మోడీ కథ ఎంత రివర్స్ అయ్యిందంటే..

రాజీవ్ గాంధీ మరణానంతరం గత మూడు దశాబ్దాల్లో మరే ప్రధానికీ రాని పాపులారిటీ నరేంద్ర మోడీ సొంతం అంటే అతిశయోక్తి కాదు. ప్రధాని కావడానికి ముందు, తర్వాత ఆయనకు లభించిన ఆదరణ అపూర్వం. ఒకప్పుడు మోడీ ఏం చెప్పినా, ఏం చేసినా ఆకర్షణీయంగానే ఉండేది. ఆయన మాటను భాజపా కార్యకర్తలే కాదు.. సామాన్యులు సైతం శ్రద్ధగా వినేవాళ్లు. ఆయనేం చెప్పినా నమ్మేవాళ్లు.

2014లో అధికారంలో వచ్చిన తర్వాత మోడీ ఫాలోయింగ్ ఎలా ఉండేదంటే.. ఆయన పెద్ద పెద్ద తప్పులు చేసినా కూడా జనాలు మన్నించారు. 2016లో జనాలను ఏమాత్రం సన్నద్ధం చేయకుండా డీమానిటైజేషన్ ప్రకటించి, తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా.. దాని వల్ల సాధిస్తానన్న ఫలితాలేమీ సాధించకపోయినా, దేశం మీద అదనపు భారం మోసినా.. నల్లధనం తిరిగి తెస్తాన్న హామీని నిలబెట్టుకోకపోయినా.. అలాగే జీఎస్టీ పేరుతో కొత్త పన్ను విధానం తెచ్చి జనాలను బాదేసినా కూడా మన్నించారు. 2019లో మళ్లీ మంచి మెజారిటీ ఇచ్చిన మోడీని గద్దెనెక్కించారు.

ఐతే ఎల్లకాలం జనాల మూడ్ ఒకేలా ఉండదు. కొన్ని తప్పులు క్షమిస్తారేమో కానీ.. ఎల్లకాలం మన్నింపులుండవు. జనాల సహనానికి కూడా హద్దులుంటాయి. మోడీ ఈ విషయాన్ని గుర్తించలేకపోయారు. కరోనా టైంలో కూడా పని చేయడం మానేసి, ఎప్పట్లాగే ఘనమైన కబుర్లతో కాలక్షేపం చేసిన ఆయన.. తీవ్రాతి తీవ్రమైన వ్యతిరేకతను మూటగట్టుకున్నారు. గత ఏడాది కరోనా కొత్తలో మోడీ వైఫల్యాన్ని జనాలు మన్నించారు కానీ.. సెకండ్ వేవ్ టైంలో చేష్టలుడిగిన ప్రధాని విషయంలో జనాగ్రహం పతాక స్థాయికి చేరిందని తాజా పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. మోడీ పేరెత్తితే ఇప్పుడు సోషల్ మీడియా జనాలు మంటెత్తిపోతున్నారు. ఆయన గురించి ఎవరైనా పాజిటివ్‌గా మాట్లాడితే విరుచుకుపడుతున్నారు. ఆయన మంచి మాట చెప్పినా కూడా కౌంటర్లు తప్పట్లేదు.

నిన్న వ్యాక్సినేషన్ విషయమై జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నట్లు అప్‌డేట్ బయటికి రావడం ఆలస్యం.. ఆయనపై కౌంటర్లు మొదలైపోయాయి. ఇక వ్యాక్సినేషన్ ఫ్రీ అంటూ మంచి వార్తే చెప్పినా జనాల నుంచి సానుకూలాభిప్రాయం కనిపించలేదు. ఎఫ్పుడో చేయాల్సిన పని ఇప్పుడు చేస్తున్నారా.. సుప్రీం కోర్టు అక్షింతలు వేస్తే కానీ బుద్ధి రాలేదా.. వ్యాక్సినేషన్ విషయంలో ఒక పాలసీ అంటూ ఉండదా.. ఇన్నాళ్లు ఏం చేశారు అంటూ ఆయన మీద ప్రశ్నల వర్షం కురిసింది. మోడీని విమర్శిస్తూ ఎన్ని మీమ్స్ పడ్డాయో, కార్టూన్లు వచ్చాయో లెక్కలేదు. ఇదంతా చూస్తే మోడీ గోల్డెన్ పీరియడ్ ముగిసిందని, కథ మొత్తం రివర్స్ అవుతోందని, ఇక ఆయనకు ఏదీ అంత తేలిక కాదని స్పష్టంగా తెలుస్తోంది.