నల్గొండ జిల్లాలోని మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి పార్టీలో చిచ్చు సంచలనంగా మారింది. నిరుద్యోగి పాక శ్రీకాంత్ ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వం ఉద్యోగాలు భర్తీ చేయాలనే డిమాండ్ తో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో దీక్షలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇపుడు పాక ఆత్మహత్యకు నిరసనగా నల్గొండలో షర్మిల దీక్ష చేశారు. ఈ దీక్షలో ఉన్న షర్మిలకు కోమటిరెడ్డి ఫోన్ చేసి సంఘీభావం తెలిపారు. ఈ విషయమే ఇపుడు పార్టీలో సంచలనంగా మారింది.
వైఎస్పార్టీపీ అద్యక్షురాలు షర్మిలంటే కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మండిపడుతున్న విషయం అందరికీ తెలిసిందే. ఒకవైపు రేవంత్ వ్యతిరేకిస్తున్న పార్టీని కార్యక్రమాన్ని అదే పార్టీకి చెందిన ఎంఎల్ఏ కోమటిరెడ్డి మద్దతు పలకటమే ఆశ్చర్యంగా ఉంది. మొదటినుండి రేవంత్ ను కోమటిరెడ్డి బ్రదర్స్ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే షర్మిల దీక్షకు ఎంఎల్ఏ మద్దతు పలకటం పార్టీలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది.
రాబోయే ఎన్నికల్లో షర్మిల పార్టీలోకి కాంగ్రెస్ లో నుండి అనేకమంది నేతలు వలసలు వెళ్ళిపోతారనే ప్రచారం అందరికీ తెలిసిందే. వైఎస్సార్టీపీ ఆవిర్భావ సమావేశానికి ఎంపి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు. ఈ విషయం తెలిసినపుడు కూడా పార్టీలో పెద్దఎత్తున చర్చలు జరిగాయి. షర్మిల పార్టీకి కోమటిరెడ్డి సోదరులిద్దరు మద్దతుగా నిలబడ్డారని ఇప్పటికే ప్రచారం జరుగుతోంది. దీనికి సోదరుల చర్యలు మరింత ఆజ్యం పోస్తున్నట్లుగా తయారైంది.
కాంగ్రెస్ పార్టీలో నుండి నేతలను షర్మిల పార్టీవైపు వెళ్ళకుండా రేవంత్ చర్యలు తీసుకుంటున్నట్లు పార్టీ నేతలే చెబుతున్నారు. రెడ్డీ సామాజికవర్గంలో తొందరలోనే చీలిక వచ్చే అవకాశం ఉందనే ప్రచారం కూడా జరుగుతోంది. షర్మిల పార్టీకి ఉన్న బలమెంత ? అసలు తెలంగాణా జనాలు షర్మిలను ఆదరిస్తారా ? అనే విషయమై ఎవరిలోను క్లారిటి లేదు.
అయినా జనాల్లో గుర్తింపు తెచ్చుకునేందుకు షర్మిల తనవస్తులు తాను పడుతున్నారు. ఇలాంటి సమయంలోనే కాంగ్రెస్ లోని సీనియర్లు గనుక మద్దతుగా నిలబడితే షర్మిల పార్టీకి కాస్త జనబలం వచ్చే అవకాశాన్ని కొట్టిపారేసేందకు లేదు. మరి భవిష్యత్తులో కోమటిరెడ్డి సోదరులతో పాటు మరికొందరు సీనియర్ల వైఖరి బయటపడే అవకాశం ఉంది. చూద్దాం ఏమి జరుగుతుందో.