జగన్ ప్రభుత్వాన్ని బీజేపీ కూల్చేస్తుందా ?

‘వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాలని బీజేపీ చూస్తోంది’…ఇది తాజాగా మంత్రి పేర్నినాని చేసిన ఆరోపణ. మంత్రికి అలా ఎందుకని అనుమానం వచ్చిందో తెలీదు. తాను చేసిన ఆరోపణలకు మంత్రి వివరణ లేదా ఆధారాలను మాత్రం ఇవ్వలేదు. తమ ప్రభుత్వాన్ని కూల్చేసి బాబా రాజ్యం తేవాలని బీజేపీ ప్రయత్నిస్తోందని మాత్రమే చెప్పారు. ఆరోపణల విషయాన్ని పక్కనపెట్టేసినా అందులో నిజమెంత ? అనేది కాస్త ఆలోచించాల్సిందే.

ఎందుకంటే జగన్ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం బీజేపీకి ఏముంది ? జగన్ ప్రభుత్వాన్ని కూల్చేస్తే బీజేపీ ఏమన్నా అధికారంలోకి వచ్చేస్తుందా ? అసెంబ్లీ కమలంపార్టీ తరపున కనీసం ఒక్కరంటే ఒక్క ఎంఎల్ఏ కూడా లేరు. అలాంటిది వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాలని కమలంపార్టీ ఎందుకనుంటుంది. పోనీ చంద్రబాబునాయుడుతో పొత్తుపెట్టుకుని అధికారంలోకి రావచ్చని అనుకున్నా అదికూడా సాధ్యంకాదు. ఎందుకంటే 175 సీట్లున్న అసెంబ్లీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా కనీసం 88 సీట్ల మార్కును దాటాలి.

ఇలా చూసుకుంటే టీడీపీకి ఉన్నది 23 మంది ఎంఎల్ఏలు మాత్రమే. 23 మంది ఎంఎల్ఏలతో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు. పోనీ రాష్ట్రప్రభుత్వాన్ని కూల్చేసి రాష్ట్రపతి పాలన పెట్టేందుకూ అవకాశాలు లేవు. అంటే ఎలా చూసుకున్నా వైసీపీ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం కానీ, కూల్చితే వచ్చే ఉపయోగం కానీ బీజేపీ లేదు. వచ్చే ఎన్నికల నాటికి చంద్రబాబుతో పొత్తపెట్టుకుంటే ఏమి జరుగుతుందో ఇపుడే ఎవరు చెప్పలేరు.

ఇదే సమయంలో బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని చంద్రబాబు తహతహలాడుతున్న విషయమైతే వాస్తవమే. నిజానికి టీడీపీయే క్షేత్రస్ధాయిలో బాగా దెబ్బతినేసింది. చరిత్రలోనే ఎప్పుడూ లేనంతగా పార్టీ నిర్మాణం కుప్పకూలిపోయింది. దీన్ని బలోపేతం చేయటానికి చంద్రబాబు చేస్తున్న ప్రయత్నాలు కూడా పెద్దగా లేవనే చెప్పాలి. ఎంతసేపు మీడియా ముందు కూర్చుని జగన్ పై ఆరోపణలు, విమర్శలు చేయటం తప్ప చంద్రబాబు అండ్ కో చేస్తున్నదేమీలేదు.

కాబట్టి తమ ప్రభుత్వాన్ని కూల్చటానికి బీజేపీ ప్రయత్నిస్తోందనేందుకు ఆధారాలు కానీ కారణాలు కానీ కనబడటంలేదు. అయితే మంత్రి ఆరోపణలు చేయటమంటే మామూలు విషయంకాదు. ఆరోపణలు మాత్రమే చేసిన మంత్రి దానికి ఆధారాలను కానీ కారణాలను కానీ చెప్పలేదు. ఎలాంటి ఆధారాలు లేకుండా మీడియా సమావేశంలో మంత్రి అంతటి ఆరోపణలు చేస్తారా ? అన్న అనుమానాలు పెరిగిపోతున్నాయి. మరి ఏమి జరుగుతుందో చూడాల్సిందే.