ఢిల్లీ గడ్డపై అడుగుపెట్టగానే రష్యా అధ్యక్షుడు పుతిన్ అమెరికాకు గట్టి కౌంటర్ ఇచ్చారు. ఉక్రెయిన్ యుద్ధం పేరుతో రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని భారత్‌పై ఒత్తిడి తెస్తున్న అగ్రరాజ్యానికి తనదైన శైలిలో చురకలు అంటించారు. రెండ్రోజుల పర్యటన కోసం వచ్చిన ఆయన, ఇండియా టుడేతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అంతర్జాతీయ రాజకీయాల్లో వేడి పుట్టిస్తున్నాయి.
అమెరికా ద్వంద్వ వైఖరిని పుతిన్ ఎండగట్టారు. “అమెరికా తన అణు విద్యుత్ కేంద్రాల కోసం మా దగ్గరి నుంచే న్యూక్లియర్ ఇంధనాన్ని కొంటోంది. అది కూడా ఇంధనమే కదా? మరి వాళ్లకు మా సరుకు కొనుక్కునే హక్కు ఉన్నప్పుడు, భారత్‌కు ఎందుకు ఉండకూడదు?” అని పుతిన్ సూటిగా ప్రశ్నించారు. మా దగ్గర ఆయిల్ కొనొద్దని భారత్‌ను బెదిరించే హక్కు అమెరికాకు లేదని తేల్చి చెప్పారు.
ప్రస్తుతం ట్రంప్ ప్రభుత్వం భారత్‌పై ఆంక్షలు, టారిఫ్స్ పేరుతో ఒత్తిడి పెంచుతోంది. రష్యా ఆయిల్ కొనడం వల్లే మాస్కో యుద్ధానికి ఫండింగ్ వెళ్తోందని అమెరికా ఆరోపిస్తోంది. దీనివల్ల ఈ నెలలో భారత్ ఆయిల్ దిగుమతులు మూడేళ్ల కనిష్ఠానికి పడిపోయే ప్రమాదం ఉంది. ఇలాంటి టైంలో పుతిన్ చేసిన ఈ వ్యాఖ్యలు భారత్‌కు మద్దతుగా నిలిచాయి.
ఇక పుతిన్ రాకతో ఢిల్లీలో స్నేహ బంధం వెల్లివిరిసింది. ప్రధాని మోదీ ప్రోటోకాల్ పక్కనపెట్టి మరీ ఎయిర్‌పోర్టుకు వెళ్లి పుతిన్‌ను ఆలింగనం చేసుకున్నారు. ఇద్దరూ ఒకే కారులో వెళ్లి ప్రైవేట్ డిన్నర్ చేయడం వీరి మధ్య ఉన్న సాన్నిహిత్యాన్ని చాటిచెప్పింది. ప్రపంచం ఎన్ని ఆంక్షలు పెట్టినా రష్యాతో దోస్తీ తగ్గేదేలే అని మోదీ చెప్పకనే చెప్పారు.
కేవలం ఆయిల్, ఆయుధాలే కాదు.. ఇకపై వ్యాపారాన్ని అన్ని రంగాలకు విస్తరించాలని ఇద్దరు నేతలు డిసైడ్ అయ్యారు. 2030 నాటికి ఇరు దేశాల వాణిజ్యాన్ని 100 బిలియన్ డాలర్లకు తీసుకెళ్లడమే టార్గెట్. ప్రస్తుతం ఎనర్జీ మీదే నడుస్తున్న వ్యాపారాన్ని ఇతర రంగాలకు కూడా మళ్లించి, అమెరికా ఆంక్షలకు చెక్ పెట్టాలని చూస్తున్నారు. మొత్తానికి పుతిన్ పర్యటన ఆరంభంలోనే అమెరికాకు ఒక స్ట్రాంగ్ మెసేజ్ పంపింది.
Gulte Telugu Telugu Political and Movie News Updates