వైసీపీలో నేతల మధ్య చర్చలు వేడెక్కాయి. ఇప్పుడు ఎలా ముందుకు సాగుదాం.. ప్రజలను ఎలా నమ్మిద్దాం! అంటూ.. నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఇంతకీ ఏవిషయం అంటే.. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ అంశమే! ఈ విషయంలో “మేం ఆపుతున్నాం.. కేంద్రాన్ని వేలు పెట్టనివ్వం. మా ముఖ్యమంత్రి ఇప్పటికే లేఖలు సంధించారు. ప్రతిపక్షాలు అనవరంగా రాజకీయం.. రాద్ధాంతం చేస్తున్నాయి. మాకు మాత్రం విశాఖ ఉక్కుపై ప్రేమ లేదా? రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత ప్రజలు మాకు కదా ఇచ్చారు!” అంటూ.. ఇప్పటి వరకు కబుర్లు చెప్పిన వైసీపీనాయకులకు కేంద్రం ఎప్పటికప్పుడు షాకిస్తోంది.
ఇప్పటికే తాజాగా జరుగుతున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో కూడా.. విశాఖ ఉక్కును నూటికి నూరు శాతం అమ్మేసే తీరుతామని.. కేంద్రం స్పష్టం చేసింది. ఇదే విషయాన్ని రాష్ట్ర హైకోర్టుకు కూడా కుండ బద్దలు కొట్టి చెప్పింది. అంటే.. సీఎం జగన్ ఇప్పటి వరకు రాసిన లేఖలు.. వైసీపీ ఎంపీ.. ఉత్తరాంధ్ర జిల్లాల వైసీపీ ఇంచార్జ్.. సాయిరెడ్డి చేసిన పాదయాత్రలు.. పార్లమెంటులో చేసిన ప్రసంగాలు అన్నీ.. కొట్టుకుపోయాయి. కేంద్రం ఎట్టి పరిస్థితిలోనూ ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పేసింది. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇదీ.. వైసీపీని కుదిపేస్తున్న ప్రధాన ప్రశ్న.
మరోవైపు ప్రతిపక్షం టీడీపీ ఎంపీలు.. రాజీనామా చేసి.. కేంద్రానికి బుద్ధి చెప్పయినా.. విశాఖ ఉక్కును నిలుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. “మేం రాజీనామాలు చేస్తాం.. మీరు కూడా చేయండి.. మీ నాయకత్వంలోనే మా ఎంపీలు కూడా పనిచేస్తారు. విశాఖ ఉక్కును కాపాడుకుందాం. రండి!” అంటూ.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే పిలుపునిచ్చారు. అయితే.. వైసీపీ ఇప్పటి వరకు దీనిపై ఎలాంటి కామెంట్ చేయలేదు. పైగా.. గతంలో ప్రత్యేక హోదా కోసం.. రాష్ట్ర ప్రయోజనాల కోసం.. రాజీనామాలకు సిద్ధమని ప్రకటించిన.. జగన్.. ఇప్పుడు అదే అస్త్రం టీడీపీనుంచి వినిపించే సరికి.. తేలుకుట్టినట్టు వ్యవహరిస్తున్నారనే వ్యాఖ్యలు వస్తున్నాయి.
కానీ, విశాఖలో పరిస్థితి చూస్తే..నానాటికీ తీవ్రమవుతోంది. ఇప్పటికే చాలా మంది నాయకులు ఉద్యమ బాట పట్టక తప్పని పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా ఉద్యోగుల సెంటిమెంటుకు నేతలు ఫిదా అవుతున్నారు. ఈ సమయంలో వైసీపీ కూడా గొంతు కలపకపోతే.. పార్టీ పరిస్థితి మరింత దారుణంగా మారుతుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇదే విషయంపై వైసీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల మధ్య చర్చ సాగుతోంది. జగన్ అప్పాయింట్‌మెంట్ కోసం.. ఇక్కడి ఎమ్మెల్యేలు.. ఎదురు చూస్తున్నారని తెలుస్తోంది. మరి ఏం చేస్తారు? తమ తప్పులేదని.. తప్పించుకుంటారా? లేక అసెంబ్లీలోనూ చేసిన విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ వ్యతిరేకత తీర్మానానికి కట్టుబడి కేంద్రాన్ని నిలదీస్తారా? చూడాలి.