వాళ్లిద్దరూ వియ్యంకులు. టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అడ్రస్ లేరు. అసలు టీడీపీలో వాళ్ల గురించి ఎవ్వరికి తెలియదు. అయితే 2014లో టిడిపి అధికారంలోకి వచ్చాక ఓ రేంజ్లో చక్రం తిప్పారు. పైగా ఇద్దరు మంత్రులుగా మామూలు హవా చెలాయించలేదు. ఇక గత ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయింది. ప్రతిపక్షంలో ఉన్న పార్టీలో ఎందుకు యాక్టివ్‌గా ఉండడం… టైం వేస్ట్ అనుకున్నారో ఏమోగాని.. అసలు బయటకు రావడం లేదు.. ఆ ఇద్దరు టీడీపీ వియ్యంకులు ఎవరో కాదు మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు.. పొంగూరు నారాయణ. చంద్రబాబు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వీళ్లు ఏ మాత్రం కష్టపడలేదు. పైగా అప్పుడు గంటా కాంగ్రెస్‌లో మంత్రిగా ఉన్నారు. 2014 ఎన్నికల్లో గంటా టీడీపీలోకి వచ్చారు. ఆ వెంటనే పార్టీ గెలవడంతో మంత్రి అయ్యారు. ఐదేళ్లు ఆయన ఓ వెలుగు వెలిగారు.
ఇక గత ఎన్నికల్లో నెల్లూరు నుంచి పోటీ చేసిన నారాయణ ఓడిపోయారు. గంటా విశాఖ నార్త్‌లో స్వల్ప తేడాతో గెలిచారు. నారాయణ అసలు ఓడిపోయాక అడ్రస్ లేకుండా పోయారు. దీంతో నెల్లూరు సిటీకి కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డిని ఇన్చార్జ్గా బాబు నియమించేశారు. నారాయణ పార్టీని పట్టించుకుంటారు ? అన్న నమ్మకం కూడా ఎవ్వరికి లేదు. ఇక నార్త్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా ఎప్పుడు గోడదూకేద్దామా ? అన్నట్టుగానే వ్యవహరిస్తున్నారు. అసలు ఆయన నార్త్ నియోజకవర్గంలో పార్టీని పట్టించుకోవడం లేదు. అందుకే ఇటీవల జీవీఎంసీ ఎన్నికల్లో కూడా పార్టీ నార్త్ నియోజకవర్గంలో చిత్తుగా ఓడింది.
ఇక వీరిద్దరు వ్యాపారులు కూడా కావడంతో అధికార పక్షంపై కిమ్మనడం లేదు. నోరు ఎత్తి చిన్న విమర్శ కూడా చేయడం లేదు. పార్టీ ఓడితే మాకెందుకు.. మా వ్యాపారాలు మావి అన్న చందంగా వీరి వ్యవహార శైలీ ఉంది. రాజధాని వ్యవహారాల్లో అన్నీ తానై వ్యవహరించిన నారాయణను ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం గట్టిగా టార్గెట్ చేస్తోంది. అందుకే ఆయన సైలెంట్ అయిపోయారు. ఇటీవల ఆయన కుమార్తె సైతం సీఎం సతీమణి భారతిని కలిసిందని టాక్ ?
ఇక గంటా ముందు నుంచి అధికారం ఎక్కడ ఉంటే అక్కడ వాలిపోతుంటారు. ఇప్పుడు కూడా ఆయనకు సరైన ఛాన్స్ రావడం లేదు కాని.. వైసీపీ నుంచి మంచి ఆఫర్ ఉంటే చక్కేసినా పెద్ద ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు. ఇక ఇప్పుడు ఈ వియ్యంకులు ఇద్దరిని కూడా చంద్రబాబు నమ్మే పరిస్తితుల్లో లేరనే టీడీపీ వర్గాలు చెపుతున్నాయి. ఒక వేళ గంటా కూడా ఎన్నికలకు ముందు అటూ ఇటూ చూసి జంప్ అయితే అక్కడ కూడా మరో బలమైన నేతను మనం రెడీ చేసుకోవాలని పార్టీ నేతలతో అన్నట్టు తెలుస్తోంది.