వైసీపీలో జగన్ తీరుతో చాలా మంది సీనియర్ నేతలు బయటకు కక్కలేక, మింగలేక చందంగా ఉన్నారు. ఆరే జగన్ కంటే ముందు 25 ఏళ్ల నుంచి రాజకీయం చేస్తున్నాం.. కనీసం తమకు గుర్తింపు, గౌరవం ఇవ్వడం లేదే అని వాపోతున్న వారి సంఖ్య ఎక్కువే. ఆనం రామనారాయణ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ ఇలాంటి కొందరు నేతలు జగన్ కంటే చాలా సీనియర్లు. వీరంతా కూడా జగన్ కేబినెట్లో మంత్రులుగా ఉన్నారు. ఇక ఆనం గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి వచ్చినప్పుడు జగన్ రెడ్ కార్పెట్ వేసి మరీ పార్టీలోకి ఆహ్వానించారు. అప్పటి వరకు వెంకటగిరి ఇన్‌చార్జ్‌లుగా ఉన్న నేతలను తప్పించేసి మరీ ఆనంకు అక్కడ పగ్గాలు ఇచ్చారు.
ఎన్నికల్లో గెలిచాక ఆనం మంత్రి పదవి ఆశించినా జగన్ ఇవ్వలేదు. సరే ఆయన సీనియార్టీకి తగినట్టుగా ఏదో ఒక నామినేటెడ్ పదవి ఇచ్చేసి ఉంటే ఆనం నిజంగానే సంతోషపడి ఉండేవారు. అదేం లేదు సరికదా ? జిల్లాలో జూనియర్లు చెప్పినట్టే ఆనం వినాలన్నట్టుగా పై నుంచి ఆదేశాలు, అసలు అపాయింట్‌మెంట్ లేకపోవడం, చివరకు ఆనంకు చిర్రెత్తుకొచ్చి సొంత పార్టీ అధిష్టానాన్నే టార్గెట్ చేసేలా ప్రెస్‌మీట్లతో పెద్ద యుద్ధమే నడిచింది. చివరకు విజయసాయి సైతం ఆనంపై చర్యలు తప్పవన్న హింట్ కూడా ఇచ్చే వరకు పరిస్థితి వెళ్లింది.
ఇక మరో రెండు, మూడు నెలల్లో కేబినెట్ ప్రక్షాళన ఉంది. ఆనం ఈ సారి ఖచ్చితంగా తనకు మంత్రి పదవి కావాలని పట్టుబడుతున్నారు. నెల్లూరు జిల్లా అంతటా తమ ఫ్యామిలీ ప్రభావం చూపుతుందని ఆనం చెపుతున్నారు. ముఖ్యంగా నెల్లూరు సిటీ, రూరల్, ఆత్మకూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో తమకు ఎక్కువ వర్గం ఉందని.. తమను కాదంటే సత్తా చూపుతామని పరోక్షంగా జగన్‌కే హెచ్చరికలు పంపుతోన్న పరిస్థితి కూడా ఉంది. ఈ సారి కనుక ఆనంకు మంత్రి పదవి ఇవ్వకపోతే ఆయన పార్టీలో తన అసమ్మతి గళాన్ని మరింతగా వినిపించడంతో పాటు 2024 ఎన్నికలకు ముందు పార్టీకి షాక్ ఇస్తూ బయటకు వస్తారనే అంటున్నారు.
ఆ మాటకు వస్తే టీడీపీలో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి పదవి ఇవ్వలేదనే ఆయన ఎన్నికలకు కొద్ది నెలల ముందే బయటకు వచ్చి వైసీపీలోకి వెళ్లి ఎమ్మెల్సీ అయ్యారు. ఇప్పుడు కూడా ఇక్కడ ప్రాధాన్యం లేకపోవడంతో మళ్లీ వైసీపీలోనూ అదే సీన్ రిపీట్ చేస్తారా ? అన్న సందేహమే ఇప్పుడు అందరికి ఉంది.
Gulte Telugu Telugu Political and Movie News Updates