అమ‌రావ‌తికి విగ్ర‌హ శోభ‌… చంద్ర‌బాబు ఏమ‌న్నారంటే!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తికి విగ్ర‌హ శోభ వ‌చ్చింది. ఇప్ప‌టికే మాజీ ప్ర‌ధాని అట‌ల్ బిహారీ వాజ్‌పేయి విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించిన విష‌యం తెలిసిందే. ఇదే అమ‌రావ‌తిలో తొలి విగ్ర‌హం.. కాగా, ఇప్పుడు అమ‌ర‌జీవి, ఆంధ్ర రాష్ట్ర సాధ‌న కోసం ప్రాణాలు అర్పించిన పొట్టి శ్రీరాములు భారీ విగ్ర‌హాన్ని ఇక్కడ ఏర్పాటు చేశారు. దీనిని ఆయ‌న 126వ జ‌యంతి సంద‌ర్భంగా సీఎం చంద్ర‌బాబు సోమ‌వారం ఆవిష్క‌రించారు.

ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని సాధించేందుకు అమ‌ర‌జీవి చేసిన త్యాగాలను ప్ర‌తి ఒక్క‌రూ గుర్తుంచుకోవాల‌ని సూచించారు. రాజ‌ధాని ప్రాంతంలోని శాఖ‌మూరులో ఆయ‌న విగ్ర‌హం ఏర్పా టు చేయ‌డం రాజ‌ధానికే వ‌న్నెతెచ్చింద‌ని చెప్పారు. రాష్ట్ర సాధ‌న కోసం శ్రీరాములు 58 రోజులు దీక్ష చేసిన నేప‌థ్యాన్ని పుర‌స్క‌రించుకుని 58 అడుగుల విగ్ర‌హాన్ని ఏర్పాటు చేశామ‌ని తెలిపారు.

రాజ‌ధానితో ఆట‌లా!

గ‌త వైసీపీ ప్ర‌భుత్వంపై సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రానికి రాజ‌ధాని లేకుండా చేయాల‌ని ప్ర‌య‌త్నించార‌ని దుయ్య‌బ‌ట్టారు. మూడు రాజ‌ధానులు అంటూ.. అమ‌రావ‌తిని నాశ‌నం చేసే ప్ర‌య‌త్నాలు చేశార‌ని అన్నారు. కానీ, ఇక్క‌డి రైతులు మూడేళ్ల‌పాటు పోరాటం చేసి రాజ‌ధానిని నిల‌బెట్టుకున్నార‌ని తెలిపారు. వారి త్యాగాల‌ను కూడా ప్ర‌భుత్వం మ‌రిచిపోద‌ని, రాజ‌ధాని నిర్మాణాన్ని వేగంగా పూర్తి చేస్తామ‌ని చంద్ర‌బాబు చెప్పారు.

పొట్టి శ్రీరాములు విగ్ర‌హం విశేషాలు..

మొత్తం ఎత్తు: 58 అడుగులు
వాడిన‌ ఇత్త‌డి: 26 ట‌న్నులు
వాడిన ఇనుము: 42 ట‌న్నులు
సిమెంటు: రెండు లారీల లోడు
ఇసుక‌: 12 లారీలు
నిర్మాణానికి ప‌ట్టిన స‌మ‌యం: 6 మాసాలు