సీఎం అభ్య‌ర్థిగా ప‌వ‌న్‌.. బీజేపీ మ‌రో త‌ప్పిద‌మా..?

ఏపీ రాజ‌కీయ ప‌రిణామాలు మారుతున్నాయా ? ముఖ్యంగా బీజేపీ నేత‌లు వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తున్నారా ? తాజాగా మంత్రి పేర్ని నాని చేసిన వ్యాఖ్య‌లతో రాజ‌కీయ నేత‌ల మ‌ధ్య జ‌రుగుతున్న చ‌ర్చ ఈ అంశాల‌పైనే సాగుతోంది. కాషాయ కండువా క‌ప్పుకోని ఓ నేత‌ను ముఖ్య‌మంత్రి పీఠంపై కూర్చోబెట్టేందుకు బీజేపీ త‌హ‌త‌హ‌లాడుతోంద‌ని.. అందుకే త‌మ ప్ర‌భుత్వానికి ఇబ్బందులు సృష్టిస్తున్నార‌ని.. మంత్రి నాని చేసిన వ్యాఖ్య‌లు తీవ్ర చ‌ర్చ‌కు దారితీస్తున్నాయి. ఆయ‌న చేసిన వ్యాఖ్య‌లు.. వైసీపీ వ‌ర్గాల నుంచి తొలిసారి వినిపించిన సంచ‌ల‌న వ్యాఖ్య‌లు గానే ప‌రిగ‌ణించాల్సి వ‌స్తోంది.

ఏపీకి సంబంధించి.. గ‌త ఎన్నిక‌ల త‌ర్వాత‌.. కాషాయ పార్టీకి మ‌ద్ద‌తుగా జ‌న‌సేన వ్య‌వ‌హ‌రిస్తున్న విష‌యం తెలిసిందే. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. బీజేపీ పెద్ద‌ల‌తో చేతులు క‌లిపారు. అయితే.. ఇది ఎన్నిక‌ల పోటీ వ‌ర‌కే ప‌రిమితం అవుతుంద‌ని.. అంద‌రూ అనుకున్నారు. కానీ, తాజాగా నాని చేసిన వ్యాఖ్య‌లు.. ఏకంగా ప‌వ‌న్‌ను సీఎంను చేసేందుకు బీజేపీ వ్యూహాత్మ‌కంగా అడుగులు వేస్తోంద‌నే చ‌ర్చ‌కు దారితీసింది. నిప్పులేందే పొగ రాన‌ట్టుగా.. ఏమాత్రం వైసీపీకి స‌మాచారం లేకుండానే.. మంత్రి నాని ఇలాంటి వ్యాఖ్య‌లు చేస్తార‌ని ఊహించే ప‌రిస్థితి లేదు.

మ‌రి.. దీనిని బ‌ట్టి.. ఏపీలో బీజేపీ అధికారంలోకి వ‌స్తే.. ప‌వ‌న్‌ను ముఖ్య‌మంత్రిని చేస్తామ‌ని.. ఒప్పందం జ‌రిగిందా? అందుకే ప‌వ‌న్‌.. బీజేపీతో చేతులు క‌లిపారా? మ‌రీ ముఖ్యంగా తిరుపతి పార్ల‌మెంటు ఉప పోరులో.. త‌మ‌కు టికెట్ ఇవ్వ‌క‌పోయినా.. ఆయ‌న వ‌చ్చి ప్ర‌చారం చేశారా? అంటే.. ఇప్పుడు ఒకింత సందేహించాల్సిన ప‌రిస్తితి ఏర్ప‌డింది. అయితే.. ప‌వ‌న్ ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టిస్తే.. బీజేపీకి ఒరిగే ప్ర‌యోజ‌నం ఏంటి? ఒక‌వేళ‌.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప‌వ‌న్‌తో పోటీకి వెళ్లి.. ప్ర‌జ‌ల‌కు సీఎం అభ్య‌ర్థి.. ప‌వ‌నేన‌ని చెబితే మాత్రం గెలుపు సాధ్య‌మేనా? అనేది ప్ర‌శ్న‌.

ఎందుకంటే.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో తానే సీఎం అభ్య‌ర్థిన‌ని.. ఒంట‌రిగా బ‌రిలోకి దిగిన (బీఎస్పీ, వామ‌ప‌క్షాల వంటి వాటితో పొత్తు పెట్టుకున్నారు) ప‌వ‌న్ క‌ళ్యాణ్ పార్టీ సాధించింది ఏమిటో అంద‌రికీ తెలిసిందే. రెండు చోట్ల నుంచి పోటీ చేసిన ప‌వన్ ఒక్క‌చోట కూడా విజ‌యం ద‌క్కించుకోలేక పోయారు. అంతేకాదు.. స‌రైన స్థానాల్లో ఓటు బ్యాంకును కూడా పుంజుకునేలా చేసుకోలేక పోయారు. ఈ ప‌రిణామాల నేప‌థ్యంలో బీజేపీ ఇప్పుడు ప‌వ‌న్‌ను సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించినా.. బీజేపీకి వ‌చ్చే ఫ‌లితం ఏమీ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

అదేస‌మ‌యంలో గోవ‌ధ వ్య‌తిరేక నినాదం అందుకున్న బీజేపీతో ప‌వ‌న్ డిస్టెన్స్ మెయింటెన్ చేస్తున్నారు. అదేవిధంగా కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌తో రాసుకుని పూసుకుని తిరుగుతున్నా.. రాష్ట్ర నేత‌ల‌తో ఆయ‌న ట‌చ్‌లోకి రావ‌డం లేదు. అంటే..తాను సొంత‌గా ఎద‌గాల‌నే తాప‌త్ర‌యంతో ఉన్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది. పోనీ.. బీజేపీతో చేతులు క‌లిపినా.. రేపు సీఎం అభ్య‌ర్థిగా ప్ర‌క‌టించినా.. ప‌వ‌న్ ఇమేజ్‌కు ఇబ్బందులు రావ‌డం ఖాయ‌మ‌నేది మేధావుల మాట‌. త‌న బ‌లం లేక‌పోవ‌డంతోనే బీజేపీతో చేతులు క‌లిపార‌నే అప‌వాదు ఆయ‌న‌ను వెంటాడుతుంది. పైగా మైనార్టీ, ఎస్సీ, ఎస్టీ ఓటు బ్యాంకు త‌న‌కు అనుకూలంగా మారుతుంద‌నేది కూడా క‌ష్ట‌మే. ఎలా చూసుకున్నా.. బీజేపీకి , ప‌వ‌న్‌కు కూడా ఈ ప్ర‌తిపాద‌న క‌ష్ట‌మే అంటున్నారు ప‌రిశీల‌కులు.