కీలక పరిణామం చోటు చేసుకుంది. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణంరాజు ఎపిసోడ్ ఎండింగ్ స్టేజ్ కు వచ్చేసినట్లేనా? అన్న భావన కలిగేలా తాజా పరిణామాలు ఉండటం గమనార్హం. ప్రజాప్రతినిధులు ఎవరైనా సరే.. తాము గెలిచిన పార్టీ పట్ల విధేయతతో ఉండటం.. పార్టీ లైన్ కు తగినట్లుగా వ్యవహరించటం చాలా కీలకం. అందుకు భిన్నంగా తనకు తోచినట్లు మాట్లాడటం.. పార్టీ ఇమేజ్ డ్యామేజ్ చేయటం.. పార్టీ అధినేతపై అదే పనిగా విరుచుకుపడటం ఎవరూ హర్షించరు. తనను గెలిపించిన పార్టీ విషయంలోనూ.. పార్టీ అధినేత విషయంలోనూ గుర్రుగా ఉండి.. నోటికి పని చెప్పటం ద్వారా గడిచిన కొంతకాలంగా వార్తల్లో ప్రముఖంగా కనిపిస్తున్నారు.. వినిపిస్తున్నారు.
అంతకంతకూ పెరిగి పెద్దదైన ఆయన ధిక్కార స్వరం ఆయన్నుజైలుపాలు చేసే వరకు వెళ్లిందని చెప్పాలి. దాదాపుగా రెండేళ్లుగా సాగుతున్న ఆయన యుద్ధం ముగింపు దశకు వచ్చినట్లుగా చెప్పాలి. దేశంలో మరే పార్టీకి చెందిన ప్రజాప్రతినిది కూడా తమ అధినేత మీద ఆగ్రహం వ్యక్తం చేయటం.. విమర్శలు చేయటం జరిగిందేమో కానీ.. న్యాయస్థానం ఇచ్చిన బెయిల్ ను రద్దు చేయాలన్న వాదనను తెర మీదకు తీసుకురావటమే కాదు.. కోర్టును ఆశ్రయించి పోరాటం చేసే సిత్రమైన కేసు రఘురామకు మాత్రమే చెల్లుతుందని చెప్పాలి.
రఘురామ చేష్టలతో విసిగిపోయిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.. ఇప్పటికే ఆయనపై అనర్హత వేటు వేయాలంటూ లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు పలుమార్లు విన్నపాలు చేశారు. అందుకు తగ్గ పత్రాల్ని అందజేశారు. అయినప్పటికీ ఆయనపై చర్యలు స్టార్ట్ కాలేదు. దీంతో.. లోక్ సభ స్పీకర్ తీరుపైనా విమర్శలు చెలరేగుతున్నాయి. ఇదిలా ఉంటే.. గతానికి భిన్నంగా తాజాగా ఈ రెబల్ ఎంపీకి లోక్ సభ స్పీకర్ నోటీసులు జారీ చేయటం ఆసక్తికరంగా మారింది.
ఫిరాయింపుల చట్టం కింద వైసీపీ చేసిన కంప్లైంట్ మీద వివరణ ఇవ్వాలని ఎంపీకి షోకాజ్ నోటీసు జారీ చేయటమే కాదు.. సమాధానం ఇవ్వటానికి 15 రోజుల సమయాన్ని ఇచ్చారు. తాము ఇచ్చిన సమయం లోపు సమాదానం ఇవ్వా్లసి ఉంటుందని లోక్ సభ సెక్రటేరియట్ పేర్కొంది. ఫిరాయింపు వ్యవహారంలో ఇరు పక్షాల వాదనను తాము వింటామని.. ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటామని లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వ్యాఖ్యానించిన.. రెండు మూడు రోజులకే షోకాజ్ నోటీసులు జారీ కావటం ఆసక్తికరంగా మారింది.
అయితే.. రఘురామ ఒక్కరికే ఇలాంటి షోకాజ్ నోటీసులు అందజేయలేదు. అనర్హత ఆరోపణలు ఎదుర్కొంటున్న మమత పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలకు సైతం నోటీసులు జారీ చేయటంతో.. తుది నిర్ణయం ఎలా ఉంటుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారింది. టీఎంసీకి చెందిన ఎంపీలపై చర్యలకు స్పీకర్ ఎలా రియాక్టు అవుతారు? అన్నది అసలు ప్రశ్న. ఒకవేళ.. టీఎంసీ ఎంపీలకు ఒకలా.. రఘురామ విషయంలో మరోలా ఆదేశాలు ఇచ్చే అవకాశం లేదంటున్నారు. ఇదిలా ఉంటే.. ఈ నెల 26న సీఎం జగన్ బెయిల్ రద్దు పిటిషన్ పై కోర్టు తుది ఉత్తర్వులు ఇచ్చే వీలుందన్న మాట వినిపిస్తోంది. అంటే.. రఘురామ సమాధానం ఇవ్వటానికి కాస్త ముందే.. జగన్ బెయిల్ రద్దు ఉదంతంపై ఎలాంటి నిర్ణయాన్ని కోర్టు వెల్లడిస్తుందన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొత్తానికి ఈ నెలాఖరు లోపు ఏపీ రాజకీయాల్ని ప్రభావితం చేసే రెండు అంశాలకు సంబంధించిన తుది నిర్ణయాలు వెలువడే అవకాశం ఉందని చెప్పక తప్పదు.