రోజాపై వ్య‌తిరేక‌త ఆ వార‌సుడు క్యాష్ చేసుకుంటాడా ?

చిత్తూరు జిల్లా రాజ‌కీయాల్లో దివంగ‌త గాలి ముద్దుకృష్ణ‌మ నాయుడి గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. ఉపాధ్యాయుడిగా ఉన్న ఆయ‌న ఎన్టీఆర్ పిలుపుతో రాజ‌కీయాల్లోకి వ‌చ్చి సుధీర్ఘ‌కాలంగా రాజ‌కీయాలు చేశారు. ఆయ‌న రాజ‌కీయాల్లోకి వ‌చ్చి రావ‌డంతోనే ర‌ద్ద‌యిన పుత్తూరు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.

ఆ నియోజ‌క‌వ‌ర్గం నుంచి వ‌రుస‌గా నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గాలి ఆయ‌న 1995 సంక్షోభం త‌ర్వాత ఎన్టీఆర్ ప‌క్షాన నిలిచారు. ఎన్టీఆర్ మ‌ర‌ణం త‌ర్వాత గాలి కాంగ్రెస్‌లో చేరి పుత్తూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఆయ‌న 2004లో మ‌ళ్లీ అదే నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు.

2009లో పుత్తూరు ర‌ద్ద‌య్యి న‌గ‌రిలో క‌లిసి పోవ‌డంతో వైఎస్ ఆయ‌న‌కు సీటు ఇచ్చేందుకు ఒప్పుకోలేదు. దీంతో ఆయ‌న టీడీపీలో చేరి ఆ పార్టీ నుంచి విజ‌యం సాధించారు. అయితే దుర‌దృష్ట వ‌శాత్తు పార్టీ గెలిచిన 2014 ఎన్నిక‌ల్లో గాలి న‌గ‌రిలో రోజాపై స్వ‌ల్ప తేడాతో ఓడిపోయారు.

అయినా చంద్ర‌బాబు ఆయ‌న‌కు ఎమ్మెల్సీ ఇచ్చి గౌర‌వించారు. ఎమ్మెల్సీగా ఉండ‌గానే గాలి మృతి చెంద‌డంతో చివ‌ర‌కు ఆ సీటు కోసం గాలి వార‌సుల మ‌ధ్య వార్ న‌డ‌వ‌డం.. చంద్ర‌బాబు మ‌ధ్యేమార్గంగా గాలి భార్య స‌ర‌స్వ‌త‌మ్మ‌కు ఆ ఎమ్మెల్సీ ప‌ద‌వి ఇవ్వ‌డం జ‌రిగిపోయాయి.

చివ‌ర‌కు గ‌త ఎన్నిక‌ల్లో గాలి భానుప్ర‌కాష్ నాయుడికే చంద్ర‌బాబు న‌గ‌రి సీటు ఇచ్చారు. అయితే దుర‌దృష్ట‌వ‌శాత్తు మ‌ళ్లీ నాన్న‌లా రోజా చేతిలో స్వ‌ల్ప తేడాతోనే భానుప్ర‌కాష్ ఓడిపోయారు. ఎన్నిక‌ల్లో ఓడిన యేడాది పాటు ఆయ‌న న‌గరిలో పార్టీని ప‌ట్టించుకోలేదు. వ‌రుస‌గా నాన్న‌, త‌ర్వాత తాను రోజా చేతిలో ఓడిపోవ‌డం ఆయ‌న్ను కాస్త కుంగ‌దీసింది. అయితే వివాదాల‌కు దూరంగా ఉండే భానుకు నియోజ‌క‌వ‌ర్గంలో అభిమాన‌గ‌ణం మాత్రం బాగానే ఉంది.

అయితే ఇప్ప‌టి వ‌ర‌కు చాలా స్త‌బ్దుగా ఉన్న న‌గ‌రి రాజ‌కీయం ఇప్పుడు భానుకు అనుకూలంగా మారుతోంది. రోజాపై నియోజ‌క‌వ‌ర్గంలో పెల్లుబికుతోన్న వ్య‌తిరేక‌త‌కు తోడు… అటు ఆమె సొంత పార్టీలోనే కీల‌క నేత‌ల‌కు టార్గెట్ అవుతుండ‌డం.. దీంతో పాటు స్థానిక వైసీపీ కేడ‌ర్ నుంచి భానుకు కూడా స‌పోర్ట్ వ‌స్తుండ‌డం ప్ల‌స్ కానుంది.

రోజా దూకుడుకు చెక్ పెట్టేందుకు జిల్లాకు చెందిన ఇద్ద‌రు మంత్రుల‌తో పాటు ఇద్ద‌రు ఎంపీలు విశ్వ ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇక న‌గ‌రిలోనూ రోజాకు వ్య‌తిరేకంగా బ‌ల‌మైన వ‌ర్గం త‌యారైంది. గ‌త రెండు ఎన్నిక‌ల్లోనూ వీరంతా రోజాకు మ‌ద్ద‌తుగా ప‌నిచేసి మరీ ఆమెను గెలిపించారు. రోజా రెండు సార్లు గెలిచినా న‌గ‌రి నియోజ‌క‌వ‌ర్గ అభివృద్ధిలో త‌న‌దైన ముద్ర కూడా వేయ‌లేక‌క‌పోయారు. మ‌రోవైపు ఆమె నిన్న‌టి వ‌ర‌కు రెండు ప‌ద‌వుల్లో ఉన్నా చేసిందేమి లేద‌న్న విమ‌ర్శ‌లు వ‌చ్చేశాయి. ఇక వ‌రుసగా రెండుసార్లు గెలవ‌డంతో పాటు ఆమె స్థానికంగా కంటే ఎక్కువుగా హైద‌రాబాద్‌, చెన్నైలోనే ఉండ‌డం కూడా నియోజ‌క‌వ‌ర్గంలో ఆమెపై వ్య‌తిరేక‌త పెర‌గడానికి కార‌ణ‌మైంది.

అయితే ఇవ‌న్నీ గాలి వార‌సుడు భానుప్ర‌కాష్ సులువుగా క్యాష్ చేసుకుని దూసుకుపోవ‌చ్చు. అయితే తండ్రిలో ఉన్న దూకుడు ఆయ‌న‌లో లేద‌న్న టాక్ ఉంది. గాలి ప‌ద‌విలో ఉన్నా లేక‌పోయినా ఎప్పుడు పార్టీ కేడ‌ర్‌కు, నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉండేవారు. నియోజ‌క‌వ‌ర్గాన్ని వారానికి ఒక‌సారి అయినా చుట్టి వ‌చ్చేవారు. భాను క‌నుక కాస్త తండ్రి బాట‌లో న‌డుస్తూ నియోజ‌క‌వ‌ర్గ ప్ర‌జ‌ల‌కు అందుబాటులో ఉంటే ఈ సారి రోజాకు ఖ‌చ్చితంగా చెక్ పెట్ట‌వ‌చ్చ‌నే అంటున్నారు. మ‌రి భానుప్ర‌కాష్ దూకుడు పెంచుతారో ? లేదో ? చూడాలి.