మీరు కాల్చండి.. నేను చూసుకుంటా. అని ఎవరన్నారు?

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు జాతీయ స్థాయిలో కూడా సంచలనంగా మారిన మొయినాబాద్ ఫామ్ హౌస్ డ్రగ్స్ పార్టీ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. చట్టవిరుద్ధంగా సాగిన ఈ పార్టీలో దొరికిన వారిలో రాజకీయ నేతలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, వైద్యురాలు, పేరు మోసిన లాయర్ ఇలా పలు రంగాలకు చెందిన వారు ఉండటం విశేషం. ఇదంతా ఒక ఎత్తు అయితే, డ్రగ్స్ వినియోగానికి సంబంధించి పోలీసులు వెల్లడించిన వివరాలు ఇప్పటికే సంచలనంగా మారాయి.

ఇంతకూ శనివారం రాత్రి ఏం జరిగింది? సోదాలకు వెళ్లిన పోలీసులు ఏం చేశారు? కాల్పులు జరిగిన సమయంలో ఏం జరిగింది? ఎలాంటి మాటలు వినిపించాయి? వంటి పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చే రిమాండ్ రిపోర్టు బయటకు వచ్చింది. ఇందులో పేర్కొన్న అంశాలు ఇప్పుడు మరింత సంచలనంగా మారాయి. రిమాండ్ రిపోర్టులో పేర్కొన్న ముఖ్యమైన అంశాలు ఇవి.

స్విమ్మింగ్ పూల్ దగ్గర డ్రగ్ తో పాటు మందు పార్టీ జరిగింది. మేం ఫామ్ హౌస్ లోకి వెళ్లగానే మొదటగా బుల్లెట్ శబ్దం వినబడింది. ఆ వెంటనే మేం అప్రమత్తమయ్యాం. మేం పోలీసులం, కాల్పులు జరపొద్దు, మేం ఎలాంటి చర్యలు తీసుకోమని గట్టిగా అరిచాం. అయినా మరో రెండుసార్లు బుల్లెట్ శబ్దం వినిపించింది. ఇదే సమయంలో ఇంకో వైపు నుంచి “మీరు కాల్పులు జరపండి, నేను మొత్తం చూసుకుంటా, ఏం జరిగినా నాదే బాధ్యత” అంటూ గట్టిగా వినిపించింది. దీనికి బదులుగా మేమంతా గట్టిగా అరిచేసరికి ఒకసారిగా ఫైరింగ్ శబ్దం ఆగిపోయింది.

మేమంతా వెంటనే స్విమ్మింగ్ పూల్ వద్దకు చేరుకున్నాం. ఫామ్ హౌస్ సెర్చ్ చేసేందుకు ముందుగానే మేం వారెంట్ తీసుకున్నాం. ఫామ్ హౌస్ లోకి ఎంటర్ కాగానే వెంటనే సెర్చ్ వారెంట్ ను రోహిత్ రెడ్డికి ఇచ్చాం. బాత్రూం దగ్గర ఉన్న నమిత్ శర్మ చేతిలోని పిస్టల్ ను స్వాధీనం చేసుకున్నాం. బుల్లెట్ షెల్స్ పట్టుకొని ఇంకొకరు ఉన్నారు. అతడిని కూడా మేం అదుపులోకి తీసుకున్నాం. ఫామ్ హౌస్ లో ఒక మహిళతో పాటు మొత్తం పదకొండు మందిని అదుపులోకి తీసుకున్నాం.

మేం స్వాధీనం చేసుకున్న పిస్టల్ జర్మన్ మేడ్, పాయింట్ 32 మోడల్ కు సంబంధించినది. అదుపులోకి తీసుకున్న పదకొండు మందిని విడివిడిగా నిలబెట్టి విచారణ జరిపాం. మొదట అందరూ తాము డ్రగ్స్ తీసుకోలేదని బుకాయించే ప్రయత్నం చేశారు. పదేపదే విచారించిన తర్వాత చివరకు సిల్వర్ శరత్ కుమార్ మాత్రం తాను డ్రగ్స్ తీసుకున్నట్లు ఒప్పుకున్నాడు. అతన్ని తనిఖీ చేయగా రెండు గ్రాముల కొకైన్ లభించింది. ఎవరు తీసుకొచ్చారన్న విషయాన్ని అడిగితే మొదట అతడు సమాధానం చెప్పలేదు.

డ్రగ్స్ ఎవరు తెచ్చారన్న అంశంపై పైలట్ రోహిత్ రెడ్డి డ్రైవర్ ను విచారించినప్పుడు కొన్ని వివరాలు బయటకు వచ్చాయి. డ్రగ్స్ కొనుగోలు కోసం కొందరికి డబ్బులు ఇచ్చినట్లు అతడు ఒప్పుకున్నాడు. కొకైన్ తానే తెచ్చానని కౌశిక్ ఒప్పుకున్నాడు. సిమ్లా బిజినెస్ ట్రిప్ కు వెళ్లినప్పుడు తాను కొకైన్ తీసుకొచ్చానని చెప్పాడు. అక్కడ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి డ్రగ్స్ కొన్నట్లు తెలిపాడు. పార్టీ కోసమే కొకైన్ తీసుకొచ్చానని కౌశిక్ చెప్పాడు.

ఒక్కో గ్రాముకు రూ.15 వేల చొప్పున కొనుగోలు చేసినట్లు కౌశిక్ తెలిపాడు. 11 మందికి డ్రగ్ లైవ్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహించాం. అర్జున్ రెడ్డి, కౌశిక్ రవి, రితేష్ రెడ్డి, నమిత్ శర్మ, రోహిత్ రెడ్డిలకు డ్రగ్ పాజిటివ్ వచ్చింది.

కాల్పులు జరిపిన నమిత్ శర్మను అరెస్ట్ చేశాం. పిస్టల్ పైలట్ రోహిత్ రెడ్డి సోదరుడు రితేష్ రెడ్డికి చెందినదిగా గుర్తించాం. లైసెన్సు రివాల్వర్ నితీష్ రెడ్డి వద్ద ఉండాలి. కానీ అది నమిత్ శర్మ వద్దకు వచ్చింది. ఉద్దేశపూర్వకంగానే కాల్పులు జరిపినట్లు నమిత్ శర్మ చెప్పాడు. ఫామ్ హౌస్ లోకి వస్తున్న వారిని భయపెట్టేందుకు కాల్పులు జరిపినట్లు తెలిపారు.

కాల్పులు జరిపి ఫామ్ హౌస్ నుంచి తప్పించుకొని పారిపోవాలని కూడా ప్లాన్ చేసినట్లు సమాచారం. కాల్పులతో పోలీసులను తీవ్రంగా గాయపరచాలని అనుకున్నట్లు వెల్లడైంది. పార్టీలో ఉన్నవాళ్లు లిక్కర్ తో పాటు డ్రగ్స్ కూడా తీసుకున్నట్లు ఒప్పుకున్నారు.

సెకండ్ ఓపీనియన్ కోసం ఎర్రగడ్డ ఆసుపత్రిలో అందరికీ మళ్లీ రక్త నమూనాలతో పరీక్షలు నిర్వహించాం. రెండోసారి పరీక్షలు జరిగినప్పుడు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు డ్రగ్ పాజిటివ్ వచ్చింది. నమిత్ శర్మ మూడు రకాల డ్రగ్స్ తీసుకున్నట్లు రక్త పరీక్షల్లో బయటపడింది. పైలట్ రోహిత్ రెడ్డి, రితేష్ రెడ్డి, అర్జున్ రెడ్డిలు కొకైన్ తీసుకున్నట్లు రిపోర్ట్ వచ్చింది. ఫామ్ హౌస్ లో మొత్తం ఆరుగురికి డ్రగ్ పాజిటివ్ గా వచ్చినట్లు వెల్లడైంది.

మద్యంలో కొకైన్ కలిపి తాగినట్లు కూడా గుర్తించారు. పైలట్ రోహిత్ రెడ్డి వీకెండ్ డ్రగ్ పార్టీ ఏర్పాటు చేసినట్లు ముందుగానే మిగిలిన వారికి సమాచారం ఇచ్చినట్లు పోలీసులు తెలిపారు. ఆయన ఆహ్వానం మేరకే వారు అక్కడికి వచ్చినట్లు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.