చిత్తూరు జిల్లాలోని కీలక నియోజకవర్గం పలమనేరు. కాంగ్రెస్‌కు కంచుకోట వంటి ఈ నియోజకవర్గంలో రాష్ట్ర విభజన తర్వాత.. కాంగ్రెస్ ఓటు బ్యాంకు మొత్తం.. వైసీపీ వైపు మళ్లింది. దీంతో ఇక్కడ వైసీపీ వరుస విజయాలు సాధించింది. 2014లో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు ఎన్ అమర్నాథ్‌రెడ్డి.. వైసీపీలో వచ్చి.. ఇక్కడ నుంచి పోటీ చేశారు. రాష్ట్రంలో వైసీపీ అధికారంలోకి రాకపోయినా.. ఇక్కడ అమర్నాథ్‌రెడ్డి విజయం దక్కించుకున్నారు. అయితే.. తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో ఆయన టీడీపీలోకి చేరి.. మంత్రి పదవిని దక్కించుకున్నారు.
ఇక, 2019 ఎన్నికల విషయానికి వస్తే.. ఇక్కడ మళ్లీ వైసీపీ విజయం దక్కించుకుంది. అయితే.. ఈ దఫా.. రాజకీయాలకు సంబంధమే లేని వ్యక్తి వెంకట్ గౌడను తీసుకువచ్చి.. వైసీపీ ఇక్కడ టికెట్ ఇచ్చింది. జగన్ సునామీలో ఆయన విజయం సాధించారు. ఈయనను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శిష్యుడిగా.. పేర్కొంటారు. కేవలం 5వ తరగతి వరకు మాత్రమే చదివిన వెంకట్ గౌడ్ బేల్దార్ మేస్త్రిగా జీవితాన్ని ప్రారంభించి.. రియల్ ఎస్టేట్ వైపు దృష్టి పెట్టారు. దీనిలో ఆయన సక్సెస్ అయ్యారు. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డితో ఏర్పడిన పరిచయం కాస్తా.. వైసీపీ టికెట్ ఇచ్చే వరకు సాగింది.
గత ఎన్నికల్లో వైసీపీ తరఫున టికెట్ దక్కించుకున్న వెంకట్ గౌడ్.. పార్టీకి.. పార్టీ అధినేత జగన్‌కు అత్యంత విధేయులు అనడంలో సందేహం లేదు. అయితే.. ఎటొచ్చీ.. ఆయన నియోజకవర్గానికి దూరమయ్యారు. తన వ్యాపారాలు.. వ్యవహారాలు అన్నీ కూడా బెంగళూరుతో ముడిపడి ఉండడంతో గత రెండున్నరేళ్లుగా కేవలం విజిటింగ్ ఎమ్మెల్యేగా మాత్రమే ఆయన ఇక్కడ వ్యవహరిస్తున్నారని అంటున్నారు. పైగా మంత్రి పెద్దిరెడ్డి తోనూ విభేదిస్తున్నారు. దీంతో పార్టీ నేతలు ఎమ్మెల్యేకు డిస్టెన్స్ పాటిస్తున్నారు. ఈ పరిణామాల తో ఉలిక్కిపడ్డారో ఏమో.. ఎమ్మెల్యే వెంకట గౌడ్ కళ్లు తెరుచుకున్నారు.
గత వారం రోజులుగా నియోజకవర్గంలో ప్రతి వీధిలోనూ ఆయన పర్యటిస్తున్నారు. ఒకరకంగా పాదయాత్ర చేస్తున్నారు. ఎక్కడికక్కడే ఉన్న సమస్యలను నోట్ చేసుకుంటున్నారు. త్వరలోనే ఆయా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన చెబుతున్నారు. అయితే.. వాస్తవానికి ఇదంతా .. తనపై వచ్చిన వ్యతిరేకతకు చెక్ పెట్టేందుకేనని అంటున్నారు సొంతత పార్టీ నేతలు. మరోవైపు.. ప్రస్తుతం టీడీపీలో ఉన్న మాజీ మంత్రి ఎన్ అమర్‌నాథ్‌రెడ్డి.. దూకుడుగా ఉన్నారు. సమస్యలపై వెంటనే స్పందిస్తున్నారు. ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గంలో ఒక విధమైన వ్యతిరేకత తనకు పెరగడంతో ఎమ్మెల్యే అలెర్ట్ అయ్యారని.. ఇది ఏమేరకు సక్సెస్ అవుతుందో చూడాలని అంటున్నారు పరిశీలకులు.
Gulte Telugu Telugu Political and Movie News Updates