హై కోర్టుకు సారీ చెప్పిన హైడ్రా, ఏం జరిగింది?

`సారీ మైలార్డ్‌.. ఇక‌పై అలాంటి త‌ప్పులు జ‌ర‌గ‌వు“ – అని తెలంగాణ హైకోర్టుకు హైడ్రా క‌మిష‌న‌ర్‌, ఐపీఎస్ అధికారి రంగ‌నాథ్ క్షమాప‌ణ‌లు తెలిపారు. కోర్టు ఆదేశాల‌ను తూ.చ‌. త‌ప్ప‌కుండా పాటిస్తామ‌ని చెప్పారు. ఎక్క‌డో జ‌రిగిన పొర‌పాటుకార‌ణంగా.. ఇబ్బంది త‌లెత్తింద‌ని, కోర్టులంటే త‌మ‌కు ఎంతో గౌర‌వం ఉంద‌ని పేర్కొన్నారు. దీంతో హైకోర్టు ద్విస‌భ్య ధ‌ర్మాస‌నం.. రంగ‌నాథ్‌పై శాంతించింది.

ఏం జ‌రిగింది?

మూసి ప‌రివాహ‌క ప్రాంతంలో ఉన్న‌ అక్ర‌మ క‌ట్ట‌డాల‌ను, ప్ర‌భుత్వ భూముల క‌బ్జాల‌ను నియంత్రిస్తున్న హైడ్రా ఈ క్ర‌మంలో ప‌లు క‌ట్ట‌డాల‌ను కూల్చేసిన విష‌యంతెలిసిందే. ఇది ఒక్కొక్క‌సారి బాగానే ఉన్నా.. చాలా సార్లు వివాదాల‌కు దారి తీసింది. శ‌నివారం, ఆదివారం వెళ్లి కూల్చేయ‌డం.. కోర్టు సెల‌వులు చూసు కుని పేద‌ల ఇళ్ల‌పై ప‌డ‌డం వంటివి చేస్తున్నారంటూ.. హైకోర్టు అనేక సంద‌ర్భాల్లో వ్యాఖ్యానించింది. దీంతో ప‌ద్ధ‌తి మార్చుకోవాల‌ని హైడ్రాకు స్ప‌ష్టం చేసింది.

ఇదిలావుంటే.. బ‌తుక‌మ్మ కుంట ప్రాంతంలో ఓ ప్రైవేటు భూమిలో అక్ర‌మ క‌ట్ట‌డం క‌ట్టార‌ని పేర్కొన్న హైడ్రా దీనిని కూల్చే ప్ర‌య‌త్నం చేసింది. అయితే.. దీనిపై ఆ భూమి య‌జ‌మాని సుధాక‌ర్ రెడ్డి హైకోర్టును ఆశ్ర‌యించారు. దీంతో స‌ద‌రు క‌ట్ట‌డాన్ని కూల్చ‌రాదంటూ.. కోర్టు ఉత్త‌ర్వులు ఇచ్చింది. కానీ, ఈ ఉత్త‌ర్వుల‌ను ప‌ట్టించుకోకుండా హైడ్రా త‌న ప‌ని తాను చేసేసింది. ఆ వెంట‌నే సుధాక‌ర్ మ‌రోసారి హైకోర్టును ఆశ్ర‌యించారు.

ఈ క్ర‌మంలోనే కోర్టు ధిక్క‌ర‌ణ పిటిష‌న్ దాఖ‌లు చేశారు. దీంతో హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్‌ను కోర్టుకు వచ్చి వివ‌ర‌ణ ఇవ్వాల‌ని హైకోర్టు ఈ ఏడాది జూన్‌లోనే ఆదేశాలు జారీ చేసింది. కానీ, ఆయ‌న హాజ‌రు కాలేదు. తాను కోర్టుకువ‌స్తే.. అనేక ఇబ్బందులు త‌లెత్తుతాయ‌ని.. కోర్టులో కార్య‌క‌లాపాల‌కు భ‌గ్నం ఏర్ప‌డుతుంద‌ని వింత స‌మాధానం చెప్పారు. అప్ప‌ట్లో దీనిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కోర్టు.. ఎట్టిప‌రిస్థితిలోనూ హాజ‌రు కావాల‌ని.. ఆదేశించింది. దీంతో శుక్ర‌వారం కోర్టుకు హాజ‌రైన రంగ‌నాథ్ సారీ చెప్పారు.