టీవీ షోల్లో యాంకర్‌గా వ్యవహరిస్తున్న ప్రదీప్.. మరోసారి అడ్డంగా బుక్కయ్యాడు. గతంలోనూ పలుమార్లు.. ఆయన నోరు జారడంతో పాటు మద్యం తాగి కారు నడిపిన ఘటనలో ఏడాది పాటు లైసెన్స్ సస్పెండ్ అయిన విషయాలు తెలిసిందే. మరి రేటింగ్ కోసం నోరు జారాడో.. లేక ఏపీ ముఖ్యమంత్రి జగన్‌పై తనకు ఉన్న అభిమానం కొద్దీ అలా అన్నాడో.. ఇవన్నీ కాకుండా.. తన మనసులో ఉన్న కోరికను బయటకు పెట్టాడో తెలియదు కానీ.. యాంకర్ ప్రదీప్.. టంగ్ స్లిప్పయి.. తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు.
ఇటీవల ఓ టీవీ చానెల్‌లో షో చేస్తూ.. సందర్భాను సారంగా.. ప్రదీప్ దూకుడు వ్యాఖ్యలు సంధించాడు. దీనిలో భాగంగా ఆయన “ఏపీ రాజధాని విశాఖ” అని పదే పదే వ్యాఖ్యలు చేశాడు. అప్పట్లోనే ఈ టీవీ షోలో పాల్గొన్న వారు.. ఈ వ్యాఖ్యలు చేయడంపై నివ్వెర పోయారు. ఇక, ఈ వ్యాఖ్యలే.. ప్రదీప్‌కు తీవ్ర ఇబ్బందిగా పరిణమించాయి. మూడు రాజధానులకు వ్యతిరేకంగా ఒకవైపు 550 రోజులుగా రాజధాని అమరావతి ప్రజలు ఉద్యమిస్తున్నారు. ప్రభుత్వ విమర్శలు, పోలీసుల కేసులను కూడా ధైర్యంగా ఎదుర్కొంటూ.. ఐదు కోట్ల ఆంధ్రుల కోసం.. ఉద్యమాలను కొనసాగిస్తున్నారు.
ఇక, అమరావతిని అస్థిరపరడంపై ఇక్కడి ప్రజలు.. కోర్టుకు కూడా వెళ్లారు. ప్రస్తుతంమూడు రాజధానుల విషయం హైకోర్టులో విచారణలో ఉంది. ఇక, ఎన్నేళ్లయినా.. ఉద్యమాన్ని విడిచి పెట్టేది లేదని.. ఏపీ రాజధానిగా అమరావతి మాత్రమే ఉంటుందని ప్రభుత్వం ప్రకటించాలని ఇక్కడివారు కోరుతూ.. ఉద్యమాలను తీవ్రతరం చేస్తున్నారు. కరోనా విపత్కర సమయంలోనూ ఇక్కడి ప్రజలు ఉద్యమాలు సాగుతూనే ఉన్నాయి. ఇలాంటి సమయంలో ఓ రియాల్టీ షోలో యాంకర్‌గా ఉన్న ప్రదీప్ ఏపీ రాజధానిగా విశాఖను పేర్కొనడంపై అమరావతి ఉద్యమ కారులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
కోర్టు పరిధిలో విచారణలో ఉన్న అంశంపై ప్రదీప్ ఎలా మాట్లాడతారని.. అమరావతి జేఏసీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. ప్రదీప్ తన వ్యాఖ్యలను అదే షోలో లేదా.. అదే టీవీలో వెనక్కితీసుకుని.. అమరావతి ప్రజలకు, ఏపీ ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే.. వేలాది మంది ఉద్యమకారులు ప్రదీప్ నివాసాన్ని ముట్టడించడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. మరి ఈ వివాదం ముదురుతుందో.. ఆదిలోనే సమసిపోతుందో చూడాలి.
Gulte Telugu Telugu Political and Movie News Updates