జనసేనాని పవన్ కళ్యాణ్‌కు, ఆయన పార్టీకి మరింత డ్యామేజీ తప్పదా? మారుతున్న రాజకీయాలు.. పర్యవసానాలను అందిపు చ్చుకోవడం.. దానికి తగిన విధంగా వ్యవహరించే విషయంలో పవన్ అనుసరిస్తున్న వైఖరికి మొదటికే మోసం తెస్తుందా? అంటే.. ఔననే అంటున్నారు పరిశీలకులు. రాష్ట్రంలో పవన్ ఎక్కువగా ఆశలు పెట్టుకున్న ప్రాంతాలు.. రాయల సీమ, ఉత్తరాంధ్రలు. ఈ రెండు ప్రాంతాల్లోనూ ఆయన అనేక మార్లు పర్యటించారు. ఇక, ఉత్తరాంధ్రలో అయితే.. వెనుక బడిన జిల్లాలంటూ.. 2018లో దాదాపు నెల రోజుల పాటు అక్కడే మకాం వేసి.. రోడ్ షోలు కూడా నిర్వహించారు. ఇక, కిడ్నీ సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్న శ్రీకాకుళం విషయంలో ఆసక్తిగానే స్పందించారు.
ఇక, సీమలోనూ పవన్ తన ముద్ర వేసుకునే ప్రయత్నం చేశారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పర్యటించారు. ఇక్కడి సాగు నీటి కోసం.. ప్రజలు ఎన్ని దశాబ్దాలు.. ఎదురు చూడాలని ఆయన ప్రశ్నించారు. ఈ క్రమంలో రైతులను కూడా కలుసుకున్నారు. ‘నేనున్నా’ అంటూ.. భరోసా నింపే ప్రయత్నం చేశారు. అయితే.. ఇప్పుడు మాత్రం పవన్ ఎక్కడా కనిపించడం లేదు. ఎక్కడా గళం వినిపించడం లేదు. వాస్తవానికి ఇప్పుడు రెండు సమస్యలపై ఉత్తరాంధ్ర, సీమ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటీకరిస్తామన్న కేంద్రం నిర్ణయానికి వ్యతిరేకంగా ఇక్కడి ఉద్యోగ సంఘాలు.. తీవ్రస్థాయిలో ఉద్యమిస్తున్నాయి. తమ పోరాటాన్ని ఢిల్లీ వరకు తీసుకువెళ్లాయి.
ఈ క్రమంలో వైసీపీ స్పందించింది. తాము కూడా విశాఖ ఉక్కు ప్రైవేటుకు వ్యతిరేకమని.. వామపక్షాలు సహా.. ఇతర ఉద్యోగ సంఘాలతో కలిసి.. కేంద్రంపై ఒత్తిడి తెస్తున్నామని పేర్కొంది. ఇక, ప్రధాన ప్రతిపక్షం టీడీపీ కూడా తమ ఎంపీలను రాజీనామా చేయించేందుకు రెడీగా ఉన్నామని ప్రకటించింది. మరి పవన్ ఏమయ్యారు. విశాఖ ఉక్కు విషయంలో ఆయన వైఖరి ఏంటి? కేంద్రంతో చెలిమిచేస్తున్నందున.. విశాఖ ఉద్యోగులు, ప్రజల మనోభావాలను బీజేపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లే ప్రయత్నం చేయలేరా? అంటూ.. ప్రశ్నల వర్షం కురుస్తోంది. ఇక, సీమ విషయానికి వస్తే.. జగన్ సర్కారు ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాయల సీమ ఎత్తిపోతల పథకం.. సీమలోని నాలుగు జిల్లాలకు మేలు చేయనుంది.
అయితే.. ఈ ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. దీనిపై కేంద్రానికి కూడా ఫిర్యాదులు వెళ్లాయి. ఇక్కడి ప్రజలకు తాగు, సాగు నీరు అందడం లేదని.. దశాబ్దాల పాటు వారు రాజకీయ ఉక్కు కౌగిళ్లలోనలిగిపోతున్నారని.. గతంలో వ్యాఖ్యానించిన పవన్.. మరి సీమ ఎత్తిపోతల పథకానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న తెలంగాణతో సంప్రదింపులు చేయొచ్చుకదా? అనేది ప్రశ్న. అదేసమయంలో ఇది కుదరకపోతే.. కేంద్రం వద్దకు చేరిన ఈ వివాదంలో అయినా.. ఆయన పరిష్కారానికి కృషి చేయొచ్చుకదా! అనేది రాజకీయ నేతల మాట. ఈ క్రమంలో పవన్ మౌనంగా ఉండడం.. అంతా అయిపోయిన తర్వాత వచ్చి రెండు సినిడైలాగులు పేల్చిపాలకులను తప్పు పట్టడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని అంటున్నారు. మరి పవన్ ఏం చేస్తారో చూడాలి.