డ్రగ్స్ కేసులో పట్టుబడి జైలుపాలైన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వ్యవహారం నుంచి బీఆర్ ఎస్ పార్టీ బయట పడేదెలా? ఇదీ.. ఇప్పుడు ఆ పార్టీని కుదిపేస్తున్న ప్రధాన అంశం. రేవంత్ రెడ్డి పాలనను.. ఆయన విధానాలను.. ఎండగట్టాలని నిర్ణయించుకున్న బీఆర్ఎస్‌కు ఇప్పుడు రోహిత్ రెడ్డి వ్యవహారం కొరుకుడుపడడం లేదు. సర్కారును నిలదీసేందుకు ఏవిషయాన్ని ఎంచుకున్నా.. తమవైపే పెద్ద ఎత్తున డ్రగ్స్ భూతం కనిపిస్తోంది.
సొంత పార్టీ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి డ్రగ్స్ వ్యవహారం.. బీఆర్ ఎస్ పార్టీని కలవరానికి గురి చేస్తోంది. సర్కారు పక్షం దీనిని ప్రధాన అస్త్రంగా మలుచుకుని.. బీఆర్ ఎస్‌ను ఇరుకున పెట్టేందుకు ప్రయత్నించాలని నిర్ణయించిన దరిమిలా.. ఇప్పుడు అసెంబ్లీలో బీఆర్ ఎస్ ఎలా వ్యవహరిస్తున్న అంశం పై ఆ పార్టీ నాయకుల మధ్య తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఈ వ్యవహారం తెరమీదికి రానంత వరకు పలు విషయాలను ప్రస్తావించి.. సర్కారును ఇబ్బంది పెట్టాలని బీఆర్ ఎస్ నాయకులు గట్టి ప్లాన్ వేసుకున్నారు.
కానీ, అనూహ్యంగా డ్రగ్స్ వ్యవహారం తెరమీదికి వచ్చింది. వాస్తవానికి గత ఏడాది అసెంబ్లీ సమావేశాలకు ముందు కూడా.. రోహిత్ రెడ్డిపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చాయి. కానీ, తెరవెనుక ఏం జరిగిందో అది అప్పట్లో సైలెంట్ అయిపోయింది. కానీ, ఇప్పుడు అలా కాదు.. ఏకంగా పోలీసులపైనే కాల్పులు జరపాలని ఆయనే ప్రోత్సహించినట్టుగా ఆరోపణలు రావడం… డ్రగ్స్ పాజిటివ్ కూడా కావడంతో కేసు బలంగా మారింది. దీంతో ఈ వ్యవహారాన్ని రాజకీయంగా ప్రత్యర్థులు వినియోగించుకుంటారు.
అయితే.. ఈ విషయంపై బీఆర్ ఎస్ రెండు కోణాల్లో ఎదురు దాడిచేసేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. 1) రోహిత్ రెడ్డి వ్యవహారాన్ని పార్టీకి అంట కుండా చూసుకోవడం. దీనిపై ఇప్పటికే మాజీ మంత్రి కేటీఆర్ ఓ ప్రకటన చేశారు. అది వ్యక్తిగత వ్యవహారమని.. పార్టీకి సంబంధం లేదని చెప్పుకొచ్చారు. ఇదే వాదనను సభలోనూ వినిపించనున్నారు.
2) ఇంత జరుగుతుంటే.. ప్రభుత్వం ముందుగానే గుర్తించాలి కదా? అంతా అయిపోయిన తర్వాత.. దాడులు చేయడం ఏంటనే.. అంశం ఆధారంగా ఎదురుదాడి. ఈ రెండు విషయాలను బీఆర్ ఎస్ ఇప్పుడు తన అస్త్రంగా చేసుకునేందుకు రెడీ అయిందని సమాచారం.
Gulte Telugu Telugu Political and Movie News Updates