కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల ముఖ్యనేతలు చెబుతున్నారు. ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ ఒకే మాటపై నిలుస్తుండడం కూటమి ఐక్యతకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇది విపక్షాలకు మింగుడు పడడం లేదు.
‘పవన్అన్న’ మాటే.. ‘తమ్ముడు లోకేష్’ మాట అన్నట్లుగా ఉంటున్నారు. ఒకేరోజు ఇద్దరు నేతలు కూటమి శ్రేణులతో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఒకే మాట మాట్లాడారు. పార్టీలో చిన్నచిన్న సమస్యలున్నా మనలో మనమే చర్చించుకుని పరిష్కరించుకుందామని పార్టీ శ్రేణులకు సూచించారు. కలిసికట్టుగా ముందుకెళ్దామని పిలుపునిచ్చారు.
15 ఏళ్లపాటు అధికారంలో ఉంటామంటూ కూటమి నేతలు చెబుతున్నారు. దానికి కావలసిందల్లా ఐక్యంగా ఉండటమే అంటున్నారు. ఆ బాధ్యతను జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీసుకున్నారు. నిన్న కూటమి నాయకుల సమావేశంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మన ఐక్యతే రాష్ట్రానికి బలం అన్నారు. మనందరం రాష్ట్రం బాగుండాలి అరాచకాలు ఉండకూడదు అనే సదుద్దేశంతో ఒక గొడుగు కిందకు వచ్చి కూటమిగా ఏర్పడ్డాం.
మనలో మనకు చిన్న చిన్న కమ్యూనికేషన్ గ్యాప్స్, మనస్పర్థలు ఉండటం సహజం. ఒక చోట కూర్చొని మాట్లాడుకుంటే అన్ని సమస్యలు తీరతాయని కార్యకర్తలకు తెలిపారు. ఇదే ఐక్యతతో మరో 15 ఏళ్లు కష్టపడితే రాష్ట్రానికి సుస్థిర అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆయన అన్నారు.
నిన్నటి పాలకొండ మీటింగ్లోనూ మంత్రి నారా లోకేష్ఇటువంటి వ్యాఖ్యలనే చేశారు. పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత కార్యకర్తలపై ఉందన్నారు. కలసికట్టుగా అందరం ముందుకెళ్లాలి. ఆంధ్రప్రదేశ్ లో డబుల్ ఇంజన్ బుల్లెట్ ట్రైన్ సర్కారు వల్లే రాష్ట్రానికి కావాల్సినవి సాధించుకుంటున్నాం. పవనన్న చెప్పినట్లుగా రాబోయే 15ఏళ్లు మనం కలసి ఉండాలి. చిన్నచిన్న సమస్యలుంటే కూర్చుని మాట్లాడుకొని పరిష్కరించుకోవాలని లోకేష్ సూచించారు.
పవన్, లోకేష్ఎన్నికల ముందు నుంచి అన్నదమ్ముల్లా మెలుగుతున్నారు. మంత్రులుగా ఎవరి శాఖలలో వారు మెరుగై ఫలితాలను సాధిస్తున్నారు. ఇంకోవైపు ఎవరి పార్టీ కార్యకర్తలకు వారు పెద్ద పీట వేస్తూ సమావేశాలు నిర్వహిస్తున్నారు. కూటమి బలం, బలగం మీరేనని కార్యకర్తలకు చెబుతున్నారు. పదిహేనేళ్లు కలిసి ఉండడానికి తమ వంతు బాధ్యత నిర్వహిస్తున్నారు.
ఇదే వైసీపీకి మింగుడు పడడం లేదు. అవకాశం వచ్చినప్పుడల్లా ఇరు పార్టీల మధ్య చిచ్చు పెట్టడానికి ప్రయత్నాలు చేస్తోందని టీడీపీ ఆరోపిస్తోంది. దానిని సమర్ధంగా టీడీపీ, జనసేన పార్టీలు తిప్పి కొడుతున్నారు. ముఖ్యంగా తమ కార్యకర్తలను సంతృప్తి పరచడంలో, పలు విషయాల్లో నచ్చ చెప్పుకోవడంలో పవన్, లోకేష్ సక్సెస్ అవుతున్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
Gulte Telugu Telugu Political and Movie News Updates