40 ఏళ్ల బంధాన్ని తెంచుకుంటున్నారా?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఆ పార్టీని వీడేందుకు సిద్ధమయ్యారు. దీనిపై ఇటీవలి కాలంలో వస్తున్న వార్తలను నిజం చేస్తూ సోమవారం ఆయన తన అనుచరులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 40 ఏళ్ల బంధం తెగుతోందని వ్యాఖ్యానించారు. 40 ఏళ్లుగా తాను పార్టీలో అనేక సేవలు అందించానని, కానీ తన వర్గానికే న్యాయం చేసుకునే పరిస్థితి లేకుండా పోయిందని జీవన్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

త్వరలోనే మార్పు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించుకున్నట్టు జీవన్ రెడ్డి తన వర్గానికి చెప్పారు. ఈ నెల 25న బీఆర్ ఎస్ పార్టీలో చేరనున్నట్టు తెలిపారు. తన అనుచరులు అందరూ రావాలని, బీఆర్ ఎస్ తో ఎదుగుదలకు అవకాశం ఉంటుందని చెప్పారు. కేసీఆర్ ను ఈ సందర్భంగా ఆయన ఆకాశానికి ఎత్తేశారు. మాజీ సీఎం రాజకీయంగా మనకు మంచి మార్గం చూపిస్తారని వ్యాఖ్యానించారు. తన స్వార్థం కోసం పార్టీ మారడం లేదని, అవమానాలు భరించలేకే తాను పార్టీ మారాల్సి వస్తోందని జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు.

కాగా గత 2023 ఎన్నికల్లో జగిత్యాల నుంచి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ టికెట్ పై పోటీ చేశారు. కానీ ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. బీఆర్ ఎస్ అభ్యర్థి సంజయ్ కుమార్ విజయం సాధించారు. తర్వాత జరిగిన పరిణామాల్లో సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు, అయితే ఇది అధికారికంగా జరగలేదు. దీంతో జగిత్యాలలో జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ మధ్య ఆధిపత్య పోరు మరింత పెరిగింది. దీనిపై ఇప్పటికే రెండు మూడు సార్లు అధిష్టానం కూడా దృష్టి సారించినా ఫలితం కనిపించలేదు.

తన వర్గానికి అన్యాయం చేస్తున్నారన్న వాదన జీవన్ రెడ్డి నుంచి వినిపిస్తోంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కూడా జగిత్యాల మునిసిపల్ చైర్మన్ పోస్టును తనవారికి ఇవ్వకపోవడాన్ని ఆయన జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీఆర్ ఎస్ వైపు మొగ్గు చూపారు. మాస్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న జీవన్ రెడ్డికి బీఆర్ ఎస్ ఎలాంటి ప్రాధాన్యం ఇస్తుందో చూడాలి.