గత కొద్దికాలంగా జరుగుతున్న చర్చను నిజం చేస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన మంత్రివర్గ విస్తరణ చేప్టటారు. ఇందులో తెలంగాణకు భారీ తీపికబురు దక్కింది. ప్రస్తుతం సహాయ మంత్రిగా ఉన్న బీజేపీ సీనియర్ నేత కిషన్ రెడ్డికి క్యాబినెట్ హోదాతో మంత్రి పదవి కట్టబెట్టారు. ఇప్పటివరకు ఆయనకు మంత్రిత్వ శాఖ ఖరారు కానప్పటికీ రెండు ప్రధాన శాఖల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఈ మంత్రి పదవి ద్వారా ఓ ప్రత్యేక రికార్డు సాధించిన తెలుగు నేతగా కిషన్ రెడ్డి రికార్డు సృష్టించారు.
ప్రధాని మోడీ తన కేబినెట్లో భారీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టి దాదాపు 15 మంది మంత్రులకు కేబినెట్ నుంచి ఉద్వాసన పలికారు. వీరిలో రవిశంకర్‌ప్రసాద్, సదానందగౌడ, ప్రకాశ్ జవదేకర్, హర్షవర్థన్, రమేశ్ పోఖ్రియాల్, థావర్‌చంద్ గెహ్లాట్ వంటి ముఖ్య నేతలు సైతం ఉన్నారు. ఈ ముఖ్య నేతలతో పాటుగా పలువురు మంత్రులు కూడా రాజీనామా చేశారు. అయితే, ఇలాంటి పరిస్థితుల్లో కిషన్ రెడ్డికి మాత్రం ప్రమోషన్ దక్కింది. సహాయ మంత్రి నుంచి కేబినెట్ మంత్రి పదవి పొందడం ఆయన పనితీరుకు దక్కిన గుర్తింపుగా పలువురు పేర్కొంటున్నారు. ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాల నుంచి ఈ చాన్స్ పొందిన బీజేపీ నేత కిషన్ రెడ్డి ఒకరే.
గతంలో కేంద్ర సహాయ మంత్రి హోదా దక్కించుకున్న, అనంతరం గవర్నర్లుగా చాన్స్ వచ్చిన వారున్నారు కానీ సహాయ మంత్రి నుంచి కేంద్ర కేబినెట్ మంత్రి పదవి పొందింది కిషన్ రెడ్డి మాత్రమేనని విశ్లేషకులు పేర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాలపై ప్రత్యేక ఫోకస్ పెట్టిన బీజేపీ పెద్దలు తమ లక్ష్యాన్ని సాధించే సమర్థుడు కిషన్ రెడ్డి మాత్రమని భావించి కిషన్ రెడ్డికి ఈ చాన్స్ ఇచ్చారని అంటున్నారు.