ఏపీ సీఎం జగన్.. లక్ష్యం అందరికి తెలిసిందే. వచ్చే 30 ఏళ్లపాటు తానే ఏపీకి ముఖ్యమంత్రిగా ఉండాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ క్రమంలోనే గతంలో ఏ ప్రభుత్వమూ.. చేయని విధంగా ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. అదేసమయంలో పింఛన్లను పెంచడంతోపాటు.. పేదలకు ఇళ్లు కూడా ఇస్తున్నారు. దేశ చరిత్రలోనే ఏ ముఖ్యమంత్రి అమలు చేయని విధంగా జగన్ ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోన్న మాట వాస్తవం. ఆయా కార్యక్రమాలను నిరంతరం కొనసాగించేందుకు పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. ఇవన్నీ కూడా ఇటు జగన్‌కు, అటు ఆయన సర్కారుకు పేరు తెచ్చే పథకాలే.
మరీ ముఖ్యంగా అమ్మ ఒడి, చేయూత, జగనన్న విద్యా కానుక, నాడు – నేడు, వలంటీర్ వ్యవస్థ, పేదలకు ఇళ్లు, రైతు భరోసా, రైతు భరోసా కేంద్రాలు వంటివి మరింతగా జగన్ ఇమేజ్ను పెంచాయి. అయితే.. వీటి లో ఎక్కువగా ప్రభుత్వంపై ఆర్థిక భారం పడేవే కావడం గమనార్హం. వీటిలోనూ అమ్మ ఒడి, చేయూత, విద్యాకానుక, రైతు భరోసా వంటివి.. ప్రభుత్వానికి మరింత భారంగా మారాయి. వీటిని మరో మూడేళ్ల పాటు కొనసాగించాల్సిన అవసరం ఉంది.
అయితే, ఆయా పథకాలకు అవసరమైన నిధుల విషయం ప్రభుత్వం తర్జన భర్జన పడుతోంది.
నిత్యం ప్రభుత్వానికి వచ్చే ట్యాక్స్‌లు, రుసుముల సొమ్ము మొత్తం.. ఆయా సంక్షేమ పథకాలకే ఖర్చయిపోతోంది. కరోనా ఎఫెక్ట్ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. దీంతో ఉద్యోగులకు ఇచ్చే జీతాలు.. ఇతర ఖర్చులకు నిధుల లేమి వెంటాడుతోంది. ఈ నేపథ్యంలోనే పేదలకు ఇళ్లు కార్యక్రమానికి కేంద్రం సాయంచేయాలని.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన కింద ఈ పథకాన్ని కొనసాగించాలని తాజాగా జరిగిన ఢిల్లీ పర్యటనలో జగన్ కేంద్ర మంత్రులను అభ్యర్థించారు. పేరు తెచ్చే పథకాలే అయినప్పటికీ.. నిధుల లేమి.. జగన్ ను ఇప్పుడే ఇబ్బంది పెడితే..వచ్చే మూడేళ్లపాటు వాటిని కొనసాగించడం కష్టమే. దీని నుంచి ఎలా బయటపడతారు? వాటిని ఏ విధంగా కొనసాగిస్తారు.. అనేది ఆసక్తిగా మారింది.