పెగాసస్.. గడిచిన వారం రోజులుగా దేశ పార్లమెంటును కుదిపేస్తున్న కీలక అంశం. దేశంలోని అనేక మంది కీలక నాయకులు, ఉద్యమకారులు, పాత్రికేయులు, ఆఖరుకు సొంత మంత్రి వర్గంలోని మంత్రుల ఫోన్లు హ్యాక్ అయ్యాయనే అంశంపై తీవ్ర దుమారం రేగుతోంది. దీనిపై విచారణకు ప్రతిపక్షాలు పట్టుబడుతున్నారు. సభా కార్యక్రమాలకు అడుగడుగునా అడ్డు పడుతున్నాయి. అయితే.. ఇదంతా ఉత్తిదేనని.. పెగాసస్.. ఓ బోగస్ అని.. దానికి అనుమతులు లేవని.. ప్రభుత్వం పాత పాటే పాడుతోంది.
అయితే.. ఈ పెగాసస్ విషయానికి సంబంధించి కీలకమైన ఒక విషయం వెలుగు చూడడంతో కేంద్రంలో ని మోడీ సర్కారుపై అనేక అనుమానాలు పెరుగుతున్నాయి. ఎందుకంటే.. దాచినా దాగని ఓ విషయం బయటకు పొక్కడమే కారణం! సరే.. దీనికి సంబంధించి కొంచెం లోతుగా ముందుకు సాగితే.. జాతీయ భద్రతా మండలి(ఎన్ ఎస్ సీ) గురించి ముందు తెలుసుకోవాలి. దీనిని దివంగత వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నపుడు ఏర్పాటు చేశారు. జాతీయ భద్రత అంటే.. దేశ భద్రతకు సంబంధించిన సూచనలు, సలహాలు ఇవ్వడం దీని పని.
దీనికి సంబంధించి కొద్దిపాటి మంది సీనియర్లతో వింగ్‌ను ఏర్పాటు చేశారు. అదే సమయంలో ఈఎన్ ఎస్ సీకి ఒక సలహాదారు కూడా ఉంటారు. ఈ క్రమంలో ఎన్ ఎస్ సీకి నిధులు కేటాయింపు జరుగుతోంది. ఉద్యోగుల జీత భత్యాలు, ప్రయాణ ఖర్చులు ఇతరత్రా కలిపి.. బడ్జెట్ కేటాయించేవారు. ఈ క్రమంలో… 2011-12లో రూ.17.43 కోట్లు, 2012-13లో రూ.20.33 కోట్లు, 2013-14లో రూ.26.06 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఇక, మోడీ నేతృత్వంలో బీజేపీ.. కూటమి ఎన్డీఏ అధికారంలోకి వచ్చిన తర్వాత.. తొలి మూడేళ్లపాటు.. ఇలానే కేవలం రెండంకెల్లోనే కేటాయింపులు చేశారు.
2014-15లో రూ.44.46 కోట్లు కేటాయించారు. ఖర్చు పెట్టింది మాత్రం రూ. 25 కోట్లు. 2016-17లో రూ.33 కోట్లు కేటాయించారు. అంటే.. 2017 వరకు ఎన్ ఎస్సీ పని ఏంటో ఈ నిధుల కేటాయింపులను బట్టి అర్ధం చేసుకోవచ్చు. అయితే.. అనూహ్యంగా 2017-18 నుంచి వ్యూహం మారిపోయింది. ఆ ఏడాది వార్షిక బడ్జెట్లో ఎన్ ఎస్ సీ కోసం.. ఏకంగా 333 కోట్లు కేటాయించారు. నిజానికి అప్పట్లో ఈ విషయం సైలెంట్‌గా ఉన్నప్పటికీ.. తర్వాత తర్వాత.. అనుమానాలు పెరిగాయి. ఈ నిధులు కూడా అజిత్ ధోవల్ సూచనల మేరకు కేంద్రం కేటాయించిందని.. అప్పట్లో వార్తలు వచ్చాయి.
మరి ఆకస్మికంగా పెంచేసిన ఆ మూడు వందల కోట్ల నిధులను ఏం చేశారు? అనేది కీలక ప్రశ్న. దీనికి అందరి వేళ్లూ.. పెగాసస్‌వైపే చూపిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెగాసస్‌తో చేసుకున్న రహస్య డీల్ విలువ 300 కోట్లని.. కొందరు జర్నిలిస్టులు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని నర్మగర్భంగా ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా చెప్పుకొచ్చారు. అప్పటికప్పుడు 300 కోట్టు కేటాయించాల్సిన అవసరం ఏముంది? పైగా ఈ నిధుల కేటాయింపు తర్వాతే.. అంటే.. 2018-19లోనే ఫోన్లు హ్యాక్ అవుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తాయి.
అంటే.. పెగాసస్ కోసం కేంద్రమే ప్రజల సొమ్మును ఖర్చు చేసిందా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయని అంటున్నారు జర్నలిస్టులు. పెగాసస్‌పై ఆది నుంచి ఒకే మాట చెబుతున్న కేంద్రం.. పెగసస్ సాఫ్ట్‌వేర్‌ను కొనుగోలు చేసిందా? లేదా? దీనికి సంబంధించి రూ.300 కోట్లు బడ్జెట్ కేటాయించిందా? అనే ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంది. మాటలు దాటేసినా.. బడ్జెట్ కేటాయింపులు , ఖర్చులు.. మోడీ ప్రభుత్వాన్ని బోనెక్కించకతప్పదని అంటున్నారు పాత్రికేయులు.