నా వల్ల పొలిటికల్ మైలేజ్ లేదని ఇగ్నోర్ చేశారు – ఆనందయ్య

క‌రోనా విజృంభించిన స‌మ‌యంలో దీనికి నివార‌ణ‌గా మందును రూపొందించి రాత్రికి రాత్రి సంచ‌ల‌నం సృష్టించిన నెల్లూరు జిల్లా కృష్ణ‌ప‌ట్నం ప్రాంతానికి చెందిన ఆనంద‌య్య‌.. నిజానికి చాలా నిదాన‌స్తుడ‌నే పేరు తెచ్చుకున్నారు. అలాంటి ఆనంద‌య్య‌.. తాజాగా ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌.. స‌హా ఇటీవ‌ల వ‌ర‌కు స‌న్నిహితంగా ఉన్న అధికార పార్టీ ఎమ్మెల్యేల‌పై తీవ్ర‌స్థాయిలో విరుచుకుప‌డ్డారు. ‘లాభం’ లేద‌నే త‌న‌ను వ‌దిలేశార‌ని నిప్పులు చెరిగారు. మందు పంపిణీకి ప్రభుత్వం సహకరించకపోవడం బాధాకరమని ఆనందయ్య అన్నారు.

మందు త‌యారీ ఊరికేనే జ‌ర‌గ‌ద‌ని.. ప‌నిచేసేవారికి వేత‌నాలు ఇవ్వాల‌ని.. అలాగే మూలిక‌ల‌ను కొన్ని ప్రాంతాల నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంద‌ని దీనికి నిదులు అవ‌స‌ర‌మ‌ని.. ఈ విష‌యాన్ని ప్ర‌భుత్వానికి చెప్పినా.. ప్ర‌యోజ‌నం లేకుండా పోయింద‌ని.. త‌న వ‌ల్ల‌.. స‌ర్కారుకు లాభం లేద‌ని భావించినందునే త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఆనంద‌య్య ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం.

మందు పంపిణీ కోసం ప్రభుత్వానికి లేఖ రాశానని, ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన లేదని అన్నారు. సరైన సామాగ్రి లేక మందు తయారీ విషయంలో వెనుకబడ్డానని ఆనందయ్య చెప్పారు. అయినా ప్రతి జిల్లాలో దాతల సహకారంతో ప్రజలకు మందు అందజేస్తున్నామని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా అడిగినవారందరికీ మందు అందిస్తున్నట్లు తెలిపారు. అయితే బడ్డి బంకుల్లో తన మందు అమ్ముతున్నారంటే.. అది ప్రభుత్వ లోపమని, అటువంటి వారిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ఆనందయ్య కోరారు.

కరోనా బాధితులు ఎంతమంది ఉన్నా అందరికీ ఉచితంగా మందు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని ఆనందయ్య స్పష్టం చేశారు. రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ప్రజా ప్రతినిధుల ద్వారా మందు అందజేస్తున్నామని చెప్పారు. మొదటి నుంచి తనకు వెన్నుదన్నుగా నిలబడిన వారు.. ఇప్పుడు ‘లాభం’ లేద‌నే త‌న‌ను ప‌ట్టించుకోవ‌డం మానేశార‌ని ఆనంద‌య్య వ్యాఖ్యానించ‌డం.. స్థానికంగా ఉన్న వైసీపీ నేత‌ల‌పై విమ‌ర్శ‌లు చేసిన‌ట్టు అయింది. మందు పంపిణీ పార్టీలకు అతీతంగా చేస్తున్నామని, ఏయే జిల్లాల్లో ఎన్ని పాజిటీవ్ కేసులు ఉన్నాయో ప్రజాప్రతినిధులు, అధికారులు తెలుసుకుని ఏ విధంగా చేయాలో సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆనందయ్య కోరారు.