మా ఆవిణ్ణి గెలిపిస్తే.. ఫ్రీ షేవింగ్‌: ‘పంచాయ‌తీ’ హామీ

ఎన్నిక‌లు ఏవైనా.. ప్ర‌జ‌ల‌కు ‘ఫ్రీ బీస్‌’ ఉండాల్సిందే. అవి స్థానిక‌మా.. అసెంబ్లీనా, పార్ల‌మెంటా? అనే విష‌యంతో సంబంధం లేకుండా పోయింది. ప్ర‌జ‌లు అల‌వాటు ప‌డ్డార‌ని చెప్ప‌లేం కానీ.. నాయ‌కుల‌కు ఇలా ఉచితాలు ప్ర‌క‌టించ‌డం.. హాబీగా.. అంత‌కుమించి భ‌రోసాగా మారిపోయింది. దీంతో ఇప్పుడు ఎన్నిక‌ల స్థాయితో సంబంధం లేకుండా.. నాయ‌కులు హామీలు గుప్పిస్తున్నారు.

తాజాగా తెలంగాణలో జ‌రుగుతున్న పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో చిత్ర‌మైన హామీ ఒక‌టి ప్ర‌చారంలోకి వ‌చ్చింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండ‌లం రఘోత్తంపల్లిలో వార్డు స్థానానికి పోటీ చేస్తున్న మహిళా అభ్యర్థి భర్త ఇక్క‌డి ప్ర‌జ‌ల‌కు విచిత్ర హామీ ఇచ్చారు. ‘నా భార్యను వార్డు మెంబర్ గా గెలిపిస్తే నా వార్డు పరిధిలోని పురుషులందరికీ ఐదేళ్లపాటు ఉచితంగా కటింగ్, షేవింగ్ చేస్తా. అలాగే వార్డును అభివృద్ధి చేస్తా’ అని చెప్పారు. ఆయన హామీ చుట్టుపక్కల గ్రామాల్లో తెగ వైరల్ అవుతోంది.

ఇదొక్క‌టే కాదు.. ఇదే జిల్లాలోని దుబ్బాక మండ‌లంలో ఉన్న మ‌రో వార్డులో స‌భ్యురాలిగా పోటీ చేస్తున్న మ‌హిళ ఒక‌రు.. ప్ర‌తి ఇంటికీ కూర‌గాయ‌లు ఉచితంగా పంపిణీ చేస్తాన‌ని హామీ ఇచ్చారు. ఇది పెద్ద‌గా వ‌ర్క‌వుట్ కాలేదు. కానీ, చ‌ర్చ అయితే జ‌రుగుతోంది. మ‌రోవైపు ఏక‌గ్రీవాల వైపు ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారు. పోటీ లేకుండా.. గెలుపు గుర్రం ఎక్కేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు.

ఇక‌, మ‌రికొన్ని చోట్ల వేలం పాట‌లు పెట్టుకుని స‌ర్పంచుల‌ను ఎన్నుకున్నారు. ఇలా.. ఎవ‌రికి వారు.. ప్ర‌య‌త్నాలుముమ్మ‌రం చేస్తున్నారు. అయితే.. పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో హామీలు ఏమేర‌కు వ‌ర్కువుట్ అవుతాయ‌న్న‌ది ప్ర‌శ్న‌. ఎందుకంటే సామాజిక వ‌ర్గాలు, కుల స‌మీక‌ర‌ణ‌లు, పార్టీల మ‌ద్ద‌తు ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపిస్తున్న ద‌రిమిలా.. ఇలాంటి హామీలు వ‌ర్క‌వుట్ అవుతాయా? అనేది చూడాలి.