తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత, తెలగాణ సీఎం కేసీఆర్ ఎంచుకునే అంశాలు, వాటిని ముందుకు తీసుకువెళ్లే విధానాలు ఎంతో ప్రత్యేకంగా ఉంటాయన్న సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలంగాణ రాష్ట్రం పోరాటం నుంచి ఇప్పుడు రాష్ట్రంలో అమలు చేస్తున్న పలు పథకాల వరకు ఈ విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పుడు తాజాగా అదే తరహా నిర్ణయం తీసుకున్నారని చెప్తున్నారు. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ ముద్రించాలన్న నినాదాన్ని ప్రస్తుతం టీఆర్ఎస్ పార్టీ ప్రవచిస్తోంది.
కరెన్సీ నోటుపై భారత రాజ్యాంగ నిర్మాత డా. బీ.ఆర్. అంబేద్కర్ ఫొటోను ముద్రించాలని కేసీఆర్ నమ్మినబంటు, తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కరెన్సీపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ కమిటీ ప్రతినిధులు మంత్రుల నివాసంలో వినోద్ కుమార్‌తో సమావేశమయ్యారు. తమ డిమాండ్‌కు మద్దతు ఇవ్వాలని వినోద్ కుమార్ ను కమిటీ ప్రతినిధులు కోరారు. కమిటీ చేపట్టిన ఆగస్టు 3,4,5 తేదీలలో ‘చలో ఢిల్లీ’ వాల్ పోస్టర్‌ను బోయినపల్లి వినోద్ కుమార్ ఈ సందర్భంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా వినోద్ కుమార్ మాట్లాడుతూ.. కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫొటోను ముద్రించాలన్న కమిటీ ప్రతినిధుల డిమాండ్ న్యాయ సమ్మతమైనదేనని అన్నారు. కరెన్సీ నోటుపై అంబేద్కర్ బొమ్మ ముద్రించడం అంశాన్ని పార్లమెంటు వేదికగా లేవనెత్తాలని టీఆర్ఎస్ ఎంపీలకు వినోద్ కుమార్ సూచించారు.
దేశంలో రిజర్వ్ బ్యాంకు ఏర్పాటు స్ఫూర్తి ప్రదాత అంబేద్కర్ అని, అలాంటి మహానీయున్ని గౌరవించుకోవడం కనీస బాధ్యత అని వినోద్ కుమార్ అన్నారు. కాగా, హుజురాబాద్ ఉప ఎన్నికలో దళితుల ఓట్లు పెద్ద ఎత్తున ఉన్నందున వారి ఓట్లను కైవసం చేసుకునేందుకు ఇప్పటికే దళిత బంధు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కరెన్సీ నోట్లపై అంబేద్కర్ బొమ్మ ముద్రించడం అనేది సైతం ఇందులో భాగమేనని చెప్తున్నారు.