కేసీఆర్ డిమాండ్ ను మోడి పట్టించుకుంటారా ?

రెండు రోజుల ఢిల్లీ పర్యటనలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలిసిన కేసీఆర్ ఓ డిమాండ్ వినిపించారు. ఇంతకీ ఆ డిమాండ్ ఏమిటయ్యా అంటే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో తెలంగాణాకు ఇచ్చిన అన్ని హామీలు కేంద్రం నెరవేర్చాలని. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి ప్రధానమంత్రిని ఇదే డిమాండ్ చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ కూడా ఇదే డిమాండ్ మొదలుపెట్టారు. అంటే ఇద్దరు సీఎంల డిమాండ్లను చూస్తుంటే ఏపీ పునర్విభజన చట్టం అమలు కాలేదని అర్థమైపోతోంది. మరి పునర్విభజన చట్టాన్ని అమలు చేయాల్సిన కేంద్రం ఏమి చేస్తోంది ?

ఇపుడిదే ప్రశ్న అందరినీ వేధిస్తోంది. నిజానికి రాష్ట్ర విభజన వల్ల తీవ్రంగా నష్టపోయింది ఏపీనే. రాజధాని లేక, ఆదాయం లేక, ఆదాయ మార్గాలు కనబడక అప్పుల కుప్పలు పెరిగిపోతోంది. విభజన చట్టంలో ఏపి అభివృద్ధికి ఏర్పాటుచేసిన స్పెషల్ స్టేటస్, వైజాగ్ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్, వెనుకబడిన జిల్లాలకు అభివృద్ధి నిధులు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు లాంటి అనేక హామీలను నరేంద్ర మోడీ సర్కార్ తుంగలో తొక్కింది. విభజన హామీల అమలుపై జనాలు ఎంతగా డిమాండ్ చేసినా మోడీ ప్రభుత్వం ఏమాత్రం లెక్కచేయలేదు.

అలాంటిది ఏడేళ్ళ తర్వాత కేసీయార్ కు హఠాత్తుగా విభజన చట్టం అమలు గుర్తుకొచ్చింది. అన్ని విధాల నష్టపోయిన ఏపీ డిమాండ్ లాగే మిగులు బడ్జెట్ తో ఏర్పాటైన సంపన్న రాష్ట్రం తెలంగాణా కూడా విభజన చట్టం వల్ల నష్టపోయినట్లు ఇప్పుడు కేసీయార్ చెప్పటమే విచిత్రంగా ఉంది. విభజన చట్టాన్ని అమలు చేయకపోవటం వల్ల ఏపీ నష్టానికి కేంద్రం కారణమైనట్లే తెలంగాణా కూడా కారణమైంది. తన భూభాగం మీద ఉన్న కేంద్ర సంస్థలన్నీ తమవే అని కేసీయార్ ఏకపక్షంగా ప్రకటించేసుకున్నారు.

విభజన నాటికి హైదరాబాద్ కేంద్రంగా సుమారు 110 కేంద్ర ప్రభుత్వ రంగ సంస్ధలున్నాయి. వీటిని రెండు రాష్ట్రాల మధ్య పంచాలి. అయితే వీటి పంపకానికి తెలంగాణా అంగీకరించలేదు. అలాగే వ్యవసాయ విశ్వవిద్యాలయం లాంటి అనేక యూనివర్సిటీల ఆస్తులను కూడా ఏకపక్షంగా సొంతం చేసుకున్నారు. అంటే అటు మోడీ ఇటు కేసీఆర్ ఇద్దరు కలిసే ఏపీకి తీరని అన్యాయం చేశారు. అలాంటి కేసీఆర్ ఇప్పుడు పునర్విభజన చట్టాన్ని అమలు చేసి తెలంగాణకు న్యాయం చేయాలని మోడిని కోరటమే ఆశ్చర్యంగా ఉంది.