‘తెలుగుదేశంపార్టీ పెట్టినపుడు 80-90 శాతం మంది యువకులే ఉన్నారు’ ..ఇది తాజాగా మాజీమంత్రి, సీనియర్ నేత యనమల రామకృష్ణుడు చెప్పిన మాటలు. రెండు రోజుల డిజిటల్ మహానాడు సందర్భంగా యనమల మాట్లాడుతు యువతకు ప్రాధాన్యత ఇస్తేనే పార్టీ బలోపేతమవుతుందన్నారు. ఎన్టీయార్ పార్టీ పెట్టినపుడు 90 శాతం మంది యువతే ఉండేవారన్నారు. యువత ప్రాధాన్యత తెలుసు కాబట్టే టికెట్లు, పదవుల్లో ఎక్కువభాగం యువతకే ఎన్టీయార్ కేటాయించినట్లు యనమల చెప్పారు.
నిజమే యనమల చెప్పిందాట్లో ఏమీ తప్పుపట్టాల్సింది లేదు. కానీ యువత ప్రాధాన్యత గురించి చెప్పిన యనమల మరి తాను మాత్రం ఎందుకని ఇంకా పదవులను పట్టుకుని ఊగలాడుతున్నారు. ఎంఎల్ఏ పోటీచేయాలంటే టికెట్ తనకే కావాలి. ఎంఎల్సీ అవకాశం ఉంటే అదీ తనకే కావాలి. శాసనమండలి కీలక పోస్టు ఆయనకే కావాలి. పార్టీ పాలిట్ బ్యూరో సభ్యత్వంలో తానే ఉండాలి. అధికారంలో ఉంటే మంత్రివర్గంలో తానే ఉండాలి.
తునిలో కొత్తవాళ్ళకు ఎవరికైనా టికెట్ ఇవ్వాలంటే యనమల ఒప్పుకోరు. తాను వరుసగా ఓడిపోతున్నా వేరేవాళ్ళకు టికెట్ ఇస్తే అంగీకరించలేదు. కాబట్టి తనకు బదులు తన తమ్ముడు యనమల కృష్ణుడికే టికెట్ ఇప్పించుకున్నారు. మొత్తంమీద అన్నా, తమ్ముళ్ళిద్దరు కలిసి నాలుగుసార్లు ఓడిపోయారు. ఇది ఒక యనమల వ్యవహారమే కాదు. అన్నీ జిల్లాల్లో చాలామంది సీనియర్ల వరస ఇలాగే ఉంది. పార్టీలో కొత్త రక్తం రావాలని, యువతకు పెద్దపీట వేయాలని ఉపన్యాసాలు మాత్రం ఇస్తారు.
పార్టీ సీనియర్ల నేతల్లో 70 ఏళ్ళు దాటిన వారంతా స్వచ్చంధంగా తప్పుకుని యువతకు అవకాశాలు ఇవ్వచ్చు కదా ? మళ్ళీ ఆ పనిమాత్రం చేయరు. యువతంతే మళ్ళీ తమ వారసులు మాత్రమే ఉండాలని కోరుకుంటారు. ఇలాంటి స్ధితిలో ఇక కొత్తతరానికి అవకాశాలు ఎక్కడ వస్తాయి. ఉపన్యాసాలు దంచటం కాదు ఆచరణలో చూపించినపుడే పార్టీ బలోపేతమవుతుంది. లేకపోతే ఎన్ని మహానాడులు పెట్టుకున్నా ఉపయోగముండదు.
Gulte Telugu Telugu Political and Movie News Updates