డెవిల్ పాట మీద బూతు వివాదం

కాదేది బూతుకు అనర్హం అన్నారో సినీ కవి. కొందరు దీన్ని నిజం చేసే పనిలో ఉన్నారు. ఇటీవలే కన్నడ ప్యాన్ ఇండియా మూవీ కెడి డెవిల్ నుంచి ‘సర్కే చునర్ తేరి సర్కే’ అనే పాట ఒకటి విడుదల చేశారు. హిందీ వెర్షన్ మన తెలుగు గాయని మంగ్లీ పాడింది. జన నాయకుడు, టాక్సిక్, త్వరలో మెగాస్టార్ – బాబీ కొల్లి మూవీ నిర్మించనున్న కెవిఎన్ ప్రొడక్షన్స్ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. అయితే ఇప్పుడీ సాంగ్ మీద విమర్శల వర్షం కురుస్తోంది.

రఖీబ్ ఆలం సాహిత్యం సమకూర్చిన ఈ పాటలో చాలా ఘాటైన సాహిత్యం ఉంది. మందు తాగే అలవాటున్న విలన్ సంజయ్ దత్ ని ఉద్దేశించి ఐటెం గర్ల్ నోరా ఫతేహి పాడినట్టుగా ఉన్నా బోలెడు ద్వందార్థాలతో ఇదేం బూతురా అనిపించేలా ఉంది. చిత్రీకరణ కూడా అలాగే ఉండటంతో డౌట్ రావడం సహజం. దీంతో నెటిజెన్లు కెడి డెవిల్ మీద కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. రేపు రీల్స్ లో చిన్న పిల్లలు దీన్ని ఇమిటేట్ చేస్తే ఎవరు భాద్యులంటూ నిలదీస్తున్నారు.

ఇది మెల్లగా చిచ్చులా మారనుంది. ధృవ్ సర్జ హీరోగా నటించిన ఈ యాక్షన్ డ్రామాకు ప్రేమ్ దర్శకత్వం వహించారు. నిజానికి మూడేళ్ళుగా ఈ ప్రాజెక్టు నిర్మాణంలో ఉంది. భారీగా ఖర్చు పెట్టారు. ఇంతే బిల్డప్ తో ధృవ్ గతంలో నటించిన మార్టిన్ దారుణంగా డిజాస్టర్ కావడంతో దాని ప్రభావం కెడి డెవిల్ మీద పడిందని బెంగళూరు టాక్. ఎట్టకేలకు షూట్ పూర్తి చేసి ప్రేక్షకుల ముందుకు వేసవిలో తీసుకురాబోతున్నారు.

ఇప్పటికే రకరకాల తలనెప్పులతో సతమతమవుతున్న కెవిఎన్ సంస్థ ఇదో కొత్త ఇష్యూ అని చెప్పాలి. జన నాయకుడు విడుదల తేదీ ఇంకా డిసైడ్ కాక వడ్డీల భారం పెరుగుతోంది. ఓటిటి డీల్ చేజారింది. టాక్సిక్ మార్చి నుంచి జూన్ కు వెళ్ళిపోయింది. కెడి డెవిల్ రిలీజ్ డేట్ ఇంకా నిర్ణయం కాలేదు. ఈ నేపథ్యంలో ఇప్పుడీ సాంగ్ కాంట్రావర్సీ ఎక్కడి దాక వెళ్తుందో చూడాలి. సంజయ్ దత్ తో పాటు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ శిల్పా శెట్టి ఇందులో ప్రధాన పాత్ర పోషించింది.