రేసులో ఉన్న తెలుగు ఎంపిలు

తొందరలో నరేంద్రమోడి తన మంత్రివర్గాన్ని విస్తరిస్తారనే ప్రచారం ఊపందుకుంటున్న విషయం తెలిసిందే. ఈనెల 21వ తేదీనే మంత్రివర్గ విస్తరణ ఉంటుందని, కాదు కాదు వచ్చే నెలలో ఉంటుందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారానికి కారణం ఏమిటంటే మంత్రిమండలిలో ఉండాల్సిన సంఖ్యకన్నా 25 తక్కువుండటమే. మరో కారణం ఏమిటంటే వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్న రాష్ట్రాల్లో పార్టీని బలోపేతం చేయాలంటే ఆ రాష్ట్రాల్లో మంత్రుల ప్రాతినిధ్యాన్ని పెంచాలని మోడి అనుకుంటున్నారట.

సరే మంత్రివర్గ విస్తరణకు ఎన్ని కారణాలున్నా విస్తరణ ఖాయమే అనే ప్రచారమైతే ఊపందుకుంటోంది. ఈ నేపధ్యంలోనే ఏపి నుండి కూడా ఈసారి మంత్రిమండలిలో ఒకరికి చాన్సుంటుందనే ప్రచారం జరుగుతోంది. ఇప్పటివరకు కేంద్రమంత్రి మండలిలో ఏపికి చాన్సు లేదన్న విషయం అందరికీ తెలిసిందే. ఎందుకు లేదంటే లోక్ సభలో కానీ రాజ్యసభలో కానీ ఏపి నుండి బీజేపీ తరపున ఎవరు ప్రాతినిధ్యం వహించటంలేదు.

అయితే మొన్నటి ఎన్నికల తర్వాత టీడీపీ నుండి నలుగురు రాజ్యసభ ఎంపిలు సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు బీజేపీలోకి ఫిరాయించారు. మరో తెలుగు వ్యక్తే జీవిఎల్ నరసింహారావు రాజ్యసభ ఎంపిగా ఉన్నా ఆయన ఉత్తరప్రదేశ్ నుండి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇలాంటి సమీకరణల్లోనే జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు కూడా కేంద్రమంత్రి పదవి అనే ప్రచారం తెలిసిందే.

అయితే బీజేపీ వర్గాల సమాచారం ఏమిటంటే మంత్రిపదవి రేసులో జీవిఎల్, సీఎం రమేష్ గట్టిగా ఉన్నారట. మొదట్లో టీజీ వెంకటేష్ పేరు వినిపించినా చివరకు ప్రచారంలో పై రెండు పేర్లే వినబడుతున్నాయి. ఈ రెండు పేర్లలో కూడా సీఎం రమేష్ పేరు గట్టిగా వినబడుతున్నట్లు కమలనాదుల సమాచారం. నిజానికి పై ఎంపిల్లో ఎవరికి మంత్రిపదవి ఇచ్చినా బీజేపీకి వచ్చే లాభం ఏమీలేదనే చెప్పాలి. ఇదే సమయంలో ఎవరికీ ఇవ్వకపోయినా కొత్తగా జరిగే నష్టమూ లేదు. ఎందుకంటే టీజీ వెంకటేష్ మినహా మిగిలిన ఎంపిల్లో ఎవరు కూడా జనాల్లో నుండి ఎదిగిన నేతలు కారు. మరి ఏపి విషయంలో నరేంద్రమోడి ఆలోచనలు ఎలాగున్నాయో చూడాల్సిందే.