గంటాతో సాయిరెడ్డి పొలిటిక‌ల్ గేమ్ ఆడారా..?

తెగ‌దు.. సాగ‌దు..అన్న విధంగా ఉన్న మాజీ మంత్రి గంటా శ్రీనివాస‌రావు రాజ‌కీయం.. మ‌రోసారి చ‌ర్చ‌కు వ‌చ్చింది. దీనికి కార‌ణం.. ఆయ‌న ఫుల్లుగా సైలెంట్ అయిపోవ‌డ‌మే. ఇటీవ‌ల విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదం నేప‌థ్యంలో ఎమ్మెల్యే ప‌ద‌వికి రిజైన్ చేసిన ఆయ‌న కొంత హ‌డావుడి సృష్టించారు. ఇక‌, దీనిపై మ‌ళ్లీ నోరు విప్ప‌లేదు. తాను చేసిన రాజీనామాకు క‌ట్టుబ‌డి ఉన్నాన‌న్న గంటా.. త‌ర్వాత ప‌రిణామాల‌పై మాత్రం మౌనంగా ఉన్నారు. ప్ర‌స్తుతం గంటా అడ్ర‌స్ ఎక్క‌డ అనే ప‌రిస్థితి వ‌చ్చింద‌ని విశాఖ‌లో టాక్ న‌డుస్తోంది. రాజ‌కీయంగా కూడా ఆయ‌న టీడీపీలో ఉన్న‌ట్టా? లేన‌ట్టా? అనే సందేహాలు కూడా రాజ‌కీయ వ‌ర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.

వ‌స్తే.. వైసీపీలో చేర్చుకుంటామ‌ని.. కొన్నాళ్ల కింద‌ట‌.. ఆ పార్టీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి సాయిరెడ్డి ప్ర‌క‌టించారు. ఆ ప్ర‌క‌ట‌నకు ముందే ఆయ‌న గంటాను తీవ్రంగా తిట్టిపోశారు. ఆ త‌ర్వాత విశాఖ మునిసిప‌ల్ కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లో.. గంటా సైలెంట్ అయ్యారు. ఆయ‌న సొంత నియోజ‌క‌వ‌ర్గం నార్త్‌లో కూడా వైసీపీ తిరుగులేని విధంగా డివిజ‌న్ల‌లో పాగా వేసింది. పైగా కెకె రాజు దూకుడు ముందు గంటా బేజారే అవుతున్నారు. దీంతో కార్పొరేష‌న్‌లో గెలుపు గుర్రం ఎక్క‌డం కోస‌మే.. సాయిరెడ్డి అలా ప్ర‌క‌టించార‌నే ప్ర‌చారం జ‌రిగింది. అంటే.. గంటా యాక్టివ్ అయి.. టీడీపీ త‌ర‌ఫున ప్ర‌చారం చేస్తే.. వైసీపీకి ఇబ్బందులు త‌ప్ప‌వ‌నే వ్యూహంతో సాయిరెడ్డి అలా చేసి ఉంటార‌ని వ్యాఖ్య‌లు వినిపిస్తున్నాయి.

ఈ వాద‌న ఎలా ఉన్నా.. ఆ త‌ర్వాత‌.. సాయిరెడ్డి సైలెంట్ అయిపోవ‌డం కూడా దీనిని బ‌ల‌ప‌రుస్తోంది. కార్పొరేష‌న్ ఎన్నిక‌ల త‌ర్వాత‌.. ఇటీవ‌ల మ‌ళ్లీ మంత్రి.. అవంతి శ్రీనివాస్ దూకుడుగా ఉండ‌డంతో గంటా విష‌యంలో సాయిరెడ్డి దోబూచులాడుతున్నార‌నే వాద‌న వినిపిస్తోంది. ఇక‌, అన్ని వైపుల నుంచి రాజ‌కీయంగా త‌న‌పై ఒత్తిళ్లు పెరుగుతున్నా.. గంటా ఎక్క‌డా స్పందించ‌డం లేదు దీనికి ప్ర‌ధాన కారణం.. ఆయ‌న‌పై ఉన్న ఆరోప‌ణ‌లేన‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. గ‌తంలో భూముల‌కు సంబంధించిన కేసుల‌తోపాటు పూజిత చిట్‌ఫండ్ కంపెనీకి సంబందించి వ‌చ్చిన ఆరోప‌ణ‌ల నేప‌థ్యంలోనే గంటా ఏమీ మాట్లాడ‌లేక పోతున్నార‌ని.. తెలుస్తోంది.

టీడీపీలో ఉన్నా.. ఆయ‌న యాక్టివ్‌గా లేక‌పోవ‌డం.. వైసీపీలోకి వ‌చ్చేవారిని ఆహ్వానిస్తామ‌న్నా.. రాక‌పోవ‌డం. వంటి ప‌రిణామాల వెనుక‌.. గంటా వ్యూహం.. కేవ‌లం త‌న‌పై ఉన్న ఆరోప‌ణ‌లేన‌ని తెలుస్తోంది. ఏదేమైనా.. గంటాకు మునుపున్న ఫాలోయింగ్ ఇప్పుడు లేద‌నేది వాస్త‌వం అంటున్నారు ప‌రిశీల‌కులు. అందుకే టీడీపీ కూడా ప‌ట్టించుకోన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తోంద‌ని చెబుతున్నారు. ఇక వైసీపీ మాత్రం గంటాను ఏదోలా టీడీపీకి దూరం చేద్దామ‌ని విశ్వ‌ప్ర‌య‌త్నాలు చేస్తోంది.