జనాలకైతే మోడీ మీద పీకల దాకా కోపం ఉంది. ఇలాంటి టైంలో పవన్.. మోడీ భజన చేస్తే ఎలా ఉంటుందన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. జనాల మూడ్ అర్థమై ఉంటే కచ్చితంగా పవన్ ఇలా చేసేవాడు కాదు. మరి ఆయన పరిస్థితులను ఏం గమనిస్తున్నట్లు.. జనాల మనసుల్ని ఏం అర్థం చేసుకుంటున్నట్లు?
Gulte Telugu Telugu Political and Movie News Updates