ప్రధాన మంత్రి నరేంద్రమోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలు.. ఇప్పుడు బ్రాహ్మణ సామాజికవర్గం వైపు మొగ్గు చూపుతున్నారు. వారిని తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. బ్రాహ్మణులకు ప్రాధాన్యం పెంచుతామని.. వారికి ఇప్పటికే అగ్రవర్ణ పేదల రిజర్వేషన్ కోటాలో మేళ్లు జరిగేలా చేస్తున్నామని.. ఇరువురు అగ్ర నేతలు చెబుతున్నారు. అంతేకాదు.. ఇకపై కూడా బ్రాహ్మణ సామాజిక వర్గానికి తాము ప్రాధాన్యం ఇస్తామని వాగ్దానాలు సైతం చేస్తున్నారు. మరి.. దీనికి రీజనేంటి? ఎందుకు మోడీ-షాల వ్యూహం బ్రాహ్మణులవైపు మళ్లింది? అనూహ్యంగా వారి వైపు ఎందుకు మళ్లుతున్నారు? అనే విషయాలు చర్చనీయాంశంగా మారాయి.
విషయంలోకి వెళ్తే.. వచ్చే ఏడు మాసాల్లో ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. వీటిలో అతి పెద్ద రాష్ట్రం, అందునా.. బీజేపీ పాలిత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ కూడా ఉంది. వైశాల్య పరంగానే కాకుండా రాజకీయాల పరంగా కూడా దేశంలో అతి పెద్ద రాష్ట్రం యూపీనే. పార్లమెంటు స్థానాలు, అసెంబ్లీ స్థానాల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. 2017లో ఇక్కడ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం దక్కించుకుంది. అదేసమయంలో 2019 సార్వత్రిక సమరంలో మెజారిటీ ఎంపీ స్థానాలను తన ఖాతా లో వేసుకున్న బీజేపీ.. కేంద్రంలో అదికార పగ్గాలు దక్కించుకోవడంలో ఈ రాష్ట్రం తమకు ఎంతో కలిసి వచ్చిందని భావిస్తోంది. దీంతో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ సమరాన్ని కూడా బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది.
ఇక, రాష్ట్ర రాజకీయ పరిణామాలను గమనిస్తే.. మైనార్టీలు బీజేపీకి దూరంగానే ఉంటున్నారు. ఎస్సీ,ఎస్టీల ఓటు బ్యాంకు ఒకప్పుడు మాయావతి నేతృత్వంలోని బహుజన్ సమాజ్ వాదీ పార్టీ(బీఎస్పీ)వైపు ఉండగా.. 2017, 2019 అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల సమయంలో బీజేపీకి అనుకూలంగా మారారు. అదేసమయంలో 20 శాతం ఓటు బ్యాంకు ఉన్న బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని గత ఎన్నికల సమయంలో బీజేపీ తనవైపు తిప్పుకోవడంలో సక్సెస్ అయింది. ఈ క్రమంలోనే రాష్ట్రంలో అధికారం చేపట్టడం తమకు సాధ్యమైందని.. బీజేపీ నమ్ముతూ వచ్చింది. అయితే.. రాష్ట్ర అధికార పగ్గాలు చేపట్టిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. తన సామాజిక వర్గానికి(ఠాకూర్లు) ప్రాధాన్యం ఇస్తున్నారనే వాదన వినిపిస్తోంది.
దీనికి ఎవరూ వ్యతిరేకం కాకపోయినా.. కీలకమైన ఓటు బ్యాంకు ఉండి, హిందూత్వ వాదులుగా పేరున్న బ్రాహ్మణ సామాజిక వర్గాన్ని సీఎం యోగి నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు.. రెండేళ్లుగా వినిపిస్తున్నాయి. తమపై దాడులు జరుగుతున్నా.. తమ వర్గం వారు హత్యలకు గురైనా ముఖ్యమంత్రి ఉదాసీనంగా ఉన్నారని.. బీజేపీ నేతలు కూడా పెద్దగా రియాక్ట్ కావడం లేదని.. అదేసమయంలో మంత్రి వర్గంలోనూ తమకు ప్రాధాన్యం లభించడం లేదని.. బ్రాహ్మణ సామాజిక వర్గం ఆరోపిస్తోంది. ఈ క్రమంలోనే గడిచిన రెండేళ్లుగా.. బీజేపీకి బ్రాహ్మణ సంఘాలు దూరంగా ఉంటున్నాయి. దీనిని పసిగట్టిన ప్రధాన ప్రతిపక్షాలు.. బీఎస్పీ, సమాజ్ వాదీ పార్టీ(ఎస్పీ), కాంగ్రెస్ లు బ్రాహ్మణులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఒకప్పుడు బ్రాహ్మణులపై నిప్పులు చెరిగి, మనువాదాన్ని తెరమీదికి తెచ్చి.. వివాదాలకు ఆజ్యం పోసిన.. బీఎస్పీ అధినేత్రి మాయావతి.. ఇప్పుడు అదే బ్రాహ్మణులను చేరువ చేసేందుకు బ్రాహ్మణ సమ్మేళనాల పేరుతో సభలు పనిర్వహించేందుకు రెడీ అయ్యారు. ఇక, ఎస్పీ నేత..మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ కూడా ప్రబుద్ధ సమ్మేళనాల పేరుతో .. బ్రాహ్మణులను తమవైపు తిప్పుకొనే ప్రయత్నం చేస్తున్నారు. మరోవైపు.. కాంగ్రెస్ కూడా ఈ దారిలో దూకుడుగా ఉంది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపిస్తే.. బ్రాహ్మణ సామాజిక వర్గానికే సీఎం పీఠం అప్పగిస్తామని ప్రకటించింది.
ఇలా.. బీజేపీకి దూరమవుతున్న బ్రాహ్మణ ఓటు బ్యాంకును తమవైపు తిప్పుకొనేందుకు ఇతర పార్టీలు ప్రయత్నాలు సాగిస్తుండడంతో రాష్ట్ర సర్కారుకు ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే కేంద్రంలోని అగ్రనాయకులు.. యూపీ పరిణామాలపై కీలక అడుగులు వేస్తూ.. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే.. ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న బీజేపీ తిరిగి అధికారంలోకి రావడం.. మోడీకి, షాకు అత్యంత కీలకం. వచ్చే సార్వత్రిక సమరంలో 75 పార్లమెంటుస్థానాలు ఉన్న యూపీని తమవైపు తిప్పుకోవాలంటే.. రాష్ట్రంలో అధికారం దక్కాల్సిందేనని మోడీ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో మరింత వ్యూహాత్మకంగా వ్యవహరించేందుకు ప్రయత్నిస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.