కేంద్రప్రభుత్వం అనుసరిస్తున్న టీకాల విదానాన్ని సుప్రింకోర్టు తప్పుపట్టింది. ఒకరికి ఉచితంగాను మరొకరికి డబ్బులిచ్చి వేయించుకోవాలని చెప్పటాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. 60 ఏళ్ళున్న వాళ్ళకి కేంద్రం టీకాలను ఉచితంగా వేయించటం ఏమిటి ? 18-45 మధ్య వారికి మాత్రం రాష్ట్రాలు టీకాలను కొని వేయించాల్సి రావటం ఏమిటి ? అంటు నిలదీసింది. అలాగే కేంద్రం-రాష్ట్రాలకు టీకాల ఉత్పత్తి సంస్ధలు రెండు రకాల ధరలను నిర్ణయించటాన్ని కూడా తీవ్రంగా తప్పుపట్టింది. మొత్తానికి టీకాల కార్యక్రమం పూర్తిగా అసంబద్దంగా ఉందని తేల్చేసింది.
టీకాల కార్యక్రమం మొత్తాన్ని పూర్తిగా సమీక్షించి మళ్ళీ విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాలని ఆదేశించింది. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ కోసం కేంద్రం గతంలో కేటాయించానని ప్రకటించిన రు. 35 వేల కోట్లను ఖర్చుచేసిన విధానాన్ని కూడా తనముందు ఉంచాలని స్పష్టంగా చెప్పింది. ఇప్పటికే రు. 35 వేల కోట్ల ఖర్చులపై దేశవ్యాప్తంగా బాగా నిరసనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ఖర్చుల వివరాలను ప్రకటించమంటే కేంద్రం పెద్దగా పట్టించుకోవటంలేదు. అదే విషయాన్ని ఇపుడు సుప్రింకోర్టు నిలదీసింది.
ఇక టీకాల కోసం రూపొందించిన కోవిన్ యాప్ పనితీరును కూడా ఆక్షేపించింది. నిజానికి కవిన్ యాప్ ఉందనే కానీ సరిగా పనిచేయటంలేదు. టీకాలు వేసే కేంద్రాల వివరాలను సక్రమంగా చూపించటంలేదు. చాలాసార్లు ఏదో ప్రాబ్లెమ్ వచ్చినట్లే చూపిస్తోంది. కరోనా వైరస్ మూడో దశలో 18-45 ఏళ్ళ వాళ్ళకే కాకుండా చిన్నపిల్లలకు కూడా ముప్పుగా మారుతుందన్న నిపుణులు, శాస్త్రవేత్తల హెచ్చరికలను సుప్రింకోర్టు ప్రస్తావించింది.
మొత్తంమీద టీకాల కార్యక్రమమనే కాకుండా యావత్ కరోనా నియంత్రణ విధానంలో కేంద్రం పెయిలైందన్న పద్దతిలోనే సుప్రింకోర్టు ఆక్షేపించింది. ఈ ఏడాది చివరికి ఎన్ని కోట్ల డోసులు ఉత్పత్తవుతాయి, ఎంతమందికి వేయబోతున్నారనే విషయంపై స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. జనాలందరికీ ఉచితంగా టీకాలు ఎందుకు వేయకూడదని నిలదీసింది. మరి కొత్త విధానాన్ని ఎప్పటిలోగా కేంద్రం ప్రకటిస్తుందో చూడాలి.